మొక్కుబడిగా ఫీవర్‌ సర్వే

ABN , First Publish Date - 2022-08-05T06:11:31+05:30 IST

మొక్కుబడిగా ఫీవర్‌ సర్వే

మొక్కుబడిగా ఫీవర్‌ సర్వే

రెండు జిల్లాల్లో 20 శాతం కూడా  పూర్తికాని ఫీవర్‌ సర్వే 

జ్వరాలు, అంటువ్యాధులు, ప్రాణాంతక రోగాల విజృంభణ 

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు కిటకిట 

తెంపల్లి ఉదంతమే నిదర్శనం

మార్గదర్శకాలు పాటించని వలంటీర్లు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రెండు జిల్లాల వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటి ఫీవర్‌ సర్వే కార్యక్రమాన్ని వలంటీర్లు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 48వ విడత ఫీవర్‌ సర్వే పూర్తికాలేదు. ఈ  సర్వే సక్రమంగా జరగకపోవటం వల్ల ముందుగా వ్యాధులను,  వాటి తీవ్రతను పసిగట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. గన్నవరం మండలం తెంపల్లిలో జరిగిన మరణాలే ఇందుకు ఉదాహ రణ. ఈ సర్వే పూర్తయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మొత్తంగా చూస్తే.. రెండు జిల్లాల్లో 20 శాతంలోపే ఫీవర్‌ సర్వే పూర్తయింది. ఇటీవల తెంపల్లి గ్రామంలో డయేరియాతో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జిల్లా వైద్యశాఖ ఉరుకులు పరుగుల మీద క్యాంపులు నిర్వహించి గ్రామస్థులకు వైద్యసాయం అందించింది. ఈ గ్రామంలో 150 మందికి పైగా డయేరియా బారినపడ్డారు. వారం తర్వాత అటువైపు చూసిన అధికారులు లేరు. 

ఇంటింటి సర్వే మార్గదర్శకాలు ఇలా..

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాఽధులకు గురవుతున్న వారి సంఖ్యను అంచనా వేయాలని రెండు జిల్లాల వైద్యశాఖలు వలంటీర్లను ఆదేశించాయి. వారు తమ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే నిర్వహించాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన ఫార్మాట్‌ ప్రకారం కేటగిరీలవారీగా వివరాలను నమోదు చేసుకోవాలి. ఇంటింటికీ వెళ్లి ఎవరైనా జలుబు, జ్వరాలతో దీర్ఘకాలంగా బాధపడుతున్నారా? వ్యాక్సిన్‌ వేయించుకున్నారా? అంటువ్యాధులు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం వారి ఆర్యోగ స్థితి ఎలా ఉంది? కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? తదితర అంశాలను ఫోన్లో నమోదు చేయాలి. వలంటీర్లు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు వారి వద్దకు వెళ్లి వైద్యసాయం అందించాలి. 

క్షేత్రస్థాయిలో సర్వే నిల్‌

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వలంటీర్లు క్షేత్రస్థాయిలో ఫీవర్‌ సర్వేకు ఆసక్తి చూపించట్లేదు. ఇప్పటికే తమకు పనిభారంగా ఉందని, ఇదొకటి తలకు తగలించారన్న భావనలో ఉన్నారు. ఇంటి నుంచి ఫోన్లు చేసి కొందరు నమోదు చేస్తుండగా, మరికొందరు ఎవరికి వారే సొంత లెక్కలు రాసేస్తున్నారు.


సమగ్ర ఫీవర్‌ సర్వే నిర్వహిస్తాం.. 

ఫీవర్‌ సర్వే అనేది వలంటీర్లు కచ్చితంగా ఇంటింటికీ వెళ్లి చేయాలి. మేము అదే నిర్దేశిస్తున్నాం. ఫీవర్‌ సర్వే విషయంలో క్షేత్రస్థాయిలో కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు. సర్వే నమోదుకు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు కూడా వచ్చిన మాట వాస్తవమే.  

- ఎం.సుహాసినీ, ఎన్టీఆర్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి

Updated Date - 2022-08-05T06:11:31+05:30 IST