నేటినుంచి జ్వర సర్వే

ABN , First Publish Date - 2022-01-21T07:25:56+05:30 IST

ఒమైక్రాన్‌ వ్యాప్తిని నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ నేటి నుంచి నాలుగు రోజులపాటు జ్వరసర్వే నిర్వహించాలని నిర్ణయించింది.

నేటినుంచి జ్వర సర్వే
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో సర్వే చేస్తున్న సిబ్బంది(ఫైల్‌)

 నాలుగు రోజులపాటు ఇంటింటికీ వైద్య బృందాలు 

 ఉమ్మడి జిల్లాలో 3,107 బృందాలు.. 1.50లక్షల టెస్టింగ్‌ కిట్లు సిద్ధం

 ఒమైక్రాన్‌ వ్యాప్తిని నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ నేటి నుంచి నాలుగు రోజులపాటు జ్వరసర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ, శిశు సంక్షేమం, పంచాయతీ, మునిసిపల్‌శాఖ సిబ్బంది సంయుక్తంగా ఈ సర్వేలో పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ నాలుగు రోజుల్లో 38.33 లక్షల మందిని పలకరించనున్నారు. ఏఎన్‌ఎం, ఆశావర్కర్‌, పంచాయతీ కార్యదర్శులు, మెప్మా ఆర్‌పీఎంలు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు.

ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ

 నేటినుంచి సర్వే బృందాల సభ్యులు ఇంటింటికీ తిరుగుతూ కుటుంబంలోని సభ్యుల ఆరోగ్య వివరాలను సేకరించనున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి అవసరమైన మందులు ఉచితంగా అక్కడే అందజేస్తారు. ఓవైపు జ్వర సర్వే చేస్తూనే, మరోవైపు లక్షణాలు ఉన్న వారికి మందులు పంపిణీ చేస్తారు. మందులు పంపిణీ చేసిన వారిని ఐదు రోజులపాటు పరిశీలిస్తారు. ఐదు రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోతే కరోనా పరీక్షకు పంపుతారు. అక్కడ పరిస్థితిని గమనించి ఆస్పత్రిలో చేర్చడం లేదా గత ఐదు రోజుల్లో ఇచ్చిన మందులను మార్చడం వంటి చర్యలు చేపడతారు. నల్లగొండ జిల్లాలో 17.43లక్షల మంది జనాభా ఉండగా 4 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 4 రోజుల పాటు సర్వేకు గానూ 1350 బృందాలను ఈ జిల్లాలో ఏర్పాటు చేయగా 34వేల టెస్టింగ్‌ కిట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 13 లక్షల జనాభాకుగానూ జ్వర సర్వే 1000 బృందాలను ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల్లో ఈ బృందాలు జిల్లాలోని 2.70లక్షల కుటుంబాల్లో వివరాలు సేకరిస్తారు. కరోనా రోగులను పరీక్షించేందుకు జిల్లాలో ప్రస్తుతం 70వేల మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 7.90 లక్షల మంది జనాభా ఉండగా 757 బృందాలను ఏర్పాటు చేశారు. 46 వేల టెస్టింగ్‌ కిట్లు ప్రస్తుతం ఈ జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. మొదటి, రెండో దశ కరోనా విజృంభన సమయంలో ప్రభుత్వం సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. 


ఉమ్మడి జిల్లాలో 689 మందికి పాజిటివ్‌

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 689 మందికి గురువారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కట్టంగూర్‌ మండలంలో 15 మందికి, దేవరకొండలో 35 మందికి, చందంపేటలో ఇద్దరికి, చింతపల్లిలో నలుగురికి, డిండిలో ముగ్గురికి, గుడిపల్లిలో ఒకరికి, గుర్రంపోడులో ఇద్దరికి, కొండమల్లేపల్లిలో 19 మందికి, బొడ్డుపల్లిలో ఏడుగురికి, మర్రిగూడలో నలుగురికి, పీఏపల్లిలో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మోత్కూరు మండలంలో 17 మందికి, వలిగొండ మండలంలో 31 మందికి, ఆత్మకూరు(ఎం) మండలంలో 14 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అదే విధంగా ఆత్మకూర్‌(ఎస్‌) తహసీల్దార్‌ తహసీల్దార్‌ హేమమాలిని, డిప్యూటీ తహసీల్దార్‌ లక్ష్మి, ధరణి ఆపరేటర్‌ వీరబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తహసీల్దార్‌ కార్యాలయంలో హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేశారు. చండూరు  ఎస్‌బీఐలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మరొకరికి లక్షణాలు కనిపించడంతో ఉదయం నుంచి బ్యాంక్‌లో శానిటైజేషన్‌ చేశారు. చౌటుప్పల్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో గురువారం 689 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


కొవిడ్‌ నియంత్రణకే ఇంటింటిసర్వే

నల్లగొండ టౌన్‌ / సూర్యాపేట(కలెక్టరేట్‌) / భువనగిరి రూరల్‌, జనవరి 20: కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నెల 21 నుంచి ఇంటింటి ఆరోగ్య జ్వరసర్వే నిర్వహించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావు సూచించారు. కొవిడ్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పీఎ్‌సఎంఐడీసీ చైర్మన్‌ ఎర్రోల్ల శ్రీనివా్‌సతో కలిసి హైదరాబాద్‌ నుంచి జిల్లాల కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వార్డులవారీగా బృందాలను ఏర్పాటుచేసి ప్రతిరోజూ 25 ఇళ్ల చొప్పున సర్వే నిర్వహించాలన్నారు. కొవిడ్‌ లక్షణాలు ఉంటే వారికి హోంఐసోలేషన్‌ కిట్‌ను అందజేయాలన్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు బూస్టర్‌ డోస్‌ వేయించాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ అన్నిస్థాయిల్లోని ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్‌ ఓపీ సేవలను ప్రారంభించాలన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులతో సమీక్ష చేయాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు కొవిడ్‌తో మరణించిన వారికి ప్రభుత్వం చెల్లించే ఎక్స్‌గ్రేషియా(ఆర్థిక సాయం) త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్లు ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, వినయ్‌కృష్ణారెడ్డి, పమేలా సత్పథి,  అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, హేమంత్‌ కేశవ్‌పాటిల్‌, దీపక్‌తివారీ, డీఎంహెచ్‌వోలు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-21T07:25:56+05:30 IST