జ్వరం వస్తే ఇంట్లోనే సొంత వైద్యం చేసుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!

ABN , First Publish Date - 2021-10-19T17:15:28+05:30 IST

మిగతా కాలాలతో పోలిస్తే, వానాకాలంలో జ్వరాలు ఎక్కువ. డెంగ్యూ, మలేరియా, ఇన్‌ఫ్లూయెంజా, చికున్‌ గున్యా అత్యంత సాధారణంగా కనిపించే జ్వరాలు. వీటికి తోడు నల్లులు, గోమారులతో... స్క్రబ్‌ టైఫస్‌ (రికెట్‌సెల్‌ ఫీవర్‌), ఎలుకల కారణంగా...

జ్వరం వస్తే ఇంట్లోనే సొంత వైద్యం చేసుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!

ఆంధ్రజ్యోతి(19-10-2021)

జ్వరాన్ని తగ్గించడం కోసం జ్వరం మాత్ర వేసుకుంటే సరిపోదు. 

జ్వరం రకాన్ని బట్టి వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకోవాలి.

వానల కాలం పొంచి ఉండే డెంగూ, మలేరియా లాంటి జ్వరాలకు...

తగిన  చికిత్సతో పాటు పరిసరాలు, ఆహారపుటలవాట్ల మీద ఓ కన్నేసి ఉండడమూ అవసరమే!


మిగతా కాలాలతో పోలిస్తే, వానాకాలంలో జ్వరాలు ఎక్కువ. డెంగ్యూ, మలేరియా, ఇన్‌ఫ్లూయెంజా, చికున్‌ గున్యా అత్యంత సాధారణంగా కనిపించే జ్వరాలు. వీటికి తోడు నల్లులు, గోమారులతో... స్క్రబ్‌ టైఫస్‌ (రికెట్‌సెల్‌ ఫీవర్‌), ఎలుకల కారణంగా... లోప్టోస్పైరా (రోడెంట్‌ ఫీవర్‌)లు కూడా వానా కాలంలో అరుదుగా కనిపిస్తాయి. ఈ ఏడాది ఈ రెండు రకాల జ్వరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇన్ని రకాల జ్వరాలు విజృంభించే వీలున్న వర్షా కాలంలో జ్వరం బారిన పడినప్పుడు ఎవరికి వారు ఇది ఫలానా జ్వరం అయి ఉండవచ్చులే అని సరిపెట్టుకోకుండా ఒకటి, రెండు రోజుల్లో జ్వరం అదుపులోకి రాకపోతే, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి. మరీ ముఖ్యంగా కొవిడ్‌ ముప్పు ఇప్పటికీ పొంచి ఉంది కాబట్టి, వీలైనంత త్వరగా వైద్యులను కలవడం మంచిది. 


లక్షణాలు భిన్నం

జ్వరంలో కనిపించే లక్షణాలు సోకిన ఇన్‌ఫెక్షన్‌ను బట్టి భిన్నంగా ఉంటూ ఉంటాయి. అయితే కొందర్లో జ్వరం రకాన్ని సూటిగా నిర్థారించలేని పరిస్థితీ ఉంటుంది. కొంతమందిలో జ్వరంతో పాటు దద్దుర్లు, ఇంకొందర్లో జ్వరంతో పాటు దగ్గు, జలుబు, గొంతునొప్పి, మరికొందర్లో జ్వరంతో పాటు పలుచని విరోచనాలు, వాంతులు ఉంటాయి. కొందర్లో తలనొప్పి, కామెర్లు కూడా ఉండవచ్చు. ఈ లక్షణాలను బట్టి కొంత వరకూ జ్వరం రకాన్ని గ్రహించే వీలున్నా, పూర్తి నిర్థారణ కోసం వైద్యులు కొన్ని పరీక్షలను సూచిస్తారు. 


