ఇంటింటా జ్వర సర్వే

ABN , First Publish Date - 2022-01-22T05:33:13+05:30 IST

కరోనా మూడవ వేవ్‌ ముప్పు ముంచుకువస్తుంటే దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసుకుంటోంది.

ఇంటింటా జ్వర సర్వే
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌ పాల్గొన్న అధికారులు


- తొలిరోజు 41,897 కుటుంబాల సర్వే

- 969 మందికి కరోనా మందుల కిట్లు పంపిణీ

- కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్‌పై మంత్రి గంగుల సమీక్ష

- 26లోగా వందశాతం వ్యాక్సినేషన్‌ చేసిన పంచాయతీకి రూ. లక్ష బహుమతి


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా మూడవ వేవ్‌ ముప్పు ముంచుకువస్తుంటే దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసుకుంటోంది. పండగలు, జాతరలు, ఫంక్షన్లు, ప్రజల నిర్లక్ష్యం కారణంగా కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. వందలాది మంది వ్యాధిబారిన పడుతున్నారు. వారం రోజులుగా జిల్లాలో సుమారు 2 వేల మంది వ్యాధిబారినపడ్డారు. ఈ నెల ప్రారంభంలో కేసులే లేని కరీంనగర్‌ జిల్లాలో ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో రోగ నిర్ధారణ అవుతున్నవారే రోజుకు 500లకు పైగా ఉంటున్నారు. ప్రైవేట్‌గా కిట్లు కొనుక్కొని ఇంట్లోనే పరీక్ష చేసుకునే అవకాశాలు, ప్రైవేట్‌ వైద్యశాలల్లో పరీక్షలు చేసుకొని చికిత్స పొందే వీలు ఉండడంతో రోజుకు వెయ్యి మందికిపైగానే వ్యాధి బారిన పడుతున్నారని అంచనా వేస్తున్నారు. గడిచిన నాలుగు రోజులుగా రోజు రోజుకు కేసులు పెరుగుతూ పోతున్నాయి. 


రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు


ఈ నెల 16న కేవలం 44 పాజిటివ్‌ కేసులు మాత్రమే రాగా 17న 117, 18న 258, 19న 367, 20న 543, 21న 567 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. 16న పాజిటివ్‌ రేట్‌ 6 శాతంగా ఉండగా 21న అది 20.6 శాతానికి చేరుకున్నది. మూడవ వేవ్‌ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటూ జిల్లాలకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జ్వర సర్వేను ప్రారంభించారు. జ్వర సర్వేను నిర్వహించేందుకు 648 టీంలను ఏర్పాటు చేశారు. అర్బన్‌ టీంలో ఒక ఏఎన్‌ఎం లేదా ఒక ఆశావర్కర్‌తో పాటు మున్సిపల్‌ ఉద్యోగి ఒకరు, మెప్మా ఆర్‌పీ ఒకరు, ఒక హెల్త్‌ సూపర్‌వైజర్‌, నోడల్‌ ఆఫీసర్‌ ఉన్నారు. రూరల్‌ టీంలో ఏఎన్‌ఎం, ఆశాతోపాటు అంగన్‌వాడీ టీచర్‌, ఆర్‌పీ, మహిళా సంఘం లీడర్‌ ఉన్నారు. ఈ టీంలు శుక్రవారం జిల్లాలోని 41,897 గృహాలకు వెళ్లి సర్వే నిర్వహించారు. ఆయా గృహాల్లో 969 మంది జలుబు, దగ్గు, జ్వరం, తదితర లక్షణాలతో బాధపడుతున్నారని గుర్తించి వారందరికీ కరోనా కిట్లు, మెడికల్‌ కిట్లను అందజేశారు. అలాగే ఇప్పటి వరకు రెండవ డోస్‌ వ్యాక్సినేషన్‌ చేసుకోని వారిని గుర్తించి అక్కడికక్కడే టీకా ఇస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో కోవిడ్‌ పేషెంట్లకు చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 450 ఆక్సీజన్‌ పడకలు ఉండగా, అందులో 41 కొవిడ్‌ ఐసీయూ పడకలు ఉన్నాయి. మొత్తం 52 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లల కోసం 42 పడకలతో కొవిడ్‌ వార్డు ఏర్పాటు చేశారు. అందులో 12 ఐసీయూ పడకలు ఉన్నాయి. జిల్లా అంతటా అవసరానికి సరిపడా మందుల నిల్వలను అందుబాటులో ఉంచారు. 


 కొవిడ్‌ వ్యాప్తిపై మంత్రి గంగుల సమీక్ష


మూడవ వేవ్‌ ముప్పు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మంత్రి గంగుల కమలాకర్‌ శుక్రవారం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనవరి 26లోగా వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని, జిల్లాను కొవిడ్‌ రహిత జిల్లాగా మార్చాలని అధికారులకు సూచించారు. ఇంటింటి సర్వే నిర్వహించి కొవిడ్‌ లక్షణాలున్న వారందరికీ మందుల కిట్లు అందజేయాలని కోరారు. రెండవ డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తిచేస్తే ఆ గ్రామ పంచాయతీకి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచే పంచాయతీలకు 50 వేలు, 25 వేల రూపాయల చొప్పున నగదు బహుమతి అందజేస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ ప్రకటించారు. ఇప్పటికే మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ 103 శాతం పూర్తయిందని, రెండవ డోస్‌ 97 శాతం పూర్తయినందున మిగతా 3 శాతం మందికి వెంటనే వ్యాక్సిన్‌ వేయాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను కోరారు. 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఇప్పటికే 75 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందని, బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ 30 శాతం పూర్తయిందని మంత్రి తెలిపారు. జిల్లాను ఆరోగ్యవంతమైన జిల్లాగా మార్చేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కృషి చేయాలని మంత్రి కోరారు. ఒమైక్రాన్‌ ప్రాణాంతకం కానప్పటికీ తప్పనిసరిగా అందరూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు. సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కనమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్‌, గరిమ అగర్వాల్‌, జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జువేరియా, మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T05:33:13+05:30 IST