రంగంలోకి తనిఖీ బృందాలు

ABN , First Publish Date - 2022-05-10T07:30:35+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రులకు కేంద్రప్రభుత్వం ఆర్థిక సహకారం అందించేందుకు గాను ప్రత్యేకబృందాలు ఆసుపత్రుల తనిఖీల కోసం రంగంలోకి దిగుతున్నాయి.

రంగంలోకి తనిఖీ బృందాలు
నిర్మల్‌లోని మెటర్నిటీ ఆసుపత్రి ఇదే

నేడు ఏరియా, మెటర్నరీ ఆసుపత్రుల తనిఖీలు 

జిల్లాలో మూడు రోజుల పాటు కొనసాగనున్న ఆరా 

రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, పరిశుభ్రత, రోగుల హక్కులపై వివరాల సేకరణ 

గ్రేడింగ్‌ సాధిస్తే ప్రతీబెడ్‌కు రూ. 10వేల కేంద్ర నిధులు 

రెండు ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌ 

నిర్మల్‌, మే 9 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆసుపత్రులకు కేంద్రప్రభుత్వం ఆర్థిక సహకారం అందించేందుకు గాను ప్రత్యేకబృందాలు ఆసుపత్రుల తనిఖీల కోసం రంగంలోకి దిగుతున్నాయి. ఈ మేరకు మంగళవారం నే షనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్ట్‌ (ఎన్‌క్యూఎఎస్‌) బృందాలు మూడు రోజుల పాటు ఈ తనిఖీలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర బృందం నిర్మల్‌కు చేరుకోబోతోంది. మూడు రోజుల పాటు ఇక్కడి ఏరి యా ఆసుపత్రి అలాగే మెటర్నటీ  ఆసుపత్రులను కేంద్రబృందం లోతు గా తనిఖీలు చేపట్టనుంది. ఈ ఆసుపత్రుల్లో అందించే వైద్యసేవలు, రోగుల స్థితిగతులు, ఆసుపత్రిలో శుభ్రత, పరిసరాల పరిశుభ్రత, పేషంట్‌ కేర్‌, రోగుల హక్కులు లాంటి అంశాలపై ఈ కేంద్ర బృందం పరిశీలన జరపనుంది. ఈ తనిఖీల అనంతరం కేంద్ర బృందం జారీ చేసే గ్రేడింగ్‌ ఆధారంగా ఈ రెండు ఆసుపత్రులకు కేంద్రప్రభుత్వ నిధులు ప్రత్యేకంగా అందనున్నాయి. ఏరియా ఆసుపత్రిలోని వంద బెడ్‌లకు ఏడాదికి ఒక్కోబెడ్‌కు గానూ రూ.10వేలు, మెటర్నటీ ఆసుపత్రిలోని 50 బెడ్‌లకు గానూ ఒక్కోబెడ్‌కు రూ.10వేలను కేంద్రప్రభుత్వం గ్రేడింగ్‌ ఆధారంగా అందించనుంది. ఎన్‌క్యూఎఎస్‌ అధికారుల బృందం మొత్తం రికార్డులను సైతం క్షుణ్ణంగా పరిశీలించనుంది. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను అడిగి తెలుసుకోనుంది. మూడు రోజుల పాటు ఈ తనిఖీ బృందం రెండు ఆసుపత్రుల్లోనే గడపబోతున్న కారణంగా జిల్లా కలెక్టర్‌తో పాటు వైద్య,ఆరోగ్యశాఖ అఽధికారులు అప్రమత్తమయ్యారు. కేంద్రబృందం ద్వారా గ్రేడింగ్‌ కోల్పోకుండా చూసేందుకు ఈ రెండు ఆసుపత్రుల రూపురేఖలను మార్చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ ఈ ఆసుపత్రులను తనిఖీ చేసి ఇక్కడి పరిస్థితులతో పాటు రోగులను కూడా కలిసి మాట్లాడారు. ఈ బృందం మూడు రోజుల పాటు తనిఖీలు నిర్వహించి నేషనల్‌ హెల్త్‌ మిషన్‌కు తుది నివేదిక అందించనుంది. ఈ నివేదిక ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ క్వాలిటీ ఇన్‌ హెల్త్‌కేర్‌కు కూడా అందిస్తారు. ప్రతీబెడ్‌కు రూ. 10వేల చొప్పున నిధులు రాబోతున్న కారణంగా మరింత  మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. అలాగే కేంద్ర బృందం డాక్టర్‌లకు ఆసుపత్రుల నిర్వహణపై సలహాలు, సూచనలు కూడా అందించనుంది. అలాగే వృత్తినైపుణ్యంపై కూడా సలహాలు ఇవ్వబోనున్నారు. ఇక్కడి ఆసుపత్రిలో పేషంట్‌ అవగాహనను కూడా ఈ బృందం తెలుసుకోనుంది. 

