జ్వర జ్వాల!

ABN , First Publish Date - 2022-08-10T10:02:38+05:30 IST

వరుస వర్షాలు.. నీరు నిల్వ ఉండటం, దోమల బెడద, కలుషిత తాగునీటి ప్రభావమో ఏమో రాష్ట్రంలో గత పదిరోజులుగా విష జ్వరాలు, సీజనల్‌ జ్వరాలు పెరుగుతున్నాయి! చిన్నా పెద్దా.

జ్వర జ్వాల!

రాష్ట్రంలో పెరుగుతున్న విషజ్వరాలు

వాంతులు, విరేచనాలతో ఆస్పత్రులకు

దొరకని పడకలు.. ఓపీ రెండింతలు

మూడు నెలల్లో 70వేల డయేరియా, 

ఏడు నెలల్లో 2110 డెంగీ కేసులు

హైదరాబాద్‌, రంగారెడ్డిలోనే 1200 

డెంగీ బాధితులు నిరుటికి రెట్టింపు 

కొవిడ్‌ కేసుల్లో పెరుగుదల

వైరల్‌ జ్వరాల చికిత్సతో నయం


వరుస వర్షాలు.. నీరు నిల్వ ఉండటం, దోమల బెడద, కలుషిత తాగునీటి ప్రభావమో ఏమో రాష్ట్రంలో గత పదిరోజులుగా విష జ్వరాలు, సీజనల్‌ జ్వరాలు పెరుగుతున్నాయి! చిన్నా పెద్దా. అనే తేడా లేకుండా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఏదో ఒక రకమైన జ్వరంతో బాధపడుతున్నారు. ఫలితంగా బాధితులు ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. దాదాపు అన్ని ఆస్పత్రుల్లోనూ ఓపీ కేసులు రెట్టింపయ్యాయి. ఈ కేసుల్లో 50 శాతం జ్వరాల కేసులే ఉంటున్నాయి. వీటిలోనూ డయేరియా, డెంగీ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. డయేరియాతో కొన్నిచోట్ల మరణాలూ సంభవిస్తున్నాయి. జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులతోనూ రోగులు ఆస్పత్రులకు వస్తున్నారు. వాంతులు, విరేచనాల కేసులే కొద్దిరోజుల వ్యవధిలోనే లక్షల్లో నమోదనట్లు వైద్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఫలితంగా రోగులు పోటెత్తుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు దొరకడం లేదు.


ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీకి తగ్గట్టుగా వైద్యశాఖ చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రుల్లో అదనంగా పడకలు వేయాలని, ఓపీ సమయాన్ని పెంచాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలే ఇందుకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఎక్కడికక్కడ నీటి నిల్వలు ఉండటం, ఫలితంగా దోమల బెడద పెరగడంతో పాటు మోటారు పంపులు నీట మునగడం, పైపుల లీకేజీ కారణంగా తాగునీరు కలుషితమవడం, పారిశుధ్య లోపం జ్వరాలకు కారణం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటితోపాటు జలుబు, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్‌తో ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.  ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలం నలుగుపల్లి గ్రామంలో ఆత్రం లచ్చుబాయి (72) అనే వృద్ధురాలు డయేరియాతో మృతిచెందింది. 


1.42 లక్షల డయేరియా కేసులు

రాష్ట్రంలో గత మూడు నెలల్లోనే 70వేల డయేరియా కేసులు నమోదయ్యాయి. గత జనవరి నుంచి జూలై వరకు ఏకంగా 1.42 లక్షల కేసులొచ్చాయి. నిరుడు ఇదే సమయంలో కేవలం 1.18 లక్షల కేసులు నమోదయ్యాయి  హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో డయేరియా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. బంక విరేచనాల కేసులు రాష్ట్రవ్యాప్తంగా ఆరువేల వరకు నమోదు అయ్యాయి. ఇక డెంగీ తీవ్రత కూడా నిరుటి కన్నా  ఎక్కువగానే ఉంది. తాజాగా నమోదవుతున్న కేసుల దృష్ట్యా ఈసారి డెంగీ విస్పోటనం (అవుట్‌ బ్రేక్‌) వచ్చే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిరుడు జనవరి నుంచి జూలై వరకు రాష్ట్రంలో 356 డెంగీ కేసులు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 2110 డెంగీ కేసులు నమోదయ్యాయి.  అంటే వాటి తీవ్రత ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 1200 డెంగీ పాజిటివ్‌లు వచ్చాయి. సెప్టెంబరులో డెంగీ కేసులు పతాక స్థాయికి చేరతాయని ఎంటమాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. అలాగే మలేరియా కేసులు 288 నమోదు అయ్యాయి. వీటితో పాటు కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. రోజూ సగటున ఐదారు వందలకుపైగా పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. గ్రేటర్‌ పరిధిలో రోజుకు సగటున 388 కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ ఓపీ కేసుల్లో 30శాతం కొవిడ్‌ కేసులే ఉంటున్నాయి. అయితే.. కొవిడ్‌ వల్ల జ్వరం వచ్చినా వైరల్‌ జ్వరాలకు చేసే చికిత్సే చేస్తున్నారు. ఆ చికిత్సకు కొవిడ్‌ జ్వరాలు నయమవుతున్నాయి.


