Abn logo
Jul 22 2021 @ 00:00AM

ఫిఫా మాస్టర్‌

ఐదేళ్లప్పుడే కన్న తండ్రి ఇల్లు వదిలేసిన బాధ... సవతి తండ్రి రాకతో అమ్మ ప్రేమ కరువైన వేదన... సొంత ఊరికి దూరంగా ఎక్కడో అనాథశరణాలయంలో పెరిగినా... చదువులో టాపర్‌గా నిలిచిన పట్టుదల. ఫుట్‌బాల్‌పై మక్కువతో ఆటల్లోనే కెరీర్‌ను వెతుక్కుంది అయిషా నజియా. ఇప్పుడు... ప్రతిష్టాత్మక ‘ఫిఫా మాస్టర్‌ ప్రోగ్రామ్‌’కు ఎంపికైన 30 మందిలో ఏకైక భారత మహిళగా నిలిచి చరిత్ర సృష్టించింది. 


‘‘ట... మైదానంలో చూసేదే ప్రేక్షకులకు తెలుసు. కానీ దాని వెనక ఎంతోమంది శ్రమ ఉంటుంది. ఒక ఆటగాడి అరంగేట్రం నుంచి దిగ్గజంగా ఎదిగే వరకు... గెలుపు నుంచి ఓటమి వరకు... ‘స్పోర్ట్స్‌ మేనేజిమెంట్‌ ప్రొఫెషనల్స్‌’ పాత్ర కీలకం. క్లిష్టమైనా ఆ కెరీర్‌నే ఎంచుకున్నాను. కారణం... ఫుట్‌బాల్‌ అంటే నాకు బాగా ఇష్టం. కేరళలోని కోళికోడ్‌ మాది. అక్కడ ఫుట్‌బాల్‌కు తెగ క్రేజ్‌. సాధారణంగానే నేనూ దానికి ఆకర్షితురాలినయ్యాను. ఆట చూస్తూనే పెరిగాను. అదే నాకు ఇవాళ ‘ఫిఫా మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌’ కోర్స్‌ చేసే అరుదైన అవకాశం రావడానికి పునాదులు వేసింది. అయితే ఇది ఒక్క రోజులో వరించిన విజయం కాదు. ఇరవయ్యేళ్ల కన్నీటి వ్యథల నుంచి పుట్టిన  దృఢ సంకల్పానికి ఫలితం. 


అందరూ ఉన్నా... 

నాది ఒక వింత కథ. అందరూ ఉండి ఎవరూ లేని అభాగ్యురాలి కథ. నాకు ఐదేళ్లప్పుడు అమ్మా, నాన్న విడాకులు తీసుకున్నారు. అమ్మ మళ్లీ పెళ్లి చేసుకుంది. ఆ వయసులో నాకు ఏమీ అర్థం కాలేదు. ఇంట్లో సవతి తండ్రి. అమ్మ నాతో ప్రేమగా మాట్లాడి చాలా రోజులైంది. అది నాకు అగ్నిపరీక్ష. తీసుకువెళ్లి నన్ను చెన్నైలోని ఓ స్కూల్లో చేర్పించారు. అది అనాథ శరణాలయానికి అనుబంధంగా నడిచే పాఠశాల. మంచి తల్లితండ్రులెవరైనా వచ్చి నన్ను దత్తత తీసుకొంటారేమోనని చాలా రోజులు ఎదురుచూశాను. నా నిరీక్షణ ఫలించలేదు. కన్నవారు బతికే ఉన్నా అనాథలా పెరిగాను. నాలాంటి పరిస్థితి మరే బిడ్డకూ రాకూడదని ప్రార్థించాను. 


స్కాలర్‌షిప్‌తో ఇంజనీరింగ్‌...  

ఆశ్రమానికి వెళ్లిన మొదట్లో ఏడవని రోజు లేదు. ఆ సమయంలో నన్‌ చెప్పారు... ‘ఉన్నత స్థానానికి చేరాలంటే బాగా చదవాలని’. ఆ మాటలు మనసులో నాటుకుపోయాయి. ఈ కష్టాల నుంచి నన్ను గట్టెక్కించేది చదువొక్కటేనని అర్థం చేసుకున్నాను. కన్నీళ్లు దిగమింగుకుని... చదువే లోకంగా బతికాను. అది మొదలు ఏ రోజూ వెనకబడింది లేదు. స్కూల్‌ నుంచి బయటకు వచ్చే వరకు నేనే టాపర్‌ని. కేరళ ప్రభుత్వం నుంచి రూ.8 లక్షల స్కాలర్‌షిప్‌ వచ్చింది. దాంతో కొల్లమ్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివాను. 


వాళ్లే నా కుటుంబం... 

