పెద్దిరెడ్డిని ఎదుర్కోవడం కోసం.. సుమారు పదిమంది ముఖ్యనేతలను..

ABN , First Publish Date - 2021-09-03T07:20:24+05:30 IST

పెద్దిరెడ్డిని ఎదుర్కోవడం కోసం..

పెద్దిరెడ్డిని ఎదుర్కోవడం కోసం.. సుమారు పదిమంది ముఖ్యనేతలను..

ప్రజల పక్షాన పోరాడండి!

నేతలు పార్టీని వీడిన చోట్ల కొత్త నాయకత్వం రావాలి

టీడీపీ నేతలకు అధినేత చంద్రబాబు ఆదేశం

పుంగనూరు నాయకత్వంపై అభిప్రాయ సేకరణ

నేడు ముఖ్య నేతలతో మరోసారి సమావేశం


తిరుపతి(ఆంధ్రజ్యోతి): జిల్లా నాయకత్వం కలసికట్టుగా ప్రజల పక్షాన పోరాడాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యనేతలను ఆదేశించారు. గురువారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్‌ కారణంగా జిల్లాలో పార్టీ నాయకులు, శ్రేణులు ఇంతకాలం పార్టీ కార్యకలాపాల విషయంలో మందకొడిగా వ్యవహరించారన్నారు. అయితే ఇకపై చురుగ్గా పనిచేయాల్సిన అవసరముందన్నారు. జిల్లాలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ ఎవరికి వారుగా కాకుండా జిల్లా అంతా ఒక యూనిట్‌గా కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు.


వైసీపీ ప్రభుత్వం ఏర్పడి అప్పుడే రెండున్నరేళ్ళు కావస్తోందని, ఇక మిగిలిన వ్యవధల్లా రెండేళ్ళే కనుక ప్రభుత్వ తప్పిదాలు, అధికార పార్టీ నేతల తప్పిదాలను జనంలోకి బలంగా తీసుకెళ్ళాలని ఆదేశించారు. తద్వారా పార్టీని బలోపేతం చేయాలన్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను, అక్రమాలను ఎదుర్కొనే విషయంలో చురుగ్గానే కాకుండా పౌరుషంతో వ్యవహరించాలని నాయకులకు నొక్కి చెప్పారు. వైసీపీ ప్రలోభాలతోనూ, వారి వేధింపులతోనూ పార్టీని వీడిన నాయకుల స్థానంలో కొత్త నాయకత్వాన్ని నియమించే విషయమై దృష్టి సారించాలన్నారు. అంతకు మునుపు ఆయన జిల్లాలో పార్టీ స్థితిగతులపై ఆరా తీశారు. శుక్రవారం మరోసారి చంద్రబాబు జిల్లా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.


గురువారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమరనాధరెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీలు దొరబాబు, బీద రవిచంద్ర, పుంగనూరు నియోజకవర్గ నేతలు చల్లా రామచంద్రారెడ్డి, అనీషారెడ్డి, శ్రీనాధరెడ్డి, ఎస్‌కే రమణారెడ్డి, నగరి ఇంఛార్జి గాలి భానుప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.


పుంగనూరుపై అభిప్రాయ సేకరణ

పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని దీటుగా ఎదుర్కొనేందుకు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. దీనికోసం పుంగనూరు నియోజకవర్గం నుంచీ సుమారు పదిమంది ముఖ్యనేతలను మంగళగిరికి రప్పించారు. గురువారం సాయంత్రం వారితో సమావేశమైన చంద్రబాబు పుంగనూరు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డిని సమర్ధవంతంగా ఎదుర్కొనగలిగే నాయకులెవరన్న దానిపై కూడా వారి నుంచీ అభిప్రాయాలు సేకరించినట్టు సమాచారం. నియోజకవర్గ నాయకత్వం విషయంలో కూడా ఓ నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో పుంగనూరు నియోజకవర్గ నేతలతో శుక్రవారం మరో విడత సమావేశం కానున్నారు. దీంతో నేడు జరగనున్న సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

Updated Date - 2021-09-03T07:20:24+05:30 IST