ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడండి

ABN , First Publish Date - 2022-05-24T05:17:51+05:30 IST

జీవీఎంసీ అనుసరించే ప్రజావ్యతిరేక విధానాలపై నిర్ణయం మార్చుకునే వరకూ కౌన్సిల్‌లో పోరాడాలని టీడీపీ కార్పొరేటర్లకు విశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచించారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడండి
కార్పొరేటర్ల సమావేశంలో మాట్లాడుత్ను పల్లా శ్రీనివాస్‌

కార్పొరేటర్లకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా పిలుపు

విశాఖపట్నం, మే 23 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ అనుసరించే ప్రజావ్యతిరేక విధానాలపై నిర్ణయం మార్చుకునే వరకూ కౌన్సిల్‌లో పోరాడాలని టీడీపీ కార్పొరేటర్లకు విశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచించారు. ఈనెల 26న జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం జరుగుతున్నందున అనుసరించాల్సిన వ్యూహం పై టీడీపీ కార్యాలయంలో పార్టీ ఫ్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాస్‌ అధ్యక్షతన కార్పొరేటర్ల సన్నాహక సమావేశం సోమవారం జరిగింది.


ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలపై భారం మోపేలా జీవీఎంసీ అధికారులు, అధికారపక్షం తీసుకునే నిర్ణయాలను సభ్యులు పార్టీ తరపున కౌన్సిల్‌లో ఎండగట్టాలని సూచించారు. చెత్తపన్నుని  తగ్గించడం కాదని, పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేయాలన్నారు. ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాస్‌ మాట్లాడుతూ నగరంలో 42 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నందున రెండు ఎఫ్‌ఆర్‌యూల నిర్వహణకు రెండు కోట్లు ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వడం వల్ల ప్రజాధనం దుర్వినియోగమేనని అన్నారు.


ప్రతీవార్డుకి రూ.ఐదు లక్షలు విలువైన ఓపెన్‌ జిమ్‌లు ఇచ్చినా, ఇప్పటికీ సగం జిమ్‌లు ప్రారంభం కాలేదని టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గంధం శ్రీనివాస్‌ అన్నారు. వైసీపీ కార్యాలయానికి ఎండాడలో రెండెకరాల భూమిని 33 ఏళ్ల లీజుకి ఇచ్చినట్టే, మిగిలిన పార్టీలకు కూడా కేటాయించాలని కౌన్సిల్‌లో కోరదామని కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు అన్నారు. వార్డు డెవలప్‌మెంట్‌ప్లాన్‌ కింద ప్రతీవార్డుకి రూ.1.50 కోట్లు ఇస్తామని చెప్పినా, అది ఆచరణలోకి రాలేదన్నారు. ఈ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు పాల్గొని మాట్లాడారు.

Updated Date - 2022-05-24T05:17:51+05:30 IST