ఒకే ప్రశ్నతో సరి!

ABN , First Publish Date - 2022-01-23T04:53:51+05:30 IST

కొవిడ్‌ మూడోదశ వేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వరసర్వే మొక్కుబడిగా సాగుతున్నది. మూడ్రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో సిబ్బంది ‘మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలున్నాయి?’ అన్న ఒకే ప్రశ్నతో ముగిస్తున్నారు. సర్వే బృందాల్లో సభ్యులకు రెగ్యులర్‌

ఒకే ప్రశ్నతో సరి!
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూర్‌ గ్రామంలో ఫీవర్‌సర్వే నిర్వహిస్తున్న వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది

నమూనా లేకుండానే మొక్కుబడిగా జ్వరసర్వే

వివరాల నమోదుకు కనిపించని నమూనా

ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని మాత్రమే అడుగుతున్న సిబ్బంది

కుటుంబ వివరాల నమోదు కూడా లేదు

ఒక్కో బృందం 25 ఇళ్లలో సర్వే

సర్వేతో పాటు సాధారణ విధులు నిర్వర్తించాల్సిందే!

వివరాలు మీడియాకు వివరించొద్దని ఆదేశాలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి/మెదక్‌, జనవరి 22: కొవిడ్‌ మూడోదశ వేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వరసర్వే మొక్కుబడిగా సాగుతున్నది. మూడ్రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో సిబ్బంది ‘మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలున్నాయి?’ అన్న ఒకే ప్రశ్నతో ముగిస్తున్నారు. సర్వే బృందాల్లో సభ్యులకు రెగ్యులర్‌ విధుల బాధ్యత కూడా ఉండటంతో మమ అనిపిస్తున్నారు.  జర్వసర్వే కోసం వైద్యఆరోగ్యశాఖ నిర్ణీత నమూనా ఏదీ రూపొందించలేదు. సర్వేలో భాగంగా సందర్శించిన కుటుంబ సభ్యుల సంఖ్య, పేర్లు, వయసు, 18 ఏళ్లు పైబడినవారి సంఖ్య, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుంటున్నారు. వీటితో పాటు కరోనా లక్షణాలైన జ్వరం, జలుబు, దగ్గు సమస్యతో ఎవరైనా బాఽధపడుతుంటే వారి వివరాల నమోదు చేపడితే సర్వే కొంత పక్కాగా జరిగే అవకాశం ఉన్నది. కానీ నిర్ణీత ఫార్మాట్‌ ఏదీ లేకపోవడంతో ఒక్కోచోట ఒక్కోతీరుగా వివరాలు నమోదు చేస్తున్నారు. సంగారెడ్డి పట్టణంలో పలు ప్రాంతాల్లో శనివారం సర్వే నిర్వహించిన బృందాలు ‘మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా?’ అన్న ఒకే ప్రశ్న అడిగారు. సమస్యలు ఉంటే లక్షణాలను ఆరాతీసి మెడికల్‌ కిట్లు ఇస్తున్నారు. ఏ సమస్యా లేదంటే ఒక్క జవాబుతోనే ముగించారు. కనీసం కుటుంబ సభ్యుల సంఖ్య కూడా అడగలేదు.


అదనపు బాధ్యతల బరువు

ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, వీఆర్‌ఏ, మున్సిపాలిటీల్లో బిల్‌ కలెక్టర్‌, రిసోర్స్‌పర్సన్‌, మెప్మా సిబ్బందికి ప్రభుత్వం సర్వే బాధ్యత అప్పగించింది. అక్కడక్కడా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. సర్వేలో జ్వర లక్షణాలను గుర్తించడం, ప్రభుత్వం ఇస్తున్న కిట్‌లను అందజేయడంలో ఏఎన్‌ఎంలది కీలక పాత్ర. కానీ ఏఎన్‌ఎంలు చిన్నారులకు టీకాలు, గర్భిణుల నమోదు, మాతాశిశు సంరక్షణ, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ తదితర రోజువారీ బాధ్యతలు కూడా నిర్వహించాల్సి వస్తున్నది. వీరితో పాటు బృందాల్లో సభ్యులైన మున్సిపల్‌, పంచాయతీ సిబ్బంది కూడా రెగ్యులర్‌ విధులను నిర్వహించాల్సి ఉంది. అందుకే ఒక్కో బృందం ప్రతీరోజు 25 కుటుంబాలను మాత్రమే సర్వే జరపాలని జిల్లా యంత్రాగం ఆదేశించింది. పనిఒత్తిడి, సమయం తక్కువగా ఉండటంతో సిబ్బంది మొక్కుబడిగా సర్వే నిర్వహిస్తున్నారు.  


