ప్రతి జ్వరమూ కరోనా కాదు.. అలా అని నిర్లక్ష్యమూ వద్దు

ABN , First Publish Date - 2020-07-13T15:38:27+05:30 IST

జిల్లాలో ఒకవైపు కరోనా ఉధృతమవుతోంది.. దానికితోడు..

ప్రతి జ్వరమూ కరోనా కాదు.. అలా అని నిర్లక్ష్యమూ వద్దు

కరోనాతో జత కలుస్తున్న విషజ్వరాలు

పొంచి ఉన్న మలేరియా, డయేరియా, డెంగ్యూ, టైఫాయిడ్

ఇప్పటికే 19 మలేరియా, 31 డెంగ్యూ కేసులు నమోదు

సీజనల్ వ్యాధులపై అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

జాగ్రత్తలు తీసుకోవాలంటున్న జిల్లా మలేరియా అధికారి


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): జిల్లాలో ఒకవైపు కరోనా ఉధృతమవుతోంది.. దానికితోడు వర్షాకాలం ఆరంభం కావడంతో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో 19 మలేరియా, 31 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గతంలో జ్వరమొచ్చి ఒకటి రెండు రోజుల్లో తగ్గకపోతే మలేరియా లేదా టైఫాయిడ్ అయ్యుంటుందని భావించి రక్తపరీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు సాధారణ జ్వరమొచ్చినా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులే చెబుతున్నారు. విజయవాడ నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా విస్తరించిన కరోనా మహమ్మారి ప్రజలను ఆ స్థాయిలో భయపెడుతుండటమే ఇందుకు కారణం. అయితే ప్రతి జ్వరమూ కరోనా కాదంటున్నారు జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఉస్మాన్. ఆయా జ్వరాల లక్షణాలు, జిల్లాలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు అమలు చేస్తున్న కార్యాచరణ ప్రణాళిక గురించి ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాటామంతీ..

 

ఈ సీజన్‌లో దోమలు కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు, తాగునీరు, ఆహార పదార్థాలు కలుషితమవడం వల్ల టైఫాయిడ్‌, డయేరియా వ్యాప్తి చెందుతున్నాయి. వాటిని నియంత్రించాలంటే వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలి.


జ్వరమొస్తే అశ్రద్ధ చేయొద్దు 

వాతావరణ మార్పుల వల్ల సీజనల్‌ వ్యాధులు ప్రబలడం సాధారణమే. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఏ జ్వరమొచ్చినా కరోనానే సోకిందన్న భయం వెంటాడుతోంది. కరోనా వైరస్‌కు.. సీజనల్‌గా వచ్చే జ్వరాలకు సంబంధం ఉండదు. కొవిడ్‌ వైరస్‌ సోకినవారిలో జ్వరంతోపాటు పొడిదగ్గు, జలుబు, ఆయాసం, గొంతునొప్పి తదితర లక్షణాలు కనిపిస్తాయి. అదే మలేరియా జ్వరమొస్తే తీవ్రమైన చలి, జ్వరం వస్తాయి. వాటితో పాటే ఒళ్లంతా చెమటలు పట్టి గంట, గంటన్నర సమయంలోనే తగ్గిపోతుంది. ఇలా రోజులో ఒకటి లేదా రెండుసార్లు వస్తుంది. అది కూడా దాదాపు ప్రతిరోజూ ఒకే సమయానికి వస్తుంది.


అదే టైఫాయిడ్‌ జ్వరమైతే దగ్గు, జలుబు తదితర లక్షణాలు కనిపిస్తాయి. చికున్‌గున్యా, డెంగ్యూ అయితే తీవ్రమైన ఒళ్లు నొప్పులు (జాయింట్‌ పెయిన్స్‌) వస్తాయి. డెంగ్యూ కారణంగా ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోయినప్పుడు శరీరంపై దద్దుర్లు వస్తాయి. కాబట్టి ఏ జ్వరమొచ్చినా కరోనా వైరస్‌ సోకిందనే భయంతో ప్రజలు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. అలాగని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. జ్వరమొచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి, లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, పట్టణాలు, నగరాల్లోనివారైతే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్యులకు చూపించుకోవాలి. అది సాధారణ జ్వరమా? కరోనానా? అనేది పరీక్షించిన వైద్యులు చెబుతారు. ఏ జ్వరమైనా తగిన చికిత్స అందుబాటులోనే ఉంది. కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. 


