హాస్టల్‌లో చిన్న వాగ్వాదం.. తోటి విద్యార్థి గొంతుకోసిన బాలుడు!

ABN , First Publish Date - 2022-04-30T12:00:11+05:30 IST

హాస్టల్‌లో చిన్న వాగ్వాదం.. తోటి విద్యార్థి గొంతుకోసిన బాలుడు!

హాస్టల్‌లో చిన్న వాగ్వాదం.. తోటి విద్యార్థి గొంతుకోసిన బాలుడు!

  • 18 కుట్లు వేసిన వైద్యులు
  • గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో ఘటన

హైదరాబాద్ సిటీ/రాయదుర్గం : గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల హాస్టల్‌లో జరిగిన చిన్న వాగ్వాదం ఓ విద్యార్థి గొంతు కోసేవరకు వెళ్లింది. సుమారు 18 కుట్లు వేసి చికిత్స అందించిన వైద్యులు బాలుడు క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల హాస్టల్‌లో ఈనెల 25న కొందరు సీనియర్‌ విద్యార్థులు అల్పాహారం వడ్డించారు. ఈ క్రమంలో లైన్‌లో నిలుచున్న ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థి సాత్విక్‌ చేయిపై వడ్డిస్తున్న సేమియా పడింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 


అనంతరం సెకండియర్‌ విద్యార్థి స్నేహితుడు వచ్చి సాత్విక్‌పై చేయిచేసుకున్నాడు. దీంతో టీచర్లు వారికినచ్చజెప్పి పంపించారు. అదేరోజు రాత్రి హాస్టల్లో నిద్రపోయిన సాత్విక్‌ అర్ధరాత్రి దాటాక గొంతువద్ద నొప్పిగా అనిపించి నిద్రలేవగా, గొంతు భాగంలో రక్తం కారుతుండడం గమనించి స్నేహితులకు చెప్పాడు. దీంతో వెంటనే  సాత్విక్‌ను హాస్టల్‌ సిబ్బంది గచ్చిబౌలిలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు సాత్విక్‌ మెడపై సుమారు 18 కుట్లు వేశారు. అతడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. 


తనపై చేయిచేసుకున్న విద్యార్థే బ్లేడుతో దాడిచేసి ఉండొచ్చని గచ్చిబౌలి పోలీసులకు సాత్విక్‌ ఫిర్యాదు చేశాడు. అనుమానిత విద్యార్థిని పోలీసులు విచారించి సొంత పూచీకత్తుపై పంపించినట్లు సమాచారం. తమ కుమారుడిని కేసులో ఇరికిస్తున్నారని అనుమానిత విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా, ఇదే కళాశాల హాస్టల్‌లో ఫిబ్రవరి 19న ఇంటర్‌ విద్యార్థి వంశీకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే హాస్టల్‌లో ఇప్పుడు మరో కలకలం చెలరేగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2022-04-30T12:00:11+05:30 IST