‘ప్లాస్టిక్‌’పై సమరభేరి

ABN , First Publish Date - 2022-07-04T05:35:34+05:30 IST

మానవాళి మనుగడకు పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్‌పై కేంద్రప్రభుత్వం సమరభేరి మోగించింది. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా సింగిల్‌ యూజ్‌, 120 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

‘ప్లాస్టిక్‌’పై సమరభేరి

- నిషేధం అమలు దిశగా కఠిన చర్యలు 

- అవగాహనతోపాటు ఆకస్మిక దాడులు

- అమ్మినా...కొన్నా... భారీ జరిమానా 

కరీంనగర్‌ టౌన్‌, జూలై 3: మానవాళి మనుగడకు పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్‌పై కేంద్రప్రభుత్వం సమరభేరి మోగించింది. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా సింగిల్‌ యూజ్‌, 120 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ (ఎస్‌యూపీ) వ్యర్థాలు  నగరాలు, పట్టణాలతోపాటు గ్రామాల్లో కొండలా పేరుకుపోతున్నాయి. తక్కువ మందం కలిగిన ఇవి మట్టిలో కలిసేందుకు దశాబ్దాలు పడుతుంది. వివిధ దశల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం పలుమార్లు కార్యాచరణ చేపట్టడంతోపాటు నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో ప్లాస్టిక్‌ వినియోగం తగ్గలేదు సరికదా... రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ పకడ్బందీగా అమలుకు చర్యలు ప్రారంభించింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రధానంగా నగరపాలక, మున్సిపల్‌, పంచాయతీ అధికారులు ప్లాస్టిక్‌ నిషేధం అమలుపై దృష్టి కేంద్రీకరించారు.

- విచ్చలవిడిగా వినియోగం

 వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లు,  దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు, కర్రీ పాయింట్లు, చిరు వ్యాపారులు, పండ్ల బండ్లు తదితర ప్రాంతాల్లో ఒకసారి వాడి పడేసే కవర్లను విచ్చలవిడిగా వినియోస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు.. చదువుకున్న వారి నుంచి మొదలు కార్మికుల వరకు ప్రతి ఒక్కరూ చేతిలో రెండు, మూడు కవర్లు వెంట తీసుకెళ్లడం సాధారణ విషయంగా మారింది. బయటకు వచ్చే సమయంలో బట్ట సంచులు తీసుకురవాలనే ఆలోచన చేయడం లేదు. కొంతమంది వ్యాపారులైతే వినియోగదారులకు కనీస అవగాహన కల్పించకుండా ఇదే పనిగా వీటిని వాడుతున్నారు. పాలిథిన్‌ సంచులు నిషేధించడానికి గతంలో హడావుడి చేసిన అధికార యంత్రాంగం ఆ తర్వాత విస్మరించింది. కొవిడ్‌ కారణంగా తనిఖీలు వదిలేయగా.. వ్యాపారులు సైతం ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తుండటంతో గత ఏడాది రోజుకు సుమారు 20 టన్నుల మేర వ్యర్థాలు బయట వదిలేశారు. 

- 120 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై నిషేధం

ఇప్పటికే 50 మైక్రాన్ల మందం గల ప్లాస్టిక్‌, కవర్ల వాడకాన్ని నిషేధించారు. ఒకసారి వాడి పడేయకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 75 మైక్రాన్లకు పెంచింది. గత ఏడాది డిసెంబరు నుంచి 120 వైక్రాన్ల లోపు కవర్లనునిషేధిత జాబితాలో చేర్చింది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ, అమ్మకం, వాడకాన్ని జూలై 1 నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టిక్‌ స్టిక్స్‌ నుంచి తయారు చేసిన ఇయర్‌ బడ్స్‌, ప్లాస్టిక్‌ జెండాలు, ఐస్‌క్రీం పుల్లలు, క్యారీ బ్యాగ్స్‌, ప్యాకింగ్‌ చేయడం, సిగరెట్‌ ప్యాకెట్లు, ప్లాస్టిక్‌ చెంచాలు, ఫోర్కులు, ప్లేట్లు, కత్తులు, థర్మకోల్‌తో చేసిన అలంకరణ వస్తువులు, కప్పులు, అద్దాలు, స్టిక్కర్లు, స్ర్టాలు, మిఠాయి డబ్బాలు, ఆహ్వానపత్రాలు, 100 మైక్రాన్ల కంటే తక్కువ కలిగిన పీవీసీ బ్యానర్లు, బెలూన్లకు కట్టే ప్లాస్టిక్‌ స్టిక్స్‌ వంటివి పూర్తిగా నిషేధించనున్నట్లు ఉత్తర్వుల్లో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్దేశించిన మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్‌ కవర్లు తయారు చేసిన వారికి 50 వేలు, అమ్మిన వారికి 2,500 నుంచి ఐదు వేలు, వాడిన వ్యక్తులకు 250, 500 రూపాయల నుంచి 5 వేల వరకు జరిమానా విధించనుంది.

- విస్తృత తనిఖీలు...ఆకస్మికదాడులు

ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ సంచులను, వస్తువులను పూర్తిగా నిషేధిత జాబితాలో చేర్చడంతో అన్ని మున్సిపాలిటీలు, నగరపాలికల్లో సిటీ లెవల్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో కమిషనర్‌, సానిటరీ సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టరు, ఎన్‌జీవో, పోలీసు కానిస్టేబుల్‌ కమిటీలో ఉంటారు. వీరంతా ఈ నెల 1 నుంచి తనిఖీలు చేయడంతోపాటు జరిమానా విధిస్తారు. ప్రజలకు, వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా వాడుకునే వస్తువులను వివరించున్నారు. దీనికోసం ప్రధాన రహదారులపై ప్రచార బోర్డులు, హోర్డింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. విస్తృతంగా ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 

- ప్రత్యామ్నాయం తప్పనిసరి 

ఇప్పటి వరకు అనేకసార్లు 50 మైక్రాన్ల మందంలోపు కలిగిన ప్లాస్టిక్‌పై నిషేఽధం విధించినప్పటికి క్షేత్రస్థాయిలో నిషేధాజ్ఞలు సంపూర్ణంగా అమలుకాలేదు. దీంతో ప్రజలు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంపై పెద్దగా దృష్టి సారించలేదు. అడపాదడపా అక్కడక్కడ నిషేఽధం విధించి దాడులు చేసిన సందర్భంలో కొద్దిరోజులు బట్ట సంచులు, జూట్‌ సంచులు, పేపర్‌ క్యారీ బ్యాగులు, 50 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ కవర్లతో నెట్టుకువచ్చారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌పై సమరభేరి మోగించి దశలవారీగా ప్లాస్టిక్‌ ఉత్పత్తిని బంద్‌ చేయించే చర్యలు చేపడుతుంది. నిషేధిత ప్లాస్టిక్‌ సంచులు, వస్తువులను అమ్మినా... కొనుగోలు చేసినా లేదా వాటిని వినియోగించినా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి వాటిని సాఽ్వధీనం చేసుకోవడంతోపాటు భారీ జరిమానా విధిస్తారు. అవసరమైతే కోర్టులో హాజరు పరిచి శిక్ష కూడా వేయించే విధంగా చట్టాన్ని రూపొందించారు. దీంతో ఇక ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం వాడాల్సిన పరిస్థితులు రానున్నాయి. గతంలో మాదిరిగానే బట్ట సంచులు, జూట్‌ బ్యాగులు, పేపర్‌ కవర్లను, బట్ట బ్యానర్లను వాడే రోజులు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

Updated Date - 2022-07-04T05:35:34+05:30 IST