అంజీర్‌ @ ఆదిలాబాద్‌

ABN , First Publish Date - 2020-05-31T08:23:20+05:30 IST

అంజీర్‌.. ఇతర పండ్ల కంటే ప్రత్యేకం. రుచి అద్భుతం. పోషకాల సమాహారం. అందుకే అంజీర్‌ పండ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది. కానీ, అంజీర్‌ పంట సాగు..

అంజీర్‌ @ ఆదిలాబాద్‌

పది ఎకరాల్లో సాగు చేసిన రైతు

ఎకరాకు రూ.2 లక్షలపైనే పెట్టుబడి

రెండో ఏడాది చేతికొచ్చిన దిగుబడి

కరోనాతో మార్కెటింగ్‌కు ఇబ్బందులు

మొత్తం 3,600 మొక్కల పెంపకం


ఆదిలాబాద్‌, మే 30(ఆంధ్రజ్యోతి): అంజీర్‌.. ఇతర పండ్ల కంటే ప్రత్యేకం. రుచి అద్భుతం. పోషకాల సమాహారం. అందుకే అంజీర్‌ పండ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది. కానీ, అంజీర్‌ పంట సాగు.. అంత ఈజీ కాదు. సారవంతమైన నేల, అనుకూలమైన వాతావరణం.. ఇలా అన్నీ కలిసి రావాలి. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దీన్ని పండిస్తున్నారు. అయితే, తెలంగాణలో మొదటిసారి అంజీర్‌ సాగు చేపట్టడమే కాదు.. మంచి దిగుబడి సాధించి ఔరా అనిపిస్తున్నారు ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం రేణిగూడ గిరిజన గ్రామానికి చెందిన రైతు సల్ల మాధవరావు. 10ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని ఆయన అంజీర్‌ పంటను సాగు చేస్తున్నారు.  బెంగళూరు నుంచి మొక్కలు తీసుకొచ్చి ఎకరాకు 360 చొప్పున 10 ఎకరాల్లో 3,600 మొక్కలు నాటారు. వ్యవసాయంలో తనకున్న అనుభవంతోనే రసాయన ఎరువులతోపాటు సేంద్రియ ఎరువులతో సేద్యం చేస్తున్నారు. తొలి ఏడాది నామమాత్రంగా దిగుబడి వచ్చినా.. రెండో ఏడాది ఊహించిన దానికంటే ఎక్కువ దిగుబడి రావడంతో ఆ రైతు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. అయితే, లాక్‌డౌన్‌ కారణంగా పంటను ఎగుమతి చేయడం కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పదేళ్ల పాటు దిగుబడి

అంజీర్‌ పంటను ఒకసారి నాటిన తర్వాత పదేళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఎకరాకు రూ.2లక్షలపైనే పెట్టుబడి పెట్టా. ఈ సారి రూ.20లక్షల వరకూ ఆదాయం వస్తుందని భావిస్తున్నా. స్థానికంగానే కిలో రూ.100చొప్పున అమ్ముతున్నా.

 

- రైతు మాధవరావు, రేణిగూడ, ఆదిలాబాద్‌

Updated Date - 2020-05-31T08:23:20+05:30 IST