Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ముంచేసింది

twitter-iconwatsapp-iconfb-icon
ముంచేసింది భీమవరంలో ప్రధాని బహిరంగ సభ ప్రాంతంలో మంగళవారం దృశ్యం

భారీ వర్షంతో పల్లపు ప్రాంతాల్లో నారుమళ్ల మునక

నారుమళ్లు వేసే సమయంలో వర్షం ఆటంకం

జిల్లాలో 5,300 హెక్టార్లకు 2,300 హెక్టార్లలో నారుమడులే వేశారు

నీరు బయటకు తోడేందుకు రైతుల అవస్థలు 

పల్లపు ప్రాంతాలు జలమయం


ఆదిలోనే.. సార్వా సాగుకు వర్షగండం ఏర్పడింది. భారీ వర్షానికి     జిల్లాలోని పల్లపు ప్రాంతాల్లోని నారుమడులు ముంపునకు గురయ్యాయి. ముందస్తు సాగు చేయాలని ప్రభుత్వం సూచనలిచ్చినా వాతావరణం రైతులను వెంటాడడంతో ఈసారి సాగు ఆలస్యంతో పాటు నారుమడుల దశలోనే కష్టాల సాగుగా మారింది. జిల్లాలో రెండు లక్షల 50 వేల ఎకరాలలో సార్వా సాగు సాగనుండగా 5,300 హెక్టార్లలో నారుమడులు వేయాల్సి ఉంది. మందకొడిగా నారుమడులు వేసే ప్రక్రియ సాగడంతో గడిచిన 20 రోజుల నుంచి 2,300 హెక్టార్లలో మాత్రమే అంటే 40 శాతంలోపు వేశారు. అవి కూడా మంగళవారం తెల్లవారుజాము నుంచి కురిసిన అత్యధిక వర్షపాతానికి వర్షపు నీటిలో తేలియాడుతున్నాయి. రైతులకు సార్వా సాగులో అవస్థలు మొదలయ్యాయి. 


భీమవరం రూరల్‌/ఆకివీడు/ యలమంచిలి, జూన్‌ 28 : జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పల్లపు ప్రాంతాలైన మొగల్తూరు, పాలకొల్లు, భీమవరం, వీరవాసరం, కాళ్ళ, యలమంచిలి, పాలకోడేరు, నరసాపురం తదితర మండలాల్లో నారుమడులు పలుచోట్ల పూర్తిగా మునిగిపోయాయి. నారుమడులలో వర్షపునీరు అత్యధికంగా చేరడంతో ముంపు గండం ఉందని, ఈసారి కూడా ఇబ్బందులు తప్పడం లేదని రైతులు భయపడుతున్నారు. సార్వా ముందస్తు సాగు కోసం అధికారుల సూచనలివ్వడంతో పాటు పంట కాల్వలు ఈనెల మొదటి వారంలో వదలడంతో రైతులు నారుమడులు వేయాలని ముందుకు వచ్చినా వాతావరణం అందరి అంచనాలను తారుమారు చేసింది. గత దాళ్వా పంట సొమ్ము రైతుల చేతికి రాకపోవడంతో నారుమళ్లు వేసేందుకు ముందడుగు వేయలేకపోయారు. తప్పనిసరి పరిస్థితిలో అప్పులు చేసి నారుమడులు వేద్దామన్న రైతులకు భారీ వర్షం ఆలస్యానికి దారితీసేలా చేసింది. అన్ని ప్రాంతాల్లోనూ ఖాళీ పంట భూములలో రెండు అడుగుల నీరు నిలిచిపోవడంతో మరో పది రోజుల సమయం పడుతుందని రైతులు వాపోతున్నారు. దీంతో ఇంకా వేయాల్సిన మూడు వేల హెక్టార్లలో నారుమళ్లు మరింత జాప్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. 


 తెగిన విద్యుత్‌ వైర్లు

ఆకివీడు ఎస్‌.టర్నింగ్‌లో మంగళవారం విద్యుత్‌ 11కేవీ టౌన్‌ త్రీ ఫీడర్‌ వైరు తెగి జాతీయ రహదారిపై పడింది. స్థానికుల అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పింది. విద్యుత్‌ అధికారులకు సమాచారమివ్వడంతో రాకపోకలు నిలిపివేసి సరిదిద్దారు. టెలిఫోన్‌ క్వార్టర్స్‌ వద్ద విద్యుత్‌ వైర్లపై చెట్టు కొమ్మలు పడి అధిక శబ్ధంతో మంటలు చెలరేగాయి. గంటల తరబడి విద్యుత్‌ నిలిచిపోయింది. అధికారులు వాటిని తొలగించి కరెంట్‌ సరఫరాను పునరుద్ధరించారు.

 

 నేలకొరిగిన వందేళ్ల రావిచెట్టు

యలమంచిలి మండలం పుంతలో ముసలమ్మ ఆలయం సమీపంలో రహదారిని ఆనుకుని వున్న వందేళ్ల నాటి రావిచెట్టు మంగళవారం నేలకూలింది. వేకువజాము నుంచి కురిసిన భారీ వర్షానికి రావిచెట్టు ఒరిగిపోయి విద్యుత్తువైర్లకు ఆనుకుని ఉండిపోయింది. స్థానికుల సమాచారంతో విద్యుత్‌శాఖ సిబ్బంది స్పందించి వైర్లను తొలగించడంతో చెరువులోకి పడిపోయింది. రావిచెట్టు మొదలు వద్ద పలువురు మహిళలు పసుపు, కుంకుమ, పూలతో పూజలు చేశారు. 


రెండంతస్థుల భవనం నేలమట్టం

నరసాపురం, జూన్‌ 28: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని మొగల్తూరు రోడ్‌లో అక్రమణలలో ధ్వంసమైన భవనం కుప్పకూలింది.  మంగ ళవారం ప్రమాద సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడం పెనుప్రమాదం తప్పింది. ఆ సమయంలో ఇంటి ఏసీ అవుట్‌ డోర్‌ విప్పేందుకు  వెళ్లిన వై.సువర్ణరాజు అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.  216 జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు పక్కన వున్న ఇళ్లను తొలగించారు. ఎన్‌హెచ్‌ అధికారులు వేసిన మార్కింగ్‌ ప్రకారం కొంత మంది ఇళ్లను, దుకాణాలను సొంతంగా కూలగొట్టారు. మరికొన్నింటిని ఎన్‌హెచ్‌ అధికారులే ఎక్స్‌కవేటర్ల సాయంతో ధ్వంసం చేశారు. థామస్‌ వంతెన వద్ద రెండు అంతస్థుల భవనాన్ని సగం వరకు ధ్వంసం చేశారు. నాలుగు రోజుల నుంచి భారీగా వర్షాలతోపాటు దానికి ఆనుకుని ఉన్న డ్రెయినేజీ తవ్వడంతో వర్షాలకు నీరు నిలిచి నానిన రెండు అంతస్థుల భవనం కుప్పకూలింది. శిథిలావస్థలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు, ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. లోపల ఉన్న అతడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మొగల్తూరు రోడ్‌పై వాహనాలు తిరగకుండా పోలీసులు బంద్‌ చేసి మిగిలిన సగం భవనాన్ని ఎక్స్‌కవేటర్‌ సాయంతో తొలగించారు.Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.