ఇన్‌ఫ్లూయెంజా: 100 - అంతకంటే తక్కువ డిగ్రీల టెంపరేచర్‌ (లో గ్రేడ్‌) జ్వరంతో పాటు ముక్కు కారడం, గొంతునొప్పి, దగ్గు

డెంగ్యూ: 100 - 103 డిగ్రీల టెంపరేచర్‌ (హై గ్రేడ్‌) జ్వరంతో పాటు తలనొప్పి, వాంతి వస్తున్నట్టు అనిపించడం, డీహైడ్రేషన్‌, ఒళ్లునొప్పులు

చికున్‌ గున్యా: జ్వరంతో పాటు కీళ్ల నొప్పులు ఉంటాయి.

మలేరియా: జ్వరాన్ని మించి చలి ఎక్కువ ఉండడం, జ్వరం తగ్గుతూ, పెరుగుతూ ఉండడం కనిపిస్తుంది.

లెప్టోస్పైరా, స్క్రబ్‌ టైఫస్‌: ఈ ఇన్‌ఫెక్షన్స్‌లో జ్వరంతో పాటు కలరా లక్షణాలు కనిపిస్తాయి.


లెప్టోస్పైరా

పరిసరాల్లో నివశించే ఎలుకలతో సంక్రమించే బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఇది. అతిధేయులైన ఎలుకల నుంచి బ్యాక్టీరియా మనుషులకు సోకడం వల్ల ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకుతుంది. ఎలుకల మలమూత్రాలతో ఆహారపదార్థాలు కలుషితం కావడం ద్వారా ఇన్‌ఫెక్షన్‌ ప్రబలుతుంది. ఇది రాకుండా ఉండాలంటే ఇంటి పరిసరాల్లో ఎలుకలు లేకుండా చూసుకోవాలి.


స్క్రబ్‌ టైఫస్‌

నల్లులు, గోమారులు, మైట్స్‌ లాంటి పురుగులు కుట్టడం ద్వారా సోకే ఇన్‌ఫెక్షన్‌ ఇది. దీనికి సంబంధించిన జ్వరంలో ఒంటి మీద నల్లగా కందిపోయిన గాయాలు (ఇష్కార్‌) ఉంటాయి. పురుగులు కుట్టడం వల్ల ఏర్పడే ఈ గాయాల ద్వారానే బ్యాక్టీరియా శరీరంలోకి చేరుకుని ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుంది. కాబట్టి ఇంట్లో ఇలాంటి పురుగులు సంచరించే వీలు లేకుండా చూసుకోవాలి.


చికిత్స తేలికే!

జ్వరానికి కారణాలు లెక్కలేనన్ని. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌, న్యుమోనియా, బయల్పడకుండా శరీరంలో దాక్కుని ఉన్న ఇన్‌ఫెక్షన్లలో సైతం జ్వరం ప్రధాన లక్షణంగా ఉంటుంది. కాబట్టి జ్వరం కారణాన్ని కనిపెట్టడానికి కీలకమైన సిబిసి (కంప్లీట్‌ బ్లడ్‌ కౌంట్‌) పరీక్ష చేయించడం అవసరం. ఈ పరీక్షా ఫలితాన్ని బట్టి జ్వరం మూల కారణాన్ని కనిపెట్టే వీలుంటుంది. తీవ్ర జ్వరం ఉంటే, ఈ పరీక్షతో పాటు డెంగ్యూ పరీక్ష, మలేరియా, సిఆర్‌పి అనే ఇన్‌ఫ్లమేటరీ మార్కర్‌ పరీక్షలు అవసరమవుతాయి. నాలుగైదు రోజుల పాటు తక్కువ తీవ్రతతో కూడిన జ్వరం వేధిస్తూ ఉంటే, టైఫాయిడ్‌ పరీక్ష కూడా అవసరమవుతుంది.


యాంటీబయాటిక్స్‌ ఎప్పుడంటే....

