Abn logo
Sep 21 2021 @ 01:08AM

వైసీపీలో లడాయి

ముండ్లమూరులో రోడ్డుకు ఇరువైపులా మోహరించిన మద్దిశెట్టి, బూచేపల్లి వర్గీయులు

ఎంపీపీ పదవులకు పలుచోట్ల పోటాపోటీ  

ఇరకాటంలో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు

మంత్రి వద్దకు ముండ్లమూరు పంచాయితీ

ఎవరి వాదనలు వారు వినిపించిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే

పలుచోట్ల ఆరంభమైన డబ్బు రాజకీయం 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు) 

విపక్షం పోటీలేని పరిషత్‌ ఎన్నికల్లో భారీ విజయాలు సాధించిన అధికార పార్టీకి ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక సవాల్‌గా మారింది. పలుచోట్ల ఒకరికి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీపడటం, ఎంపీటీసీ సభ్యులపై ప్రలోభాల వ్యవహారం ప్రారంభం కావటం ఆపార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లపై తీవ్రమైన వత్తిడి పెరగటం తదితర పరిణామాలతో ప్రతి నియోజకవర్గంలోనూ ఒకటి రెండుచోట్ల ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. ముండ్లమూరు ఎంపీపీ విషయంలో ఎమ్మెల్యే వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి ఢీ అంటే ఢీ అంటూ మంత్రి బాలినేని వద్ద పోటాపోటీగా వాదనలు వినిపించారు. కొందరు ఎమ్మెల్యేలు పోటీని తట్టుకోలేక చెరి సగం అన్న సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నారు. కొన్నిచోట్ల డబ్బే ప్రధానంగా పదవుల కొనుగోలు రాజకీయం జోరందుకుంది. ఎంపీపీ పదవులు ఎస్సీలకు, బీసీలకు రిజర్వ్‌ అయిన చోట్ల ఉపాధ్యక్ష పదవులకు పోటీ పెరిగి పార్టీలోని వైరివర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి.  


బాలినేని వద్ద ముండ్లమూరు పంచాయితీ

దర్శి నియోజకవర్గం ముండ్లమూరులో ఎమ్మెల్యే వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లిల మధ్య ప్రారంభమైన ఆసక్తికరమైన రాజకీయ వ్యవహారం మంత్రి బాలినేని వద్దకు చేరింది. ప్రస్తుతం ఆ మండలంలో వైసీపీ తరపున ఎక్కువమంది ఎంపీటీసీలు గెలుపొందారు. టీడీపీ నుంచి నలుగురు, ఆ పార్టీ మద్దతుతో ఒక బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. అయితే ఇటు ఎమ్మెల్యే, అటు మాజీ ఎమ్మెల్యేలకు మద్దతుగా వైసీపీ ఎంపీటీసీలు విడిపోయారు. టీడీపీ వారు బూచేపల్లి వర్గానికి మద్దతుగా నిలిచారు. దీంతో ప్రస్తుతం బూచేపల్లికి ఎక్కువ మద్దతు ఉంది. దీంతో పంచాయితీ మంత్రి వద్దకు చేరింది. ‘వైసీపీ తరపున ఏకగ్రీవంగా, పోలింగ్‌లో కలిపి 11మంది గెలుపొందారు. వారందరికీ బీఫాంలు ఇచ్చింది నేనే. ఇప్పుడు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ వారిని విడగొట్టడం సమంజసం కాదు’ అని వేణుగోపాల్‌ మంత్రి వద్ద చెప్పినట్లు తెలిసింది. ఒక్కో ఎంపీటీసీకి రూ.25 లక్షల వరకు డబ్బు ఆశచూపి వారివైపు తిప్పుకుంటున్నారని, వాటన్నింటికీ అతీతంగా తాను ప్రతిపాదించిన వారికే ఎంపీపీ పదవి కట్టబెట్టాలని ఆయన మంత్రిని కోరారు. ఈ విషయంలో అన్యాయం జరిగితే బహిరంగంగా ధర్నా చేస్తానని హెచ్చరించినట్లు కూడా తెలిసింది. కాగా వైసీపీ తరపున గెలుపొందిన ఎంపీటీసీలలో మెజారిటీ సభ్యులతో కలిసి బూచేపల్లి కూడా మంత్రిని కలిసినట్లు తెలిసింది. ఆయన వీరంతా ఆరంభం నుంచి పార్టీలో ఉన్నారు. నియోజకవర్గంలో ప్రారంభం నుంచి పార్టీలో ఉన్న వారికి అన్యాయం జరుగుతుండటాన్ని సహించలేక అంతా మీ వద్దకు వచ్చారు. అలాంటి వారిని పార్టీపరంగా ఆదుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. అని బూచేపల్లి మంత్రికి వివరించినట్లు తెలిసింది. ఇరువురి వాదనలు విన్న మంత్రి రెండు రోజుల్లో ఒక నిర్ణయాన్ని తెలియజేస్తానని చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. కాగా సోమవారం ముండ్లమూరులో అటు వేణుగోపాల్‌, ఇటు బూచేపల్లి మద్ధతుదారుల మధ్య వాగ్వాదం ప్రారంభం కాగా పోలీసులు చెదరగొట్టారు. ఈ స్థాయిలో కాకపోయినా ఆరంభం నుంచి పార్టీలో ఉన్న పలువురికి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు అన్యాయం చేస్తున్నారంటూ మరో నాలుగైదు నియోజకవర్గాల నుంచి మంత్రికి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. వెలిగండ్ల ఎంపిపిగా తొలుత రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారిని ప్రోత్సహించిన ఎమ్మెల్యే ప్రస్తుతం ఆయనను కాదని యాదవులకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. ఈ విషయంపై మండలానికి చెందిన ఒకవర్గం నేతలు మంత్రి వద్దకు క్యూ కట్టినట్లు తెలిసింది. కొండపి, పర్చూరు, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల నుంచి కూడా పలువురు మంత్రి వద్దకెళ్లి స్థానికంగా తమకు అన్యాయం జరుగుతుందంటూ ఫిర్యాదులు చేయటం విశేషం.


