మూన్నాళ్ల ముచ్చటే

ABN , First Publish Date - 2020-11-22T05:28:55+05:30 IST

ఆమదాలవలస ఆర్టీసీ కాంప్లెక్స్‌ నిర్వహణ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. కాంప్లెక్స్‌ను ప్రారంభించిన కొత్తలో పదుల సంఖ్యలో బస్సులు రాకపోకలు సాగించేవి. ఆ తరువాత పూర్తిగా కాంప్లెక్స్‌లోకి రావడం మానేశా యి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మూన్నాళ్ల ముచ్చటే
బస్సులు లేక బోసిపోతున్న ఆర్టీసీ కాంప్లెక్స్‌

 

 ఆమదాలవలస ఆర్టీసీ కాంప్లెక్స్‌కు రాని బస్సులు 

 ప్రారంభించిన కొత్తలో తిరిగిన వైనం

 ఆ తరువాత నిర్వహణను పట్టించుకోని అధికారులు 

 ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలు 

 ప్రయాణికుల ఇబ్బందులు 

(ఆమదాలవలస)

ఆమదాలవలస ఆర్టీసీ కాంప్లెక్స్‌ నిర్వహణ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. కాంప్లెక్స్‌ను ప్రారంభించిన కొత్తలో పదుల సంఖ్యలో బస్సులు రాకపోకలు సాగించేవి. ఆ తరువాత పూర్తిగా కాంప్లెక్స్‌లోకి రావడం మానేశా యి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఆమదాలవలస పట్టణంలో సుమారు 40వేల మంది జనా భా నివసిస్తోన్నారు. ప్రధాన రైల్వే స్టేషన్‌ (శ్రీకాకుళం రోడ్‌) కూడా ఇక్కడే ఉంది. దీంతో జిల్లా కేంద్రంతోపాటు నరసన్నపేట, టెక్కలి, హిరమండలం, పాతపట్నం, సీతంపేట, పాలకొండ, తదితర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరికితోడు ఆమదాలవలస ప్రధాన వ్యాపార కేంద్రంగా కొనసాగుతుండడంతో మండల ప్రజానీకంతోపాటు పరిసర మండలాల ప్రజలు కూడా పట్టణానికి చేరుకుని వ్యాపారులు సాగిస్తున్నారు. అయితే, దశాబ్దాలుగా ప్రయాణి కుల కోసం సరైన వసతి లేకపోవడంతో వారు ఇబ్బందిపడు తూనే ఉన్నారు. గతంలో రైతు బజారు పక్కన ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఉండేది. అయితే, వివిధ కారణాల వల్ల అది మూతపడింది. ఆ తరువాత  బీఆర్‌ నగర్‌ సమీపంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఇది పట్టణానికి దూరం కావడంతో  ప్రయాణికులు అక్కడకు వెళ్లేవారు కాదు. దీంతో అదికూడా మూతపడింది. మళ్లీ టీడీపీ హయాంలో రూ.61లక్షల వ్య యంతో 2017 అక్టోబరు 20న గతంలో రైతు బజారు పక్కన ఉన్న స్థలంలోనే ఆర్టీసీ కాంప్లెక్స్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు పూర్తిచేసి 2018 సెప్టెంబరు 4న కాంప్లెక్స్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. ప్రతి రోజూ దాదాపు 80 బస్సులు నడిపేందుకు నిర్ణయించారు. ఆమదాలవలస నుంచి విశాఖ వరకు బస్సు నడిపేందుకు, శ్రీకాకుళం నుంచి పాలకొండ వెళ్లే త్రీ స్టాఫ్‌ బస్సులు కూడా ఈ కాంప్లెక్స్‌ వరకు నడిపేందుకు అప్పటీ ఆర్టీసీ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. దీంతో అన్నివి ధాలుగా ఇక్కడ బాగుంటుందని అంతా భావించారు.  అయితే, అధికారుల నిర్లక్ష్యంతో కథ మళ్లీ మొదటికే వచ్చినట్టయింది. బస్సులు కాంప్లెక్స్‌లో లోపలికి రాకుండా బయట నుంచే వెళ్లిపోతున్నాయి. సరైన నిర్వహణ లేకపోవడంతో కాంప్లెక్స్‌ బోసిపోతుంది. ప్రాంగణంలో వేసిన తారు రోడ్డు కూడా పాడైపో యింది. చీకటి పడితే చాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మా రిందని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు.  

 

 సాంకేతిక సమస్యే కారణం

ఆమదాలవలస ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంగణంలో రోడ్డు పాడైంది. గోతుల్లో బస్సులు దిగిపోతాయన్న భయంతో కొన్ని బస్సులు బయట నుంచే వెళ్లిపోతున్నాయి. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.  త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. త్రీస్టాఫ్‌ బస్సులు కాంప్లెక్స్‌కు రాకపోవడానికి సాంకేతిక సమస్య ఉంది.  కొత్తూరు నుంచి ఆమదాలవలస మీదుగా విశాఖకు బస్సు నడుపుతున్నాం. 

  -కవిత, శ్రీకాకుళం ఆర్టీసీ డిపో మెనేజర్‌ 

 

Updated Date - 2020-11-22T05:28:55+05:30 IST