జ్వర సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-01-23T06:07:23+05:30 IST

ప్రతి ఇంటికి వెళ్లి జ్వర సర్వేను(ఫీవర్‌ సర్వే)ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

జ్వర సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
ఇంటింటా జ్వర సర్వేను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌



- కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌


కరీంనగర్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రతి ఇంటికి వెళ్లి జ్వర సర్వేను(ఫీవర్‌ సర్వే)ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.  నగరంలోని మంకమ్మతోట, కాశ్మీర్‌గడ్డ, రైతు బజార్‌లో ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, ఆర్‌పీలు చేస్తున్న ఇంటింటి జ్వర సర్వేను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌  ప్రజలతో మాట్లాడారు. కొవిడ్‌ మొదటి, రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ తీసుకున్నారా అని అడిగారు. వారు వేయించుకున్నామని తెలిపారు. మంకమ్మతోటలో సర్వేచేస్తున్న వైద్య సిబ్బంది వద్దకు బూస్టర్‌ డోస్‌ తీసుకునేందుకు వచ్చిన కృష్ణవేణి అనే మహిళతో కలెక్టర్‌ మాట్లాడారు. ఇది వరకు ఎప్పుడైనా కరోనా వచ్చిందా అనిడుగగా రాలేదని ఆమె తెలిపింది. కశ్మీర్‌గడ్డలో కరోనా పాజిటివ్‌ వచ్చిన మహిళకు కలెక్టర్‌ ధైర్యం చెప్పారు. మందులు సరిగా వాడితే తగ్గుతుందని అన్నారు. అక్కడే ఉన్న వ్యక్తి మాస్కు ధరించకుండా కనబడగా కలెక్టర్‌ ఆ వ్యక్తికి మాస్కు ఇచ్చి ధరింపజేశారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. జ్వరంతో బాధపడుతున్న వారికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి హోం ఐసోలేషన్‌ ఔషధ కిట్లు అందజేయాలని సర్వేబృందాన్ని ఆదేశించారు. కొవిడ్‌ లక్షణాల ఉన్నవారు తప్పనిసరిగా పరీక్షలు చేసుకుని మందులు వాడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇంటింటి ఫీవర్‌ సర్వేలో జ్వరంతో బాధపడుతున్న వారిని, కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్య కార్యకర్తలను కలెక్టర్‌ ఆదేశించారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి హోమ్‌ ఐసోలేషన్‌ కిట్స్‌ అందించాలని అన్నారు. ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, మున్సిపల్‌, స్వశక్తి మహిళా సంఘ సభ్యులు, ఆర్‌పీలు బాధ్యతాయుతంగా సర్వే నిర్వహించాలని తెలిపారు. సర్వే ఐదు రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. కొవిడ్‌ రెండవ డోస్‌ వ్యాక్సినేషన్‌ తీసుకోని వారికి వ్యాక్సిన్‌ అందజేయాలని అన్నారు. 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల వారికి వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జువేరియా, మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, వైద్య సిబ్బంది, సర్వే బృందం సభ్యులు పాల్గొన్నారు. 



 1,110 మందికి మెడికల్‌ కిట్ల పంపిణీ


సుభాష్‌నగర్‌, జనవరి 22: జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఫీవర్‌ సర్వే కొనసాగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జువైరియా ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం జిల్లా వ్యాప్తంగా 667 టీములను ఏర్పాటు చేశామని, ఆ టీములు 50,278 ఇళ్లను సందర్శించి 1,110 మందికి కొవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వారికి మెడికల్‌ కిట్లు అందించాయని పేర్కొన్నారు.

Updated Date - 2022-01-23T06:07:23+05:30 IST