సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడులు

ABN , First Publish Date - 2021-05-10T16:27:43+05:30 IST

బస్తీలో వేగంగా అల్లరిమూకలు బైక్‌పై వెళ్లడంతో కొందరు అభ్యంతరం...

సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడులు
File photo

  • పలువురికి గాయాలు
  • ఇరు వర్గాలపై కేసులు నమోదు

హైదరాబాద్/అఫ్జల్‌గంజ్‌ : బస్తీలో వేగంగా అల్లరిమూకలు బైక్‌పై వెళ్లడంతో కొందరు అభ్యంతరం తెలపగా, ఇరువర్గాలు తీవ్ర  వాగ్వాదాలతో రెచ్చిపోయి రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనల్లో ఓ వ్యక్తి తలపై తీవ్రగాయాలయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. నాంపల్లిలోని పటేల్‌నగర్‌లో ఇరువర్గాల మధ్య జరిగిన ఈ ఘటన వివరాలు  ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. బస్తీలో అల్లరిమూకలు గల్లీల్లో వేగంగా బైక్‌లపై రివ్వున దూసుకెళుతున్నాయి. వారిని వారించగా, మరింత రెచ్చిపోయారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధ్దం తీవ్రస్థాయికి చేరింది. ఆవేశం కట్టలు తెంచుకున్న దుండగులు తొలుత కర్రలతో దాడులకు తలపడటంతో పరిస్థితి మరింత వెడేక్కింది. వారి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు, అసభ్యదూషణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో సవాళ్లు, ప్రతిసవాళ్లతో కవ్వింపు చర్యలకు దిగారు.


కోపోద్రిక్తులైన ఇరువర్గాలు ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. ఈ సందర్భంగా దుండగుల కేకలు, అరుపులతో వీధులు దద్దరిల్లాయి. దీంతో బస్తీవాసులు ఒక్కసారిగా తీవ్రభయాందోళనకు గురై దొరికిన సందుల్లో పరుగులు తీశారు. రాళ్ల దాడిలో బస్తీ యువకుడు సతీష్‌ తలపై తీవ్ర గాయమైంది. అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దాడుల్లో  పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బేగంబజార్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుమోహన్‌రెడ్డి తన బలగాలతో  ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇరువర్గాలను సమూదాయించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ అల్లర్లు, దాడుల గురించి వాకబు చేసి పరిస్థితిని సమీక్షించారు. ఈ దాడుల్లో పాల్గొన్న ఇరు వర్గాలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశామని మధుమోహన్‌రెడ్డి వెల్లడించారు.

Updated Date - 2021-05-10T16:27:43+05:30 IST