పంచ్‌ పడింది

ABN , First Publish Date - 2022-05-15T09:46:01+05:30 IST

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదు విజయాలతో అదరగొట్టిన ఈ జట్టు ఇప్పుడు తిరోగమిస్తోంది.

పంచ్‌ పడింది

సన్‌రైజర్స్‌కు వరుసగా ఐదో ఓటమి

కోల్‌కతా ఘనవిజయం

 రస్సెల్‌ ఆల్‌రౌండ్‌ షో

పుణె: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదు విజయాలతో అదరగొట్టిన ఈ జట్టు ఇప్పుడు తిరోగమిస్తోంది. బ్యాటర్స్‌ దారుణంగా నిరాశపర్చడంతో వరుసగా ఐదో ఓటమిని ఖాతాలో వేసుకుంది. అటు ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తమ ప్లేఆఫ్స్‌ ఆశలను  సజీవంగానే ఉంచుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో గెలిచిన కేకేఆర్‌ ప్రస్తుతం 12 పాయింట్లతో ఉంది. ఇక 10 పాయింట్లతో ఉన్న హైదరాబాద్‌ మరో మ్యాచ్‌ ఓడితే అధికారికంగానే రేసు నుంచి వైదొలుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది.


ఆండ్రీ రస్సెల్‌ (28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 నాటౌట్‌), సామ్‌ బిల్లింగ్స్‌ (29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 34) ఆదుకున్నారు. ఉమ్రాన్‌ మాలిక్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఛేదనలో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసి ఓడింది. అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43), మార్‌క్రమ్‌ (25 బంతుల్లో 3 సిక్సర్లతో 32) మాత్రమే రాణించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ రస్సెల్‌కు మూడు, సౌథీకి రెండు వికెట్లు దక్కాయి.

పేలవ ప్రదర్శన:

ఛేదనలో సన్‌రైజర్స్‌ ఏ దశలోనూ పోరాటం చూపలేకపోయింది. ఓపెనర్‌ అభిషేక్‌తోపాటు మిడిలార్డర్‌లో మార్‌క్రమ్‌ మాత్రమే కోల్‌కతా బౌలర్లను కాసేపు ఎదుర్కోగలిగారు. మరో ఎండ్‌లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. కెప్టెన్‌ విలియమ్సన్‌ (9) తన పేలవ ఫామ్‌ను కొనసాగించగా.. మరో ఓపెనర్‌ అభిషేక్‌ ఒంటరి పోరాటం చేశాడు. రెండో ఓవర్‌లో రెండు ఫోర్లు సాధించిన తను ఎనిమిదో ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లతో జోరు చూపాడు. కానీ స్వల్ప వ్యవధిలోనే కేకేఆర్‌ బౌలర్లు రాహుల్‌ త్రిపాఠి (9), అభిషేక్‌, పూరన్‌ (2) వికెట్లు కోల్పోవడంతో 76/4తో ఓటమి వైపు సాగింది. ఈ దశలో మార్‌క్రమ్‌ వరుస సిక్సర్లతో బ్యాట్‌ ఝుళిపించే ప్రయత్నం చేశాడు. కానీ అతడిని ఎక్కువ సేపు క్రీజులో నిలువనీయకుండా ఉమేశ్‌ బౌల్డ్‌ చేయడంతో రైజర్స్‌ ఆశలు ఆవిరయ్యాయి. ఇక టెయిలెండర్లు ఇలా వచ్చి అలా వెళ్లడంతో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఘోర పరాజయం ఎదురైంది.


ఆదుకున్న రస్సెల్‌:

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా మధ్య ఓవర్లలో దారుణంగా తడబడి కేవలం ఐదు ఓవర్ల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. కానీ ఆఖర్లో బిల్లింగ్స్‌, రస్సెల్‌ జట్టుకు విలువైన పరుగులు అందించడంతో పాటు ఆరో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (7)ను కోల్పోయిన జట్టు నాలుగో ఓవర్‌ ముగిసే వరకు 20 పరుగులే చేసింది. అయితే ఐదో ఓవర్‌లో నితీశ్‌ రాణా (26) 4,6,6తో 18 రన్స్‌ రాబట్టగా.. ఆరో ఓవర్‌లో రహానె (28), రాణా చెరో సిక్స్‌ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో 55/1 స్కోరుతో నిలిచింది. కానీ పేసర్‌ ఉమ్రాన్‌ జట్టు లయను దెబ్బతీశాడు. అతడి తొలి ఓవర్‌లోనే రాణా, రహానెలను పెవిలియన్‌కు చేర్చగా... తన మరుసటి ఓవర్‌లో కెప్టెన్‌ శ్రేయాస్‌ (15)ను సైతం అవుట్‌ చేయడంతో ఒక్కసారిగా జట్టు 83/4 స్కోరుతో కష్టాల్లో పడినట్టు కనిపించింది. కాసేపటికే పేసర్‌ నటరాజన్‌ సూపర్‌ యార్కర్‌తో రింకూ సింగ్‌ (5)ను ఎల్బీ చేశాడు.


అయితే ఇక్కడ కాస్త డ్రామా నెలకొంది. అంపైర్‌ అవుట్‌ ఇవ్వగానే నాన్‌స్ట్రయికర్‌ ఎండ్‌లో ఉన్న బిల్లింగ్స్‌ రివ్యూ కోరాడు. కానీ నిబంధనల ప్రకారం స్ట్రయికర్‌కు మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. అప్పటికే టైమ్‌ ముగిసిపోవడంతో రింకూను వెళ్లిపోవాల్సిందిగా అంపైర్‌ కోరాడు. ఆ తర్వాత బిల్లింగ్స్‌, రస్సెల్‌ అడపాదడపా బౌండరీలతో స్కోరును పెంచారు. 19వ ఓవర్‌లో భువనేశ్వర్‌ ఆరు పరుగులే ఇచ్చి బిల్లింగ్స్‌ను అవుట్‌ చేశాడు. కానీ సుందర్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో రస్సెల్‌ మూడు సిక్సర్లతో 20 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డాడు.


స్కోరుబోర్డు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌:

వెంకటేశ్‌ (బి) జాన్సెన్‌ 7, రహానె (సి) శశాంక్‌ (బి) ఉమ్రాన్‌ 28, నితీశ్‌ రాణా (సి) శశాంక్‌ (బి) ఉమ్రాన్‌ 26, శ్రేయాస్‌ (సి) త్రిపాఠి (బి) ఉమ్రాన్‌ 15, బిల్లింగ్స్‌ (సి) విలియమ్సన్‌ (బి) భువనేశ్వర్‌ 34, రింకూ (ఎల్బీ) నటరాజన్‌ 5, రస్సెల్‌ (నాటౌట్‌) 49,  నరైన్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 177/6; వికెట్ల పతనం: 1-17, 2-65, 3-72, 4-83, 5-94, 6-157; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-27-1, జాన్సెన్‌ 4-0-30-1, నటరాజన్‌ 4-0-43-1, సుందర్‌ 4-0-40-0, ఉమ్రాన్‌ 4-0-33-3.


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:

అభిషేక్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) వరుణ్‌ 43, విలియమ్సన్‌ (బి) రస్సెల్‌ 9, త్రిపాఠి (సి అండ్‌ బి) సౌథీ 9, మార్‌క్రమ్‌ (బి) ఉమేశ్‌ 32, పూరన్‌ (సి అండ్‌ బి) నరైన్‌ 2, సుందర్‌ (సి) వెంకటేశ్‌ (బి) రస్సెల్‌ 4, శశాంక్‌ (సి) శ్రేయాస్‌ (బి) సౌథీ 11, జాన్సెన్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) రస్సెల్‌ 1, భువనేశ్వర్‌ (నాటౌట్‌) 6, ఉమ్రాన్‌ (నాటౌట్‌) 3, ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 123/8; వికెట్ల పతనం: 1-30, 2-54, 3-72, 4-76, 5-99, 6-107, 7-113, 8-113; బౌలింగ్‌: ఉమేశ్‌ 4-0-19-1, సౌథీ 4-0-23-2, నరైన్‌ 4-0-34-1, రస్సెల్‌ 4-0-22-3, వరుణ్‌ చక్రవర్తి 4-0-25-1.

Updated Date - 2022-05-15T09:46:01+05:30 IST