తీవ్ర లక్షణాలు లేని జ్వరాలకు సింప్టమాటిక్‌ చికిత్స సరిపోతుంది. శరీరంలో ద్రవ పరిమాణం తగ్గకుండా చూసుకోవడంతో పాటు, విశ్రాంతి తీసుకుంటే ఈ రకం జ్వరం అదుపులోకి వస్తుంది. రెండు రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గనప్పుడు మాత్రమే పరీక్షా ఫలితాలను బట్టి మలేరియా, డెంగ్యూలకు సంబంధించిన చికిత్స మొదలుపెట్టవలసి ఉంటుంది. డెంగ్యూలో సైతం ప్రారంభంలో హైడ్రేషన్‌తోనే జ్వరాన్ని అదుపు చేయగలిగే చికిత్సనే వైద్యులు సూచిస్తారు. జ్వరం తగ్గకపోగా దద్దుర్లు, రక్తస్రావం కనిపిస్తే, రక్తపరీక్షతో ప్లేట్‌లెట్ల మీద ఓ కన్నేసి ఉంచి, అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్‌ అందించవలసి ఉంటుంది. 


పరిసరాల పరిశుభ్రతే కీలకం

వర్షాకాలంలో దోమలు, ఈగలు, ఎలుకలు, పురుగులు ఇంటి పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా దోమలు పెరిగే వీలు లేకుండా నీరు నిల్వ ఉండిపోయే వీలున్న ప్రదేశాలను వెతకాలి. కొబ్బరి చిప్పలు, టైర్లు లాంటి వాన నీళ్లు నిల్వ ఉండిపోయే వస్తువులను పరిసరాల్లో లేకుండా చేసుకోవాలి. అలాగే తేమ, పాచి పేరుకోకుండా చూసుకోవాలి. అలాగే దోమలు కుట్టే వీలు లేకుండా దోమ తెరలు వాడడం, ఒళ్లు మొత్తాన్నీ కప్పి ఉంచే దుస్తులు ధరించడం చేయాలి. ఆహారపదార్థాల మీద తప్పనిసరిగా మూతలు ఉంచాలి. కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి.


ఇలాంటి ఆహారం మేలు

తాజాగా వండిన వేడి పదార్థాలే ఈ కాలంలో తీసుకోవాలి. చల్లారిపోయిన పదార్థాలు, గడ్డకట్టిన పదార్థాలు తీసుకోవడం తగ్గించాలి. మరీ ముఖ్యంగా ఈ కాలం ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇవ్వాలి. హోటల్‌ భోజనాలు, బండ్ల మీద దొరికే చిరుతిళ్లు మానేయాలి. ఎక్కువగా నీరు కలిగి ఉండే పళ్లు, కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పళ్లు, కూరగాయల ద్వారా కూడా ఈ కాలంలో వ్యాధికారక క్రిములు శరీరంలోకి చేరే అవకాశాలు ఎక్కువ కాబట్టి, పళ్లు, కూరగాయలను ఎక్కువ నీళ్లతో శుభ్రం చేసిన తర్వాతే వాడుకోవాలి. అలాగే జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ ద్రవపదార్థాలతో పాటు తేలికగా అరిగే సూప్స్‌, జావ, పళ్లరసాలు తీసుకోవాలి. నిమ్మజాతి పళ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పీచు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ క్యాలరీలు, చక్కెరలు ఉన్న పదార్థాలు తగ్గించాలి.


పిల్లల్లో జ్వరాలు
జ్వరంతో నీరసపడిపోయే పిల్లలు ఉంటారు. జ్వరంతో కూడా హుషారుగా గంతులేస్తూ ఆడుకునే పిల్లలూ ఉంటారు. కాబట్టి పిల్లల్లో జ్వరాలను కనిపెట్టడం కొంత కష్టమవుతుంది. అయితే జ్వరంతో నీరసపడినా, హుషారుగా ఉన్నా... జ్వరం తీవ్రమవుతూ దగ్గు, జలుబు, మూత్రవిసర్జన పరిమాణం తగ్గడం, వాంతులు, విరోచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తే,  ఆలస్యం చేయకుండా పిల్లలను వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలి. అలాకాకుండా తక్కువ జ్వరం పెరగకుండా రెండు రోజుల పాటు కొనసాగినా కంగారు పడవలసిన అవసరం లేదు. 

