ఉత్తర కొరియాలో జ్వరాల ఉప్పెన

ABN , First Publish Date - 2022-05-17T08:06:07+05:30 IST

ఉత్తర కొరియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా సోమవారం 3.92 లక్షల మందిలో జ్వర లక్షణాలను గుర్తించగా, కొవిడ్‌ లక్షణాలతో మరో 8మంది మృతిచెందారు.

ఉత్తర కొరియాలో జ్వరాల ఉప్పెన

ఒక్కరోజే 3.92 లక్షల మందికి జ్వరాలు

అవి కరోనా కేసులేననే అనుమానాలు

సియోల్‌/బీజింగ్‌/న్యూఢిల్లీ, మే 16:ఉత్తర కొరియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా సోమవారం 3.92 లక్షల మందిలో జ్వర లక్షణాలను గుర్తించగా, కొవిడ్‌ లక్షణాలతో మరో 8మంది మృతిచెందారు. దీంతో గత వారం రోజుల వ్యవధిలో సంభవించిన జ్వర సంబంధిత మరణాల సంఖ్య 50కి పెరిగింది. ఇక జ్వర బాధితుల సంఖ్య కూడా మొత్తం 12 లక్షలు దాటింది. వీరిలో దాదాపు 5.64 లక్షల మంది క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.ఇంతలా జ్వరాలు, కొవిడ్‌ కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలోనూ ప్రభుత్వ వైద్య యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ఉన్‌ మండిపడ్డారు. ఔషధాలను వేగవంతంగా పంపిణీ చేయడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను వేగంగా నిర్వహించే బాధ్యతను సైన్యానికి అప్పగించారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ వల్ల అక్కడ కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతోందని అంచనా వేస్తున్నారు. ప్రతిదాన్ని రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించే ఉత్తర కొరియా.. కొవిడ్‌ కేసులనూ జ్వరాల ముసుగులో ప్రపంచానికి తెలియకుండా దాస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. గత 46 రోజులుగా లాక్‌డౌన్‌లో మగ్గుతున్న చైనాలోని షాంఘై నగరవాసులకు మంచిరోజులు వచ్చాయి. కరోనా కేసులు నియంత్రణలోకి వస్తున్నందున త్వరలోనే లాక్‌డౌన్‌ను ఎత్తేస్తామని షాంఘై డిప్యూటీ మేయర్‌ జాంగ్‌ మింగ్‌ ప్రకటించారు. మరోవైపు భారత్‌లో 2,202 కొత్త కొవిడ్‌ కేసులు నమోదవగా, 27 మరణాలు చోటుచేసుకున్నాయి. గత 24 గంటల్లో 375 యాక్టివ్‌ కేసులు తగ్గడంతో వాటి మొత్తం సంఖ్య 17,317కు చేరింది.  


కోర్బెవ్యాక్స్‌ డోసు ధర 

రూ.840 నుంచి రూ.250కి తగ్గింపు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : ప్రైవేటు వ్యాక్సిన్‌ కేంద్రాలకు సరఫరా చేసే కోర్బెవ్యాక్స్‌ టీకా డోసు ధరను రూ.840 నుంచి రూ.250కి తగ్గించినట్లు బయొలాజికల్‌-ఈ కంపెనీ సోమవారం వెల్లడించింది. పన్నులు, టీకా వేసేందుకు అయ్యే చార్జీలు కలుపుకొని ఒక్కో డోసు ధర రూ.400కు చేరుతుందని తెలిపింది. ఇంతకుముందు ఈ రుసుములన్నీ కలుపుకొని ఒక్కో కోర్బెవ్యాక్స్‌ డోసును వేసుకునేందుకు రూ.990 దాకా చెల్లించాల్సి వచ్చేదని పేర్కొంది. దేశంలోని పిల్లలందరికీ టీకా అందాలనే విశాల దృక్పథంతోనే ధరను తగ్గించామని స్పష్టం చేసింది. ఒక వయల్‌లో ఒకే డోసు వ్యాక్సిన్‌ ఉండేలా సింగిల్‌ డోస్‌ వయల్‌ను బయొలాజికల్‌-ఈ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల వ్యాక్సిన్‌ వృథాకు అడ్డుకట్ట పడుతుంది. 

Updated Date - 2022-05-17T08:06:07+05:30 IST