మూడు రోజుల పాటు ఎన్‌క్యూఎఎస్‌ బృందం తనిఖీలు

జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రితో పాటు మెటర్నిటీ ఆసుపత్రిని ఎన్‌క్యూఎఎస్‌ అఽధికారుల బృందం సోమ, మంగళ , బుధవారాల్లో తనిఖీలు చేపట్టబోతోంది. ఈ బృందం ఇచ్చే తుది నివేదిక అలాగే జారీ చేసే గ్రేడింగ్‌ ఆఽధారంగా కేంద్రప్రభుత్వం ద్వారా అదనపు నిధులు విడుదలకానున్నాయి. దీంతో పాటు అంతర్జాతీయస్థాయిలో కూడా ఇక్కడి ఆసుపత్రుల మెరుగైన పనితీరులకు గుర్తింపు లభించనుంది. ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ క్వాలిటీ హెల్త్‌కేర్‌ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడి ప్రభుత్వాసుపత్రుల వైద్యసేవల తీరును వివరించనుంది. మూడురోజుల పాటు నిర్మల్‌లోనే ఈ బృందం మకాం వేసి రెండు ఆసు పత్రులను లోతుగా పరిశీలించనుంది. ఏవైనా చిన్న లోటుపాట్లు తలెత్తిన గ్రేడింగ్‌ చేజారిపోయి కేంద్ర నిధులకు ఆటంకం కానుంది. 

ఎనిమిది రకాల సేవలపై తనిఖీలు

కాగా కేంద్రబృందం ఇక్కడి మెటర్నీటీ, ఏరియా ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న వివిధ రకాల సేవలపై ఆరా తీయనున్నారు. ముఖ్యంగా ఎనిమిది అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ తనిఖీలు కొనసాగనున్నాయంటున్నారు. ఈ రెండు ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న సేవల విధానంపైనా అలాగే రోగులకు ఉన్న హక్కులపైనా, ఆసుపత్రిలోని ఇన్‌పుట్స్‌పైనా ఆరా తీయనున్నారు. అలాగే అనుబంధ సేవలు, క్లినికర్‌ కేర్‌ ఇన్‌స్పెక్షన్‌ కంట్రోల్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ ఔట్‌ కం లాంటి అంశాలను ప్రాతిపాదికన చేసుకొని కేంద్ర బృందం తనిఖీలు చేపట్టబోతోంది. దీంతో పాటు డాక్టర్‌లకు కూడా సలహాలు, సూచనలు, మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్య మెరుగుదల లాంటి అంశాలను వివరించనున్నారు. అనంతరం బృందాలు జారీ చేసే నివేదికల ఆధారం గా నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ గ్రేడింగ్‌లు అందించనుంది. ఈ గ్రేడింగ్‌ల ఆధారంగానే భవిష్యత్‌లో ఆర్థిక పరమైన సహకారం అందనుందంటున్నారు. 

జిల్లా కలెక్టర్‌ తనిఖీలు

కాగా మూడు రోజుల పాటు మెటర్నటీ , ఏరియా ఆసుపత్రులను కేంద్ర నాణ్యత ప్రమాణాల బృందం తనిఖీలు చేయబోతున్న కారణంగా యంత్రాంగమంతా అప్రమత్తమయ్యింది. జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ సోమవారం స్థానిక మెటర్నిటీ ఆసుపత్రిని సందర్శించారు. ఆయన రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. రోగులు ఎదు ర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రుల పరిసరాలన్నింటిని పరిశుభ్రంగా ఉంచాలని, రోగుల గదులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలంటూ కలెక్టర్‌ సూచించారు. ఆసుపత్రిలోని పరిసరాల్లో చెత్త చెదారం లేకుండా చూడాలని, రోగులకు తమకున్న హక్కులపై అవగాహన పెంపొందించాలంటూ కలెక్టర్‌ వైద్య,ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. అలాగే రికార్డులను సైతం ఆయన పరిశీలించారు. ఎక్కడ కూడా లోపాలు తలెత్తకుండా సీరియస్‌గా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడి మెటర్నిటీ, ఏరియా ఆసుపత్రుల్లోని పరిస్థితులపై కలెక్టర్‌ ఆరా తీశారు. మొత్తానికి కేంద్ర బృందం రాకతో ఈ ఆసుపత్రుల రూపురేఖలు మారిపోయాయి. ఒకవేళ గ్రేడింగ్‌ లభిస్తే కేంద్రం నుంచి పెద్దమొత్తంలో నిధులు ఈ ఆసుపత్రులకు రానున్నాయంటున్నారు. 

Read more