Abn logo
Jun 21 2021 @ 23:43PM

పదవుల ఆశలు..

నామినేటెడ్‌ పోస్టులకు లాబీయింగ్‌

ఎమ్మెల్యేలను వదిలి రాష్ట్ర పెద్దలతో కోటరీ

ఎటూ తేల్చుకోలేని మంత్రులు

సీనియర్లను వదిలేశారా.. 

పలువురిలో అసంతృప్తి, ఆగ్రహం

భీమవరంలో సంకట స్థితి.. 

అధికార పార్టీలో హాట్‌ టాపిక్‌


(ఏలూరు–ఆంధ్రజ్యోతి): 

అధికార వైసీపీలో నామినేటెడ్‌ పదవుల కోసం కొంత మంది కుస్తీలు పడుతున్నారు. ఇంకొందరు పార్టీ పెద్దల ముందు వాలిపోతున్నారు. మరికొందరు తాము సీనియర్లుగా ఉండగా, జిల్లాను ఏలిన సామర్ధ్యం అందరికీ తెలిసి ఉండగా పార్టీ పట్టిం చుకోవడం లేదని లోలోన రగిలిపోతున్నారు. తమ అసంతృప్తిని ఏ రూపంలో వెళ్లగక్కితే అధిష్ఠానం దీనికి విరుద్దంగా మరో రూపంలో స్పందిస్తుందా? అనే అనుమానాలతో కొందరు సైలెంట్‌ అయ్యారు. ఎమ్మెల్యేలను కాదని తమకు ఎలాగూ పదవులు దక్కవని మొదట్లో భావించిన పలువురు నియోజక వర్గ నేతలు రాష్ట్రస్థాయి నేతలతో లాబీయింగ్‌ నడు పుతున్నారు. పలు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు, ఇంకొన్ని స్టేట్‌ కార్పొరేషన్ల డైరెక్టర్‌ పదవులు మిగిలి ఉండగా అవైనా తమకు దక్కకపోతాయా అన్న ఆశ కొందరిలో కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా తమ విషయంలో మీనమేషాలు లెక్కిం చడం ఏమిటని పలువురు తమ అనుచరులకన్నా ముందు రగిలిపోతున్నారు. సర్దుబాటు చేయాల్సిన మంత్రులు ఇప్పటికీ బిజీగా మారిపోవడంతో ఆ వైపు దృష్టి పెట్టడం లేదు. 


లోలోన అసంతృప్తి.. ఆగ్రహం 

వైసీపీకి తిరుగులేని విజయం అందించిన పశ్చి మలో ఇప్పటి వరకు నామినేటెడ్‌ పదవుల భర్తీలో కొందరికే అవకాశం దక్కింది. పార్టీకి విధే యతగా వున్న వీరిని గుర్తించి ఆ మేరకు పదవులు కట్టబెట్టారు. కానీ చాలా మంది పార్టీ అధికారంలోకి వస్తే తమకు ఏదో ఒక పదవి రాకపోతుందా అని ఆది నుంచి ఆశతో ఉన్నారు. నరసాపురం నియోజక వర్గానికి చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుకు వైసీపీలో ఏదో ఒక పదవి ఖాయమని అందరూ భావించారు. ఆయన కుమారుడికి ఈ మధ్యనే మున్సిపల్‌ ఎన్నికల తరువాత వైస్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు. దీంతో సరి పెట్టబోతున్నారా ? లేక సుబ్బారాయుడి అనుభవం రీత్యా ఆయనకు సరికొత్త పదవి దక్కపోతుందా ? అనేది ఆయన వర్గీయుల్లో ఇప్పటికీ ఆశలు చిగు రిస్తూనే ఉన్నాయి. ఒక దశలో ఎమ్మెల్సీ ఇస్తారంటూ ప్రచారం జరిగినా తాజాగా భీమవరానికి చెందిన మోషేన్‌ రాజుకు ఆ పదవి వరించింది. ఆయనకు విధాన మండలి చైర్మన్‌ పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇంకో విచిత్రం ఏమిటంటే సుబ్బారాయుడికి సమాంతరంగా ఉండి తూర్పు గోదావరిలో చక్రం తిప్పిన తోట త్రిమూ ర్తులుకు ఎమ్మెల్సీ వచ్చింది. కాని ఈయన విష యంలో వైసీపీ అంతర్గతంగా ఏదైనా ఆలోచిస్తుందా ? లేకుండా ప్రస్తుతానికి ఏ పదవి కట్టబెట్టకుండానే సరిపుచ్చ బోతున్నారా ? అనే సందేహం లేకపోలేదు. దీనిపై పార్టీ పెద్దలు ఎవరూ స్పందించలేదు. ఒక దశలో సీనియర్‌గా బలమైన సామాజిక వర్గం గుర్తింపు నేతగా ఆయనకు నరసాపురం వైసీపీ పగ్గాలు కట్టబెడతారని భావించినా అది సాధ్య పడలేదు. మరోనేత పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాబ్జీకి ఏదో ఒక నామినేటెడ్‌ పదవి కేటాయిస్తారని పార్టీలో కొన్నాళ్లుగా సాగిన చర్చ ఇప్పటికీ కార్య రూపం దాల్చలేదు. ఆయనకున్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునైనా అవకాశం ఇస్తారనుకుంటే దీనికి బదు లుగా ఇంతకుముందే తాతాజీకి డీసీఎంఎస్‌, కౌరు శ్రీనివాస్‌కు డీసీసీబీ కేటాయించి సరిపెట్టుకు న్నారు. ఇప్పుడు వారిద్దరికీ ఈ రెండు పదవులు లేక పోయినా కౌరుకు జడ్పీ చైర్మన్‌ పదవి ఇప్పటికే రిజర్వు చేశారు. తనకు మరోసారి అవకాశం ఇవ్వా ల్సిందిగా తాతాజీ పట్టుబడుతున్నారు. 