విస్తృతంగా దోమల నివారణ చర్యలు 

సీజనల్‌ వ్యాధులకు ప్రధాన కారణం దోమలే. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పారిశుధ్యం అధ్వానంగా తయారై, తాగునీటి వనరులు కలుషితమవుతాయి. దోమల బెడద అధికమవుతోంది. అవి కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడు వాపు, ఫైలేరియా వంటివి వస్తాయి. అందుకే ఏటా జూలైలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల పేరుతో జిల్లాలో దోమల నియంత్రణకు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం యాంటీ లార్వా, యాంటీ మస్కిటో మందులను పిచికారీ చేయిస్తున్నాం. ఫాగింగ్‌ చేయిస్తున్నాం. మలేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఫీవర్‌ సర్వే నిర్వహించేలా జిల్లా మలేరియా అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి మలేరియా సోకితే ఆ కుటుంబ సభ్యులతోపాటు చుట్టుపక్కల 60 ఇళ్లలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎవరికైనా బ్రెయిన్‌ మలేరియా సోకితే ఏసీటీ ట్రీట్‌మెంట్‌ చేయిస్తాం. కాబట్టి ప్రజలు జ్వరమొచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. 


ప్రజలూ జాగ్రత్తలు తీసుకోవాలి 

సీజనల్‌ వ్యాధులకు కారణమైన దోమలు పెరగకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ఇంటి ఆవరణలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు, కుండీల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే ఏడిస్‌ ఈజిప్ట్‌ దోమ మన ఇంట్లోనే నిల్వ ఉన్న మంచినీళ్లలో గుడ్లు పెట్టి వెళుతుంది. ఆ గుడ్ల నుంచే దోమలు పుట్టుకొస్తాయి. ఈ దోమల వ్యాప్తిని నిరోధించడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలి. నీరు నిల్వ ఉండే పాత్రల్ని పని అయిన తర్వాత బోర్లించాలి. వాటర్‌ కూలర్లలో నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి.


అలా మార్చడానికి వీలుకానప్పుడు కొన్ని చుక్కల కిరోసిన్‌గాని డీజిల్‌నుగాని ఆ నీటిలో కలపాలి. మురుగు కాల్వల్లో నీరు నిలిచిపోకుండా నిత్యం పారే విధంగా చర్యలు చేపట్టాలి. నీరు నిల్వ ఉండే ట్యాంకులపై మూతలను బిగుతుగా పెట్టాలి. సెప్టిక్‌ ట్యాంకులపై మూత వేసి ఉంచాలి. చెత్తాచెదారాలను ఎప్పటికప్పుడు పారవేయాలి. దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలకు, తలుపులకు దోమతెరలు ఏర్పాటు చేసుకోవాలి. నిద్రించే ప్రదేశంలో దోమతెరలు కట్టుకోవాలి. శరీరమంతా కప్పి ఉంచేలా దుస్తులను ధరించాలి.


ప్రభుత్వ శాఖలు చేయాల్సిన పనులివీ..

వర్షాలు కురుస్తున్నందున పట్టణాలు, నగరాల్లో రోడ్లపైన, బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారాలు లేకుండా చూడాలి. మురుగు కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టాలి. దోమల లార్వాను తినే చేపలను (గాంబూజియా చేపలు) నీరు నిల్వ ఉన్న చోట వదలాలి. బహిరంగ ప్రదేశాల్లో కనీసం వారానికి ఒకసారైనా ఫాగింగ్ చేయాలి.

Updated Date - 2020-07-13T15:38:27+05:30 IST