వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకునేదాకా పోరాటం ఆగదు: రాహుల్

ABN , First Publish Date - 2020-11-29T02:18:10+05:30 IST

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు...

వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకునేదాకా పోరాటం ఆగదు: రాహుల్

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘నకిలీ కేసులు’’ బనాయించినంత మాత్రాన రైతుల బలమైన అభిప్రాయాలను మార్చలేరని ఆయన పేర్కొన్నారు. ‘‘వ్యవసాయ వ్యతిరేక’’ చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆపబోమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు  ‘‘చలో ఢిల్లీ’’ మార్చ్ చేపట్టిన నేపథ్యంలో రాహుల్ ఈ మేరకు ఇవాళ ట్విటర్ వేదికగా స్పందించారు. అన్యాయానికి వ్యతిరేకంగా గళం వినిపించడం నేరం కాదనీ... అది బాధ్యత అని ఆయన అన్నారు. ఆందోళన చేపట్టిన రైతులపై పోలీసులు కేసులు నమోదు చేసినట్టు మీడియాలో వచ్చిన వార్తలను సైతం ఆయన షేర్ చేసుకున్నారు. ‘‘అన్యాయానికి వ్యతిరేకంగా గళం వినిపించడం నేరం కాదు. అది బాధ్యత. నకిలీ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినంత మాత్రాన మోదీ ప్రభుత్వం రైతుల బలమైన అభిప్రాయాలను మార్చలేదు. వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ చీకటి చట్టాలను రద్దు చేసేదాకా మా పోరాటం ఆగదరు. ఇప్పటికీ, మరెప్పటికీ మాది ‘జైకిసాన్’ నినాదమే..’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-11-29T02:18:10+05:30 IST