నేషనల్ మాల్ ముందు 2లక్షల అమెరికన్ జెండాలు.. ఇవి దేనికి గుర్తంటే..

ABN , First Publish Date - 2021-01-19T18:18:57+05:30 IST

అమెరికా అధ్యక్ష ప్రమాణస్వీకారోత్సవానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం ప్రమాణం చేయడమే తరువాయిగా మిగిలింది.

నేషనల్ మాల్ ముందు 2లక్షల అమెరికన్ జెండాలు.. ఇవి దేనికి గుర్తంటే..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ప్రమాణస్వీకారోత్సవానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం ప్రమాణం చేయడమే తరువాయిగా మిగిలింది. ఈ వేడుక కోసం నేషనల్ మాల్ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. విద్యుత్ కాంతి దీపాలతో మాల్‌ను అధికారులు అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా మాల్ ముందు ఏర్పాటు చేసిన సుమారు రెండు లక్షల అమెరికన్ జెండాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ప్రతిసారి అగ్రరాజ్యం అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి లక్షల మందిని ఆహ్వానించడం ఆనవాయితీ. కానీ, ఈసారి కరోనా వల్ల ఆ పరిస్థితులు లేవు. ఇలా ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్న అమెరికన్లకు గుర్తుగా ఈ జెండాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 


అలాగే మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని కూడా ఈ జెండాలు సూచిస్తాయని అధికారులు పేర్కొన్నారు. అంతేగాక 56 కాంతి స్తంభాలు కూడా ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇవి దేశంలోని 50 రాష్ట్రాలతో పాటు టెర్రిటరీస్‌లను సూచిస్తాయి. వీటిని 46 సెకన్ల పాటు శోభాయమానంగా వెలిగేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బైడెన్ 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న సందర్భాన్ని గుర్తు చేస్తుంది.  



Updated Date - 2021-01-19T18:18:57+05:30 IST