గిట్టుబాటు ధర కోసం పోరాడతా

ABN , First Publish Date - 2021-07-27T06:15:19+05:30 IST

పొగాకు రైతుల సమస్యలతోపాటు సుబాబుల్‌, జామాయిల్‌ రైతుల సమస్యలను అసెంబ్లీలో చర్చించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు.

గిట్టుబాటు ధర కోసం పోరాడతా
వెల్లంపల్లి వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లను పరిశీలిస్తున్న అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్‌

పొగాకు మార్కెట్‌లో వ్యాపారుల ఇష్టారాజ్యం

ప్రేక్షక పాత్ర పోషిస్తున్న బోర్డు అధికారులు

రైతు సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తా 

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ 

మద్దిపాడు, జూన్‌ 26 : పొగాకు రైతుల సమస్యలతోపాటు సుబాబుల్‌, జామాయిల్‌ రైతుల సమస్యలను అసెంబ్లీలో చర్చించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. సోమవారం వెల్లంపల్లి  వేలం కేంద్రంలో ముండ్లమూరు క్లస్టర్‌ రైతుల పొగాకు కొనుగోళ్లను ఆయన  పరిశీలించారు. ఈసందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ పొగాకు మార్కెట్‌లో వ్యాపారులు అడింది అట పాడింది పాటగా వేలం నడుస్తుందన్నారు. వారిని నియంత్రించాల్సిన బోర్డు అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు.  మార్కెట్‌లో భారీగా బేళ్ల తిరస్కరణలు ఉంటున్నాయన్నారు. వ్యాపారులు కుంటిసాకులతో మేలురకం గ్రేడ్‌లకు సైతం ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారన్నారు. సుబాబుల్‌, జామాయిల్‌ మార్కెట్‌ ధర ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాన్నారు. అధికారంలోకి వచ్చేందుకు సుబాబుల్‌కు రూ.5వేలు గిట్టుబాటు ధర కల్పిస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీలు ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు. ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి మూడు నెలలైనా ఇంతవరకూ నగదు జమ చేయలేదన్నారు. వెల్లంపల్లి వేలంకేంద్రం కార్యనిర్వహణాధికారి వై.ఉమాదేవి, జె.సురేంద్ర, ఏఎంసీ మాజీ చైర్మన్‌ నాగినేని రామకృష్ణ, ఒంగోలు మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు, రవి, ఐ.వి.రెడ్డి, అబ్బూరి శేషగిరావు, రావి ఉమామహేశ్వరరావు, మండవ గోవిందరాజులు, వెంకయ్య, జాగర్లమూడి జయకృష్ణ, తేలప్రోలు రమేష్‌, వెంకటేశ్వరరెడ్డి, మండవ శ్రీరామమూర్తి  పాల్గొన్నారు. 


పునవాస సమస్యలపై ఆందోళన

గుండ్లకమ్మ ప్రధాన ముంపుగ్రామాలైన ధేనువకొండ, కొటికలపూడి, మణికేశ్వరం గ్రామాల పునరావాస కాలనీల్లో పెండింగ్‌ సమస్యలపై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌తో మాట్లాడానన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే కలెక్టరేట్‌ ఎదుట నిర్వాసితులతో కలిసి ఆందోళన చేస్తానన్నారు. వైసీపీ పాలనలో నిరుద్యోగులు దగా పడ్డారన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ విధానాలతో పరిశ్రమలు మూతపడి వేలాదిమంది నిరాశ్రయులు అవుతున్నారన్నారు. 


Updated Date - 2021-07-27T06:15:19+05:30 IST