నేటి నుంచి ఐదో విడత నిత్యావసరాలు

ABN , First Publish Date - 2020-05-29T09:04:01+05:30 IST

ఐదో విడత నిత్యావసరాల పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. అయితే, ఈ విడతలో ఉచిత కందిపప్పు కోటాలో ..

నేటి నుంచి ఐదో విడత నిత్యావసరాలు

ఆంధ్రజ్యోతి, విజయవాడ : ఐదో విడత నిత్యావసరాల పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. అయితే, ఈ విడతలో ఉచిత కందిపప్పు కోటాలో డీలర్లకు కోత విధించారు. తగ్గించిన కందిపప్పు భర్తీకి డీలర్లు డీడీలు కట్టి తెచ్చుకున్న కందిపప్పు నిల్వలను ఉపయోగించుకోవాలని మెలికపెట్టారు. డీలర్ల దగ్గర ఉన్న నిల్వల మేరకు కోటాకు కత్తెర వేశారు. అంటే.. డీలర్లు కొన్న కందిపప్పును ఉచితంగా పంపిణీ చేయమని చెప్పినట్టే. 


అసలు కథ ఇదీ.. 

లాక్‌డౌన్‌కు ముందు మార్చి 1-15 వరకు ప్రీమియం కోటాలో భాగంగా కందిపప్పుకు డీలర్లు డీడీలు కట్టారు. ఆ నెలలో పంపిణీ చేయగా, మిగిలిన కందిపప్పు నిల్వల బ్యాలెన్స్‌ తీసి మరుసటి నెల కోటాలోని బ్యాలెన్స్‌ నిల్వల్లో మినహాయిస్తారు. అయితే, మార్చి చివర్లో ఉచిత నిత్యావసరాల పంపిణీ చేపట్టారు. దీంతో ఆ నిల్వలు అలాగే ఉండిపోయాయి. తిరిగి రెగ్యులర్‌ కోటా మొదలైన క్రమంలో ఇచ్చే కందిపప్పు కోటాలో భర్తీ చేసుకోవాల్సింది పోయి.. ఐదో విడత ఉచిత నిత్యావసరాల పంపిణీలో మినహాయించారు. దీంతో డబ్బు ఇచ్చి కొన్న కందిపప్పును డీలర్లు ఉచితంగా అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


డీలర్లకు దెబ్బ

నాలుగు దఫాలుగా ఉచిత నిత్యావసరాల పంపిణీలో భాగంగా కమీషన్లు అందుకోలేని డీలర్లకు ఇది మరో దెబ్బ. దీనికితోడు లాక్‌డౌన్ల కారణంగా బియ్యం ప్యాకింగ్‌, డోర్‌ డెలివరీ ట్రాన్స్‌పోర్ట్‌, హమాలీలు, అదనపు కౌంటర్ల నిర్వహణ ఖర్చులన్నీ డీలర్లపైనే పడ్డాయి. ఈ వ్యవహారాలను రెవెన్యూ శాఖ పర్యవేక్షించటం వల్ల చాలాచోట్ల డీలర్లు పెట్టిన ఖర్చును తహసీల్దార్లు తిరిగి ఇవ్వలేదు. ఇదే సందర్భంలో ఉచిత నిత్యావసరాల దిగుమతి ఖర్చులను కూడా డీలర్లే భరిస్తున్నారు.


ఇలా చేయటం వల్ల రెగ్యులర్‌ కోటా సమయంలో ఇబ్బందులు పడతామంటున్నారు. డీడీలు కట్టిన కందిపప్పు నిల్వలు పంపిణీ చేయటానికి అభ్యంతరం లేదని, దీనికి డబ్బు చెల్లించే విషయంలో న్యాయం చేయాల్సిందిగా సివిల్‌ సప్లయిస్‌ శాఖ ఉన్నతాధికారులకు ఏపీ ఫెయిర్‌ ప్రైస్‌ షాప్‌ డీలర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. కాగా, మార్చిలో పంపిణీ అయిన  కందిపప్పులో డీలర్ల దగ్గర 60-100 కేజీల వరకు నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది. కేజీ కందిపప్పుకు రూ.39 చొప్పున డీడీ చెల్లించారు. 

Updated Date - 2020-05-29T09:04:01+05:30 IST