ఇంజనీరింగ్‌లో చేరే సమయానికి నాకు పద్దెనిమిదేళ్లు నిండాయి. అంటే కొత్త ప్రయాణం ప్రారంభించాల్సిన సమయం. స్వేచ్ఛా జీవిని అయిన సందర్భం. కాలేజీలోనే కొంతమంది మంచి స్నేహితులు దొరికారు. తరువాత వారే నా కుటుంబం అయ్యారు. ఏ కష్టం వచ్చినా... సంతోషం కలిగినా పంచుకోవడానికి నాకంటూ ఉన్నది వాళ్లే.  బీటెక్‌ అయిన వెంటనే కొచ్చిలోని ‘ఇండియన్‌ ఆయిల్‌ అదానీ గ్యాస్‌’లో మెకానికల్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం లభించింది. 


అభిరుచి వైపు అడుగులు... 

ఉద్యోగమైతే చేస్తున్నాను కానీ అందులో ఉత్సాహం లేదు. ఫుట్‌బాల్‌ వైపు మనసు లాగుతుండేది. టీవీలో తొలిసారి ప్రపంచ కప్‌ చూసినప్పటి నుంచీ ఆటపై మక్కువ తారస్థాయికి వెళ్లింది. అలాగని చేసే ఉద్యోగం వదిలేస్తే బతుకు బండి నడవడం కష్టమవుతుంది. ఉద్యోగం చేస్తూనే క్రీడా సంబంధిత సంస్థలో కూడా చేరాలనుకున్నా. ఒకేసారి రెండు మూడు పనులు చేయగలననే నమ్మకం నాకు. ఆ నమ్మకంతోనే ప్రయత్నాలు ప్రారంభించాను. 


ప్రపంచ కప్‌ కోసం... 

అది 2017. ‘ఫిఫా అండర్‌ 17 ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌’ నిర్వహణ బృందం భారత్‌కు వచ్చింది. ఆ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ బృందంలో భాగస్వామిని కావాలనుకున్నా. అప్లికేషన్‌ పంపించాను. కానీ వస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే నాకు స్పోర్ట్స్‌ మేనేజిమెంట్‌లో ఎలాంటి డిగ్రీ లేదు. కానీ ఇంజనీరింగ్‌ చదవడంవల్ల విశ్లేషణాత్మక శక్తి, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం వచ్చాయి. ఇంటర్వ్యూ కాల్‌ వచ్చింది. ఆశలు చిగురించాయి. వెళితే... ‘వర్క్‌ ఫోర్స్‌ మేనేజర్‌’గా తీసుకున్నారు. అప్పుడు నాకు 23 సంవత్సరాలు. వాళ్ల బృందంలో నేనే పిన్న వయస్కురాలిని. ఒక రకంగా ‘చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌’ పాత్రలాంటిది ఆ పోస్ట్‌. అన్ని విభాగాలు, వ్యక్తులతో సమన్వయం చేసుకోవాల్సిన అత్యంత క్లిష్టమైన బాధ్యత. తొలి ప్రయత్నంలోనే అందరి ప్రశంసలూ అందుకున్నా. దానివల్ల క్రీడల వెనక కృషికి సంబంధించిన పూర్తి అవగాహన వచ్చింది. 


‘ఎన్‌బీఏ’ బృందంతో... 

తరువాత అమెరికా ‘నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌’ (ఎన్‌బీఏ) బృందం భారత్‌కు వచ్చింది. అది 200 మంది అమెరికన్లు ఉన్న ఆ జట్టులో నేనూ సభ్యురాలినయ్యాను. ఇది నాకు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. దీంతో ఉద్యోగం వదిలేసి పూర్తిగా స్పోర్ట్స్‌ మేనేజిమెంట్‌ ప్రొఫెషన్‌పైనే దృష్టి పెట్టాను. ఇప్పుడు చేతి నిండా పని. సాధారణంగా మహిళలు ఎవరూ ఈ వృత్తిలోకి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎన్నో వ్యయప్రయాసలుంటాయి. ఒక్కోసారి సమయానికి ఇంటికి వెళ్లలేం. భోజనం కూడా చేయలేం.’’ 


కల నిజమైన రోజు...

ఐదేళ్ల కిందట ‘ఫిఫా మాస్టర్‌ ప్రోగ్రామ్‌’ గురించి విన్నాను. ఆ కోర్సు చేయాలని కలలు కన్నాను. ఇన్నాళ్లకు అది నెరవేరింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 700 అప్లికేషన్లు వస్తే 30 మందిని ఎంపిక చేశారు. ఇది ఏడాది కోర్సు. అయితే దానికి అయ్యే ఖర్చులో సగం స్కాలర్‌షిప్‌ ఇస్తారు. మిగతాది, అంటే రూ.28 లక్షలు మనమే సమకూర్చుకోవాలి. అది నా శక్తికి మించినది. అందుకే క్రౌండ్‌ ఫండింగ్‌ కోసం అభ్యర్థించాను. ‘లింక్‌డ్‌ ఇన్‌’లో పెడితే... 38 వేల మంది చూశారు. కానీ వచ్చింది వంద రూపాయలే. అయితే సెప్టెంబర్‌లో కోర్సు ప్రారంభమయ్యే నాటికి డబ్బు సమకూరుతుందని ఆశిస్తున్నాను.