 ఎమ్మెల్యే గ్రంధికి దెబ్బ కొట్టారా ?

త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగితే తమకు అవకాశం రాకపోతుందా ? అని జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు. వారిలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఒకరు. అయితే ఎవరు ఊహించని విధంగా మోషేన్‌ రాజుకు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి ఎమ్మెల్యే శ్రీనివాస్‌ ఆశలు దెబ్బతినేలా కొందరు వ్యవ హరించారా ? అనే అనుమానాలు ఆయన కోటరీలో  వినిపిస్తున్నాయి. భీమవరం ప్రాంతంలో ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. వివాదరహితుడుగా వున్న మోషేన్‌రాజు తన పని తాను చేసుకుపోతున్నారు. 


 ఒక్కొక్కరిది ఒక్కోదారి

నామినేటెడ్‌ పదవుల ఎంపికలో తమ పేరు అధిష్టానం పరిశీలనకు వెళ్లేలా వైసీపీ నేతలు ఎవరి ఎత్తుగడలో వారు ఉన్నారు. ఓ వైపు ఎమ్మెల్యేలకు అనుకూలంగా వ్యవహరిస్తూనే మరోవైపు పార్టీ సమ న్వయ కార్యకర్తగా వున్న, టీటీడీ చైౖర్మన్‌  సుబ్బారెడ్డి ఆశీస్సులు పొందేందుకు ఎవరి ఎత్తుగడలు వారు వేస్తున్నారు. ఉండి కన్వీనర్‌ పీవీఎల్‌ నరసింహ రాజును ఈ మధ్యనే ఆ పదవి నుంచి తప్పించారు. పార్టీలో మొదటి నుంచి కీలకంగా వ్యవహరిం చడంతో పాటు పోటీకి కూడా సిద్ధపడ్డారని అయినా పరి ణామాలను బట్టి పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టు బడి ఉన్నానని చెబుతున్న నరసింహరాజు తనకు పార్టీపరంగా ఒక పదవి కేటాయించాలని పట్టుబడు తున్నట్లు సమాచారం. ఇప్పటికే సహకార రంగంలో కీలకంగా వున్న నరసింహరాజును ఎలా గోలా బుజ్జ గించి ఆయనకు డీసీసీబీ చైర్మన్‌ పదవి ఇచ్చేందుకు రాష్ట్ర పార్టీ నేతలు కొందరు ఆశ చూపించినట్లు సమాచారం. ఇదే తరుణంలో పార్టీలో యువనేత నల్లజర్ల నియోజకవర్గానికి చెందిన కారు మంచి రమేష్‌ ఇదే పదవిని ఆశిస్తున్నారు. ఈ విష యాన్ని ఆయన సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. సామా జికపరంగా తమను చూడవద్దని పార్టీకి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకోవాలని రమేష్‌ పట్టుబడుతున్నారు. దీనికితోడు క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని సర్రాజు ఆశిస్తున్నారు. మిగిలిన చైర్మన్‌ పదవుల కోసం ఏలూరుకు చెందిన సుధీర్‌ బాబు, చింతలపూడికి చెందిన జానకీరెడ్డి, నర్సాపు రానికి చెందిన పీడీ రాజు, ఆచంటకు చెందిన పెద్దిరాజు పోటీ పడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే వైసీపీలో మాత్రం నామినేటెడ్‌ పదవుల కోసం అనేకమంది దేనికైనా సిద్ధమే అన్నట్లుగా ఎమ్మె ల్యేలపై కారాలు మిరియాలు నూరుతున్నారు. పైకి చెప్పకపోయినా లోలోన పార్టీ ఈ రెండేళ్లలో తమకు ఏం చేసిందని కొందరు వీలు చిక్కినప్పుడల్లా బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.