ఫీవర్‌ సర్వే

ABN , First Publish Date - 2022-01-20T05:30:00+05:30 IST

ఫీవర్‌ సర్వే

ఫీవర్‌ సర్వే

  •  జిల్లాలో నేటి నుంచి ప్రారంభం  
  •  పట్టణాల్లో వార్డుకొక బృందం...  గ్రామీణ ప్రాంతాల్లో గ్రామానికొక బృందం ఏర్పాటు
  •  కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారికి హోంఐసోలేషన్‌ కిట్ల పంపిణీ 
  •  కొవిడ్‌ టీకా తీసుకోని వారికి వ్యాక్సినేషన్‌

 వికారాబాద్‌ జిల్లాలో నేటి నుంచి ఫీవర్‌ సర్వే నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం నుంచి  ఈ సర్వేను మొదట పట్టణ ప్రాంతాలు,  తర్వాత  గ్రామీణ ప్రాంతాల్లో   నిర్వహించనున్నారు.  కొవిడ్‌ కేసులు అధికంగా పట్టణ ప్రాంతాల్లో నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫీవర్‌ సర్వేలో జ్వరం, జలుబు, దగ్గు తదితర లక్షణాలు ఉన్న వారిని గుర్తించడమే కాకుండా వ్యాక్సినేషన్‌పై కూడా దృష్టి సారించనున్నారు. 

 వికారాబాద్‌, జనవరి20,(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కొవిడ్‌ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకు ప్రభుత్వం ఫీవర్‌ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. జిల్లాలో 4 మునిసిపాలిటీలు, 566 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మునిసిపాలిటీల పరిధిలో 99 వార్డులు ఉన్నాయి. ఫీవర్‌ సర్వే కోసం మునిసిపాలిటీల్లో వార్డుకొక బృందం, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామానికొక బృందం ఏర్పాటు చేయనున్నారు. పట్టణాల్లో నిర్వహించే సర్వేలో ఒక్కో బృందంలో ఆశ, ఏఎన్‌ఎం, మునిసిపల్‌ సిబ్బంది పాల్గొననుండగా, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే సర్వేలో ఒక్కో బృందంలో ఆశ, ఏఎన్‌ఎం, పంచాయతీ కార్యదర్శి ఉంటారు. ఒక్కో బృందం ప్రతిరోజూ తమకు కేటాయించిన 25 ఇళ్లలో ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కో ఇంటికి వెళ్లి  జ్వరం, దగ్గు, తలనొప్పి, జలుబు, నొప్పులు, నిస్సత్తువ, వాంతులు, విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తదితర అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్నారనేది అడిగి తెలుసుకోనున్నారు. అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు.  వారిలో ఎవరైనా కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నారని భావిస్తే ఆ విషయాన్ని సంబంధిత మెడికల్‌ అధికారికి తెలియజేసి వారి సూచన మేరకు హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేయనున్నారు. కొవిడ్‌ లక్షణాలతో బాధపడతున్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసే బాధ్యతను హెల్త్‌ సూపర్‌వైజర్లకు అప్పగించారు. ప్రతిరోజూ వారికి ఫోన్‌ చేసి ఆరోగ్యం పరిస్థితి, మందులు వాడకం,  తదితర విషయాలు తెలుసుకుని తగిన సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిరోజూ బృందం సభ్యులు ఎన్ని ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. తదితర వివరాలను మండల స్థాయిలో తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎంపీవో, వైద్యాధికారి బృందం నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంటుంది. 

వ్యాక్సినేషన్‌ కూడా..

ఫీవర్‌ సర్వేలో ఇంటింటికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న వారిలో ఎంత మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు, వ్యాక్సిన్‌ తీసునేందుకు అర్హత కలిగి తీసుకోలేని వారు ఎవరైనా ఉంటే వారిని అక్కడే వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు.  15-18 ఏళ్లలోపు టీనేజర్ల వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా ఆరా తీయనున్నారు. అందుకే ఫీవర్‌ సర్వే సమయంలో వ్యాక్సిన్‌ తీసుకోని టీనేజర్లను గుర్తించి వారికి అక్కడే వ్యాక్సిన్‌ వేయనున్నారు. అంతే కాకుండా 60 ఏళ్లు పైబడిన వారు ప్రికాషనరీ డోస్‌ తీసుకోకపోతే వారికి ఆ డోస్‌ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు.

సర్వే విజయవంతానికి  చర్యలు 

కొవిడ్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వే జిల్లాలో విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నిఖిల తెలిపారు. కొవిడ్‌ నియంత్రణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో కలిసి హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌ నుంచి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో ఫీవర్‌ సర్వే నిర్వహించేందుకు గ్రామాలు, వార్డుల వారీగా బృందాలు ఏర్పాటు చేసి వారు ఇంటింటి కీ వెళ్లి సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకోలని మంత్రి కలెక్టర్‌ను ఆదేశించగా, జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ తీరు గురించి కలెక్టర్‌ వివరించారు. రెండవ డోస్‌కు అర్హులైన వారిని గుర్తించి ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్‌ ఇస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ తుకారాంభట్‌ తదితరులు పాల్గొన్నారు.  కాగా మేడ్చల్‌ జిల్లాలో  కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ స్పీడ్‌గా కొనసాగుతోందని అదనపు కలెక్టర్‌ జాన్‌శ్యాంసన్‌ అన్నారు. 

Updated Date - 2022-01-20T05:30:00+05:30 IST