ఎంత మందికి జ్వరం వచ్చినా ఒకటే కిట్‌

సర్వేలో జ్వర లక్షణాలతో బాధపడుతున్నవారికి ముందుజాగ్రత్తగా ఐసోలేషన్‌ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ సర్వే సిబ్బంది మాత్రం ఇంట్లో నలుగురికి జ్వరం వచ్చినా ఒకే కిట్‌ ఇస్తున్నారు. శుక్రవారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణంలో 658 ఇళ్లలో జ్వరసర్వే నిర్వహించారు. 78 మంది దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. కానీ 26 హోంఐసోలేషన్‌ కిట్లు మాత్రమే పంపిణీ చేశారు. నర్సాపూర్‌ పట్టణంలో తొలిరోజు 387 ఇళ్లలో సర్వే నిర్వహించి 40 మందికి జ్వర లక్షణాలు ఉన్నట్టు తేల్చారు. కానీ 24 మందికే హోంఐసోలేషన్‌ కిట్లు పంపిణీ చేశారు. ఇంట్లో ముగ్గురు, నలుగురు లక్షణాలతో బాధపడుతున్నా ఒకే కిట్‌ ఇస్తుండటంతో మిగిలినవారు మందుల కోసం బయటకు వెళ్తున్నారు. దీంతో డబ్బు ఖర్చుతో పాటు కరోనా వచ్చి ఉంటే ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉన్నది. అలాగే సర్వే చేస్తున్న బృందాలకు సరైన రక్షణ ఏర్పాట్లను కూడా చేయలేదు. మాస్కులు, సానిటైజర్‌, గ్లౌజులు, ఽథర్మల్‌స్ర్కినింగ్‌ యంత్రాలు కూడా ఇవ్వకుండానే సర్వే చేయిస్తున్నారు. 


సర్వే వివరాల గోప్యతపై సందేహాలు

జ్వరసర్వే మొక్కుబడిగా జరుగుతుండడంతో వివరాలు మీడియాకు వెల్లడించవద్దని ప్రభుత్వం వైద్యఆరోగ్యశాఖను ఆదేశించింది. ప్రతీరోజు ఎన్ని కుటుంబాలను సర్వే చేశారు? ఎంతమందికి లక్షణాలు ఉన్నాయి? ఎందరికి మెడికల్‌ కిట్లు ఇచ్చారు? అనే వివరాలు మీడియాకు వెల్లడించవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ గాయత్రీదేవి తెలిపారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకొని నిర్వహిస్తున్న సర్వేలో గోప్యత పాటించడం సందేహాలకు తావిస్తున్నది. 


జ్వరం ఉన్నవారందరికీ హోం ఐసోలేషన్‌ కిట్లు

–వెంకటేశ్వర్‌రావు, డీఎంహెచ్‌వో, మెదక్‌ 

మెదక్‌ జిల్లాలో ఫీవర్‌ సర్వే ముమ్మరంగా జరుగుతున్నది. సర్వే బృందానికి అవసరమైన సామగ్రిని సమకూర్చాం. అన్ని పీహెచ్‌సీలకు గతంలోనే శానిటైజర్‌, మాస్కులు, ఏఎన్‌ఎంలకు ఽథర్మల్‌స్ర్కీనింగ్‌ యంత్రాలను అందజేశాం. జ్వర బాధితులు ఎంతమంది ఉంటే అందరికీ హోంఐసోలేషన్‌ కిట్లు ఇవ్వాలని ఆదేశించాం. 

Updated Date - 2022-01-23T04:53:51+05:30 IST