గ్రేటర్‌ హైదరాబాద్‌ గజగజ

గ్రేటర్‌ హైదరాబాద్‌ జ్వరాలతో గజగజ వణుకుతోంది. ఇళ్లలో ఒకరి తర్వాత ఒకరు జ్వరం బారినపడుతున్నారు. ఫీవర్‌ ఆస్పత్రిలో రోజూవారీ ఓపీ వేయి దాటుతోంది. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రిలోనైతే రోజూ 2వేలకుపైగా ఓపీ కేసులొస్తున్నాయి. ఇందులో 50ునికిపైగా వైరల్‌ ఫీవర్‌ కేసులే ఉంటున్నాయి. నిలోఫర్‌లోనూ ఓపీ విభాగం పిల్లలతో కిటకిటలాడుతోంది. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ 90 శాతం కేసులు జ్వరాలే ఉంటున్నాయి. ఆ తర్వాత డెంగీ కేసులుంటున్నట్లు ఆ ఆస్పత్రుల వర్గాలు వెల్లడించాయి.


కొన్ని జిల్లాల్లో  పరిస్థితి ఇలా..

ఖమ్మం జిల్లా ప్రఽధాన ఆస్పత్రిలో రోజూ 2వేల వరకు ఓపీ వస్తోంది. ఇందులో 150మంది ఇన్‌పేషంట్లుగా చేరుతున్నారు. అత్యధికంగా జ్వరం, వాంతులు, విరేచనాల, దగ్గు లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. జనవరి నుంచి జూలై వరకు జిల్లాల్లో 18,582 వైరల్‌ ఫీవర్‌ కేసులు నమోదయ్యాయి. 

సిరిసిల్ల ఆస్పత్రిలో రోజూ 700 ఓపీ నమోదవుతోంది. ఇందులో 200 మంది జ్వరపీడితులు ఉంటున్నారు. 

నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రికి రోజూ 600 పైగా ఓపీ వస్తోంది. ఇందులో జ్వరం,  వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నవారే ఎక్కువగా ఉన్నారు. 

కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి సాధారణంగా రోజూ 600 మంది ఓపీ వచ్చేవారు. ప్రస్తుతం 800-900 మంది వస్తున్నట్లు అక్కడి వైద్యవర్గాలు వెల్లడించాయి. జిల్లా ఆస్పత్రితో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, దోమకొండ ఏరియా ఆస్పత్రుల్లోని పడకలన్నీ రోగులతో నిండిపోయాయి. ఇక్కడ టైఫాయిడ్‌, మలేరియా, డయేరియా  కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 

వికారాబాద్‌ జిల్లాలో తాండూరు జిల్లా ఆస్పత్రిలో రోజూ వేయి వరకు ఓపీ వస్తోంది. ఈ జిల్లా పరిధిలో ఒక జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా, రెండు సీహెచ్‌సీలు, 22 పీహెచ్‌సీల్లో రోజుకు మూడు వేల ఓపీ కేసులు వస్తున్నాయి.  

మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి ఈ వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 6800 ఓపీ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2800 మంది జలుబు, జ్వరాలతో వచ్చినవారే. అలాగే 1200 మంది పిల్లలు అవే లక్షణాలతో ఆస్పత్రికి వచ్చారు. 

ఆదిలాబాద్‌ జిల్లాలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ జిల్లాల్లో ఇప్పటివరకు 9197 మంది జ్వరబాధితులు ఆస్పత్రులకు వచ్చారు. 

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి పిల్లల విభాగంలో ప్రస్తుతం 120 పడకలున్నాయి. వాటికి తోడు మరో 80 పడకలను అదనంగా తీసుకున్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా పడకలు సరిపోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఫీవర్‌ ఓపీ బాగా పెరిగింది

ఫీవర్‌ ఆస్పత్రికి ఓపీ బాగా పెరిగింది. ఇప్పుడు రోజూ వేయి వరకు ఉంటోంది. ఎక్కువగా డెంగీ, వైరల్‌ ఫీవర్‌తో పాటు  టైఫాయిడ్‌, మలేరియా కేసులు వస్తున్నాయి. ఐపీ కూడా పెరుగుతోంది. ఆస్పత్రిలోని జ్వరాల వార్డులో 120 పడకలున్నాయి. వాటిలో 105 మంది చేరారు. వీరిలో 80 మంది విష జ్వరాలతో చేరారు. వాంతులు, విరేచనాల కేసులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.  ఫలితంగా ఐసీయూ వార్డులను కూడా ఫీవర్‌ బాధితుల కోసం వాడుకుంటున్నాం. 

- డాక్టర్‌ శంకర్‌, సూపరింటింటెండ్‌, ఫీవర్‌ ఆస్పత్రి, హైదరాబాద్‌


Updated Date - 2022-08-10T10:02:38+05:30 IST