కర్నూలులో భక్తులు పలుచన

ABN , First Publish Date - 2020-11-24T06:16:52+05:30 IST

కర్నూలులోని పుష్కర ఘాట్లలో కార్తీకమాసం రెండో సోమవారం పెద్దగా సందడి కనిపించలేదు.

కర్నూలులో భక్తులు పలుచన
నిర్మానుష్యంగా కనిపిస్తున్న కర్నూలు మునగాలపాడు ఘాట్‌

  1. కార్తీక సోమవారమైనా కనిపించని సందడి
  2. ఘాట్లను తనిఖీ చేసిన ఎమ్మెల్యేలు, అధికారులు 
  3. పిండ ప్రదానానికీ నీరు కరువు


కర్నూలు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): కర్నూలులోని పుష్కర ఘాట్లలో  కార్తీకమాసం రెండో సోమవారం పెద్దగా సందడి కనిపించలేదు. ఆదివారంతో పోల్చుకుంటే భక్తుల సంఖ్య తగ్గింది. సంకల్‌ బాగ్‌ ఘాట్‌ మినహా ఎక్కడా కార్తీక దీపాలు వెలగలేదు. రాంభొట్ల, పంప్‌హౌస్‌ ఘాట్లలో రద్దీ కాస్త పెరిగింది. కానీ సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలు మొదలై నాలుగు రోజులు గడిచినా ఇంకా ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. సంకల్‌ బాగ్‌ ఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సంకల్‌భాగ్‌, రాంభొట్ల, పంప్‌హౌస్‌ ఘాట్లు తప్ప మిగతా ఘాట్లలో ఎక్కడా భక్తుల సందడి కనిపించలేదు. నాగసాయి ఆలయ ఘాట్‌లో వసతుల కల్పన అధ్వానంగా ఉంది. ఘాట్‌కు వెళ్లే మెట్లు దిగడానికి సౌకర్యంగా లేవు. ఇక్కడ ఏర్పాటు చేసిన షవర్ల కింద స్నానాలు చేసే వారు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. రాఘవేంద్ర మఠం ఘాట్‌లో సంప్రోక్షణ చేసుకోవడానికి తుంగభద్ర నీరు అందుబాటులో లేదు. నగరంలోని మిగతా ఘాట్లలో పరిస్థితీ ఇలానే ఉంది. దీంతో భక్తులెవరూ పుష్కర స్నానాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. తెలంగాణలోని అలంపూర్‌ తదితర ఘాట్లలో నదీ స్నానాలకు అనుమతిస్తున్నారు. దీంతో భక్తులంతా అటువైపు వెళుతున్నారు. 


స్వాత్మనందేంద్ర సరస్వతి పూజలు

సంకల్‌ భాగ్‌లోని పుష్కర ఘాట్‌ను విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మనందేంద్ర సరస్వతి స్వామి సందర్శించారు. నదీమ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలను సమర్పించారు. పీఠం తరపున నదికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నది నీటితో సంప్రోక్షణ చేసుకున్నారు. ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సుధాకర్‌ స్వామీజీతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.


ప్రచారం తప్ప ఏమీ లేదు

పుష్కరాలు అనగానే భక్తితో వచ్చాం. ఇక్కడకు వచ్చాక అనవసరంగా వచ్చామనే భావన కలుగు తోంది. కొవిడ్‌ ఉందని స్నానాలకు అనుమతి ఇవ్వకపోవడం సరైనదే. కానీ పిండ ప్రదానాలకు కూడా నీరు లేకపోవడం దారుణం. పుష్కరాలను గొప్పగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ప్రచారం మీద ఉన్న శ్రద్ధ సౌకర్యాల మీద పెడితే బాగుంటుంది. పుష్క రాలను నిర్వహించే పద్ధతి ఇది కాదు. భక్తుల మనోభావాలు పట్టించుకోకుండా మమ అనిపించే దానికన్నా రావద్దని చెప్పి ఉంటే బాగుండేది. - సుబ్రహ్మణ్యం, కృష్ణా జిల్లా


ఏర్పాట్లు సరిగాలేవు..

పుష్కర స్నానం చేయడానికి విజయవాడ నుంచి ఎనిమిది మందిమి వచ్చాం. జల్లు స్నానాలు అని తెలిస్తే ఇంత దూరం వచ్చే వాళ్ళం కాదు.  భక్తులు నదీ స్నానం చేయాలని అనుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే నీరు సరిగా లేదు. జల్లు స్నానాలు చేసినా పుష్కర స్నానం చేశామన్న తృప్తి లేదు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు ఏర్పాట్లు ఇలా చేస్తే ఎలా..? - సునీత, విజయవాడ


Updated Date - 2020-11-24T06:16:52+05:30 IST