ఫైబర్‌నెట్‌ ఆపరేటర్లపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2021-02-25T09:22:18+05:30 IST

తమ సమస్యలు చెప్పుకొనేందుకు విజయవాడ బయలుదేరిన ఫైబర్‌నెట్‌ ఆపరేటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. హెచ్చరికలు, అరెస్టులతో వారిని అడ్డుకున్నారు. ఫైబర్‌నెట్‌లో ఏబీఎన్‌ నిలిపివేత, ప్యాకేజీల మార్పు, బేసిక్‌ ప్యాకేజీలో ముఖ్యమైన

ఫైబర్‌నెట్‌ ఆపరేటర్లపై ఉక్కుపాదం

‘చలో విజయవాడ’ను అడ్డుకున్న పోలీసులు

రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు, నిర్బంధాలు

ఏబీఎన్‌ తొలగింపు, ప్యాకేజీల మార్పు

ఇతరత్రా సమస్యలపై ఆపరేటర్ల ఆందోళన


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

తమ సమస్యలు చెప్పుకొనేందుకు విజయవాడ బయలుదేరిన ఫైబర్‌నెట్‌ ఆపరేటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. హెచ్చరికలు, అరెస్టులతో వారిని అడ్డుకున్నారు. ఫైబర్‌నెట్‌లో ఏబీఎన్‌ నిలిపివేత, ప్యాకేజీల మార్పు, బేసిక్‌ ప్యాకేజీలో ముఖ్యమైన చానళ్లను తీసివేయడం, సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించకపోవడం, తమ కమీషన్‌లో భారీగా కోత విధించడం తదితర సమస్యలపై సమస్యలను ఏపీ స్టేట్‌ ఫైబర్‌ లిమిటెడ్‌ (ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌) చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లాలని ఏపీ కేబుల్‌ ఆపరేటర్స్‌ జేఏసీ ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చింది. బుధవారం రాత్రి 13 జిల్లాల నుంచి కేబుల్‌ ఆపరేటర్లు వివిధ మార్గాల ద్వారా విజయవాడకు బయలుదేరారు. ఫైబర్‌నెట్‌ ఆపరేటర్ల ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని భగ్నం చేయాలంటూ అధికారులు ఆదేశించడంతో... పోలీసులు ఎక్కడికక్కడ రంగంలోకి దిగి అరెస్టులు, నిర్బంధాల పర్వం కొనసాగించారు. కడప జిల్లా నుంచి బయలుదేరిన సుమారు 70 మంది ఆపరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం, అనంతపురం జిల్లాల నుంచి విజయవాడకు బయలుదేరేందుకు సిద్ధంగా బస్సులను నిలిపివేసి... ఫైబర్‌నెట్‌ ఆపరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో ముందుగానే పోలీసులు ఆపరేటర్లకు ఫోన్‌ చేసి హెచ్చరించారు. 


అన్నీ సమస్యలే...

‘‘గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ ద్వారా నెట్‌, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో టెలిఫోన్‌తో పాటు 369 చానళ్లను కేవలం 149 రూపాయలకే ఇచ్చేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక టారి్‌ఫను భారీగా పెంచారు. కమిషన్‌ను తగ్గించారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి చానల్‌తో పాటు మరో చానల్‌ ప్రసారాలు నిలిపివేశారు. దీంతో వినియోగదారులు డబ్బులు చెల్లించడంలేదు. తాజాగా 449, 599 ప్యాకేజీలు పెట్టి 300 ప్యాకేజీలో జెమిని చానల్‌ను తొలగించారు. మున్ముందు దేనిని తీసేస్తారో తెలియని పరిస్థితి. అంతేకాకుండా 35 ఏళ్లకు పైగా కేబుల్‌ ఆపరేటర్లుగా జీవనోపాధి సాగిస్తున్న మమ్మల్ని కాదని, వైసీపీ కార్యకర్తలకు డమ్మీ ఆపరేటర్లుగా కేబుల్‌ నెట్‌ ఇస్తున్నారు. మా కమిషన్‌ను రూ.100కు తగ్గించారు. మా గోడు వినిపించుకునేందుకు విజయవాడకు వెళితే... అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. మా సమస్యలు పరిష్కరించకపోతే... ఆత్మహత్యలే శరణ్యం అవుతాయి!’’

- వేణుగోపాల్‌ రెడ్డి, కడప (ఫైబర్‌ నెట్‌ ఆపరేటర్ల జేఏసీ ప్రధాన కార్యదర్శి)

Updated Date - 2021-02-25T09:22:18+05:30 IST