కరోనాపై పోరు.. ఉద్యమంలో హోరు

ABN , First Publish Date - 2020-03-22T10:19:39+05:30 IST

‘‘రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు మా పోరాట పట్టు సడలదు. లక్ష్యం చెదరదు’’ అని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు నినదించారు. జీవన్మరణ పోరాటం చేస్తున్నామని...

కరోనాపై పోరు.. ఉద్యమంలో హోరు

  • అమరావతి పోరులో విశ్రమించని రైతన్నలు..
  • నేటి నుంచి వాడవాడలా దీక్షలు
  • కరోనాపై జాగ్రత్తలు తీసుకుంటూనే రాజధాని పోరు సాగిస్తామన్న రైతులు
  • 95వ రోజు కొనసాగిన ఆందోళనలు
  • కోలాటం, నాటికలతో వినూత్న నిరసన


గుంటూరు, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ‘‘రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు మా పోరాట పట్టు సడలదు. లక్ష్యం చెదరదు’’ అని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు నినదించారు. జీవన్మరణ పోరాటం చేస్తున్నామని, చట్టాలు, ప్రభుత్వాలపై నమ్మకం ఉందని అన్నారు. అయితే, కరోనా నేపథ్యంలో పోరు తీరు మార్చుతున్నట్టు చెప్పారు. ఇక నుంచి 29 గ్రామాల్లో వాడవాడలా అమరావతి కోసం దీక్షలు చేపడుతున్నట్టు తెలిపారు. రైతులు చేపట్టిన ఆందోళనలు శనివారానికి 95వ రోజుకు చేరాయి.


తుళ్లూరు, మందడంలో మహాధర్నాలు కొనసాగించారు. వెలగపూడి, రాయపూడి, కృష్ణాయపాలెం, పెనుమాక, మంగళగిరి, ఎర్రబాలెం, పెదపరిమి, నీరుకొండ తదితర ప్రాంతాల్లో రిలే దీక్షలు కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వం తమతో ఎలాంటి సంప్రదింపులూ జరపకుండా జీవో విడుదల చేసి ఒప్పందాలను ఉల్లంఘించిందని తుళ్లూరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అభ్యంతర లేఖలు రాశారు. అమరావతి కోసం భూమి ఇచ్చామని కానీ, ప్రభుత్వం ఆ లక్ష్యానికి విఘాతం కలిగిస్తోందని ఆక్షేపించారు.


జాగ్రత్తలు పాటిస్తూ..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటూ రైతులు తమ ఆందోళనలను కొనసాగించారు. శిబిరాల్లో వ్యక్తుల మధ్య దాదాపు పది అడుగుల దూరం పాటించారు. అలానే గంటకోసారి విధిగా శానిటైజర్‌లను వాడుతూ చేతులను శుభ్రం చేసుకుంటున్నారు. ముఖానికి మాస్క్‌లను కట్టుకొన్నారు. కాగా,  రైతులు వివిధ రూపాల్లో ఆందోళనలు వ్యక్తం చేశారు. తుళ్లూరు శిబిరంలో అమరావతి ఉద్యమ గీతాలకు కోలాటం ఆడుతూ మహిళలు నిరసనలు తెలిపారు.


అలానే మహాభారతంలోని ఘట్టాన్ని అనుసరిస్తూ ప్రధాని మోదీ నిద్రస్తున్న సమయంలో సీఎం, రైతులు వెళ్లి తమ గోడు తెలిపినట్లు.. సీఎం జగన్‌ అహంభావంతో తల వద్ద, రైతులు దీనంగా కాళ్లవద్ద కూర్చొని వేడుకున్నట్లు నాటిక ప్రదర్శించారు. రాయపూడిలో యాగం నిర్వహించి సీఎం మనసు మారాలంటూ పోలేరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జేఏసీ పిలుపు మేరకు మహిళలు రాత్రి 7.30 గంటలకు విద్యుత్‌ను ఆపేసి.. ఇంటి ముందు కొవ్వొత్తులు వెలిగించి 5 నిమిషాలపాటు నిరసనలు తెలిపారు.


గంటకు 20 మంది చొప్పున

కరోనా ప్రభావం నేపథ్యంలో రైతులు పోరు తీరు ఆదివారం నుంచి మారనుంది. పోలీసుల నోటీసులు, వైద్యాధికారుల సూచనల మేరకు జేఏసీ నేతలు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. దీక్షా శిబిరాల్లో వంతుల వారీగా గంటకు 20 మంది చొప్పున దూరం దూరంగా కూర్చొని నిరసన వ్యక్తం చేయనున్నారు. వాడవాడలా శిబిరాలు ఏర్పాటు చేస్తారు. 29 గ్రామాల్లో ప్రతిరోజూ రాత్రి 7.30కు 5 నిమిషాలపాటు ‘అమరావతి వెలుగు’ పేరిట విద్యుత్‌ను ఆపేసి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలుపుతారు. ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా, నల్ల జెండా, జేఏసీ జెండా ఎగరవేయనున్నారు. కాగా, ప్రధాని మోదీ సూచనల మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రైతులు తమ ఇళ్ల నుంచే నిరసన వ్యక్తం చేయనున్నారు. అయితే, రాత్రి 9 తర్వాత శిబిరాలకు చేరుకుంటామని చెప్పారు. 


నేడు శిబిరాలకు రావొద్దు : కలెక్టర్‌ శామ్యూల్‌ విజ్ఞప్తి

కరోనా నియంత్రణపై ప్రధాని ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ పిలుపు మేరకు రాజధాని ప్రాంత ప్రజలు ఆదివారం దీక్షా శిబిరాలకు దూరంగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణ చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.

Updated Date - 2020-03-22T10:19:39+05:30 IST