మహిళా ఫుట్‌బాలర్లకు లాక్‌డౌన్‌ కష్టాలు

ABN , First Publish Date - 2020-06-09T09:38:20+05:30 IST

వచ్చే ఏడాది జరిగే ఫిఫా మహిళల అండర్‌-17 వరల్డ్‌కప్‌ ప్రాబబుల్స్‌కు ఎంపికైన భారత జట్టులోని కొందరికి లాక్‌డౌన్‌ కారణంగా కష్టాలు ఎదురయ్యాయి....

మహిళా ఫుట్‌బాలర్లకు లాక్‌డౌన్‌ కష్టాలు

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఫిఫా మహిళల అండర్‌-17 వరల్డ్‌కప్‌ ప్రాబబుల్స్‌కు ఎంపికైన భారత జట్టులోని కొందరికి లాక్‌డౌన్‌ కారణంగా కష్టాలు ఎదురయ్యాయి. జార్ఖండ్‌కు చెందిన ప్లేయర్లకు తగిన పౌష్టికాహారం అందడం లేదు. ఈ జట్టు కోసం గోవాలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కానీ, మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వారిని స్వస్థలాలకు పంపించారు. దీంతో వారికి ఇక్కట్లు మొదలయ్యాయి. జాతీయ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షి్‌పలో 17 గోల్స్‌ చేసిన జార్ఖండ్‌ ప్లేయర్‌ సుమతి కుమారి.. వరల్డ్‌కప్‌ కోసం సన్నద్ధమవుతోంది. రాంచీకి 110 కిలోమీటర్ల దూరంలో గుమ్మల జిల్లాలో ఉంటున్న సుమతి తగిన డైట్‌ లేక ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నం, పప్పుతోనే నెట్టుకు రావాల్సి వస్తోంది. అది కూడా రేషన్‌ డీలర్‌ సరఫరా చేస్తేనే. అసిస్టెంట్‌ కోచ్‌ అలెక్స్‌ ఆంబ్రోస్‌.. సుమతికి కొంత సహాయం చేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన మరో ఫుట్‌బాలర్‌ సుధా అంకిత.. తండ్రి మరణించడంతో గ్రామస్తుల సాయం కోసం చేయి చాస్తోంది. వారి గురించి పత్రికల్లో వార్తలు రావడంతో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ దృష్టికి వచ్చింది. వారికి నిత్యావసరాలు అందజేయాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించడంతో.. అధికారులు స్పందించారు. తర్వాతి రోజు క్రీడాకారిణులకు నిత్యావసరాలు అందాయి. అండర్‌-17 మహిళల వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేసిన 24 మంది ప్రాబబుల్స్‌లో 8 మంది జార్ఖండ్‌ ప్లేయర్లు ఉన్నారు. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎ్‌ఫఎఫ్‌) క్రీడాకారిణుల పర్యవేక్షణ బాధ్యతను ఆయా రాష్ట్ర సంఘాలకు అప్పగించింది. కానీ, వారి పరిస్థితులు తెలిసిన తర్వాత నగదు సాయం అందజేసేందుకు ముందు కొచ్చింది. ప్రాబబుల్స్‌ డైట్‌ కోసం జూన్‌, జూలైకు సంబంధించి రూ. 10 వేల చొప్పున స్టయిఫండ్‌ చెల్లించింది.


పరిస్థితులను అంచనా వేసి.. ప్రభుత్వ ఆదేశాల మేరకు గోవాలోని క్యాంప్‌ను పునరుద్ధరిస్తామని ఏఐఎ్‌ఫఎఫ్‌ తెలిపింది. కానీ, తమ రాష్ట్రంలోని ప్లేయర్ల ఆచూకీ దొరకడం లేదని జార్ఖండ్‌ ఫుట్‌బాల్‌ సంఘం నివేదికలు చెబుతున్నాయి. ‘రాంచీలో ఉన్న ప్లేయర్లకు మాత్రమే సహాయం చేయగలుగుతున్నాం. మిగతా వారి వద్దకు చేరుకునే పరిస్థితి లేదు. వారి చిరునామాలు కూడా లేవు. ప్రభుత్వ అధికారులు ఎవరూ క్రీడాకారిణులతో మాట్లాడలేదని తెలుస్తోంది’ అని జార్ఖండ్‌ ఫుట్‌బాల్‌ సంఘం కార్యదర్శి గులామ్‌ రబ్బాని చెప్పారు. కాగా, ప్లేయర్లకు తగిన సహాయం అందిందని జార్ఖండ్‌ స్పోర్ట్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు.

Updated Date - 2020-06-09T09:38:20+05:30 IST