 చెరిసగం కాలం ఉండండి

ఒక నియోజకవర్గంలో ఎంపీపీ పదవిని ఆశించి తొలుత ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యేకి డబ్బులు ఇచ్చిన అభ్యర్థి ప్రస్తుతం తనకు పదవి రాదన్న ఉద్దేశంతో ఆ డబ్బులు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. మరో నియోజకవర్గంలోని ఒక మండలంలో ఇద్దరు నాయకులు వారి కుటుంబసభ్యులకు ఎంపీపీ పదవి కోసం పోటీపడుతుండటంతో అక్కడ ఎమ్మెల్యే ఆర్థికపరమైన లాభం ఎటు వస్తుందా అని చూస్తున్నట్లు వైసీపీ వర్గాల వారే గుసగుసలాడుకుంటున్నారు. బేస్తవారిపేట, అర్థవీడు ఎంపీపీ పదవులపై ఒకరికొకరు తీవ్రంగా పోటీపడుతుండగా ఎమ్మెల్యే రాంబాబు దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టలేక ఇబ్బందిపడుతున్నారు. బీపేటలో అయితే పోటీ పడుతున్న ఇద్దరిని చెరి రెండున్నరేళ్లు ఉండాలని సూచించారు. అయితే ఎవరు ముందుండాలన్న విషయంపై విభేదాలు పొడచూపాయి. అర్థవీడు మండలంలోను ఇద్దరు నేతలు పోటీపడుతున్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని ఒకటి రెండు చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి సురేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న వైపాలెం లోను ఒక మండలంలో ఇలాంటి పరిస్థితి తప్పలేదు. దర్శిలో ఎమ్మెల్యే తొలుత హామీ ఇచ్చిన వారిని కాక మరొకరిని తెరపైకి తెచ్చినట్లు సమాచారం. కొండపి మండలంలో పార్టీ కన్వీనర్‌ ముందు నుంచి అనుకున్న అభ్యర్థిని బలపరుస్తుండగా తాజాగా జడ్పీటీసీగా గెలుపొందిన మహిళ భర్త మరో పేరుని ప్రతిపాదించటంతో వివాదం ప్రారంభమైంది. నాగులుప్పలపాడులో ఇద్దరు పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, బాబూరావుల సతీమణుల్లో ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో వివాదం నడుస్తోంది. మద్దిపాడులో కూడా ఆరంభం నుంచి అనుకున్న అభ్యర్థికి మరొకరి నుంచి పోటీ పెరగటం, వారికి వైసీపీలో కొందరు అగ్రనాయకుల మద్దతు ఉండటం సమస్యాత్మకంగా మారింది. మార్టూరులో ఎంపీపీ పదవి దళితులకు రిజర్వ్‌ కాగా వైస్‌ ఎంపీపీ పదవి కోసం ఇన్‌చార్జ్‌ రాంబాబు, ఆయన వ్యతిరేక వర్గాల వారు ఢీ అంటే ఢీ అంటున్నారు. సంతమాగులూరు మండలంలో నిత్య అసమ్మతివాదిగా పేరొందిన కోటిరెడ్డి గతం నుంచి ఎంపీపీ అనుకుంటున్న చినవెంకటరెడ్డి పేరుని వ్యతిరేకించినట్లు తెలిసింది. కొత్తపట్నంలో వైస్‌ ఎంపీపీ పదవికోసం విభేదాలు పొడచూపాయి. దళితులు తమకు కేటాయించాలని ముందుకు రావటం విశేషం.