సొంత వైద్యం కొంత మానుకుని...

జ్వరం వచ్చిన వెంటనే కొందరు మందుల షాపుకు వెళ్లి, జ్వరాన్ని తగ్గించే మందులతో పాటు యాంటీబయాటిక్స్‌ కొని, వాడేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సొంత వైద్యం వల్ల వైద్యులు సూచించే రక్తపరీక్షల ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో వ్యాధినిర్థారణ క్లిష్టమె, వైద్యులు ఇన్‌ఫెక్షన్‌ను ఊహించి యాంటీబయాటిక్స్‌ సూచించే పరిస్థితి వస్తుంది. ఫలితంగా చికిత్స ఆలస్యమవడంతో పాటు, ఫలితం చూపించని పరిస్థితీ ఉండే వీలుంటుంది. కాబట్టి సొంత వైద్యం మానుకోవడమే మేలు. అలాగని జ్వరం వచ్చిన వెంటనే వైద్యుల దగ్గరకు వెళ్లాలనే నియమం కూడా లేదు. పారాసిటమాల్‌ మాత్రలు ఒకటి, రెండు రోజులు వాడుకుంటూ, శరీరంలో నీరు తగ్గకుండా చూసుకుంటూ విశ్రాంతి తీసుకుంటే జ్వరం కచ్చితంగా అదుపులోకి వస్తుంది. అలా కాకుండా జ్వరం తీవ్రమవుతూ, ఇతరత్రా లక్షణాలు కూడా మొదలైనప్పుడు మాత్రమే వైద్య చికిత్సను ఆశ్రయించాలి. కొవిడ్‌ గురించిన అనుమానం ఉండడం కూడా అవసరమే! అయితే డెంగ్యూలో లాగా 102 - 103 డిగ్రీల టెంపరేచర్‌ కరోనాలో ఉండదు. కాబట్టి జ్వరం కనిపించినప్పుడు తమని తాము ఐసొలైట్‌ చేసుకుని, వాంతులు, వాసన, రుచి కోల్పోవడం లాంటి లక్షణాలను బట్టి వైద్యులను కలవడం ఉత్తమం.



ఏ థర్మామీటరు మేలు

మార్కెట్లో ఎన్నో రకాల థర్మామీటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింట్లో ఉత్తమమమైనది పాదరసం థర్మామీటరు. డిజిటల్‌ థర్మామీటరు కూడా కచ్చితమైన ఫలితాన్ని అందిస్తుంది. కచ్చితమైన రీడింగ్‌ తెలుసుకోవాలంటే థర్మామీటరు చర్మాన్ని తాకేలా ఉండాలి. కాబట్టి నాలుక అడుగున థర్మామీటరు ఉంచుకోగలిగే పిల్లలైతే, పాదరసం థర్మామీటరును ఉపయోగించడమే మేలు. అంతకంటే చిన్న వయసు పిల్లలైతే బాహుమూలల్లో పాదరసం లేదా డిజిటల్‌ థర్మామీటరుతో జ్వరాన్ని కొలుచుకోవచ్చు. స్పర్శతో సంబంధం లేకుండా నుదుటికి దూరంగా ఉంచి పరీక్షించే థర్మామీటరు వాడకపోవడమే మేలు. 


డాక్టర్‌ సౌమ్య బొందలపాటి

జనరల్‌ ఫిజీషియన్‌,

కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌,

గచ్చిబౌలి, హైదరాబాద్‌.

Updated Date - 2021-10-19T17:15:28+05:30 IST