పల్లె విలవిల

ABN , First Publish Date - 2021-05-18T06:02:07+05:30 IST

పాణ్యం మండలంలో ఇటీవల ముగ్గురు మృతి చెందారు. వారిలో 15 ఏళ్ల బాలిక, 13 ఏళ్ల బాలుడు, 70 ఏళ్ల వ్యక్తి ఉన్నారు.

పల్లె విలవిల

  1. గ్రామాల్లో పెరుగుతున్న జ్వరపీడితులు
  2. లక్షణాలున్నా కరోనా టెస్టులకు దూరం
  3. ఆర్‌ఎంపీ వైద్యుల వద్దే చికిత్సలు

కర్నూలు, ఆంధ్రజ్యోతి: 

పాణ్యం మండలంలో ఇటీవల ముగ్గురు మృతి చెందారు. వారిలో 15 ఏళ్ల బాలిక, 13 ఏళ్ల బాలుడు, 70 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. మరో ముగ్గురు యువకులకు జ్వరం తీవ్రం కావడంతో నంద్యాల ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారు వారం పాటు జ్వరంతో బాధ పడుతూ ఇంటివద్దే వైద్యం చేయించుకున్నట్లు సమాచారం. 


కౌతాళం మండలం పోదలకుంటలో 1,224 మంది జనాభా ఉన్నారు. చాలా ఇళ్లలో జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. వీరు స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వద్ద చికిత్స తీసుకుంటున్నారు. వీరికి వైద్యం అందించిన ఆర్‌ఎంపీ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం వ్యవధిలో ముగ్గురు చనిపోయారు. 


పల్లె జనం విలవిల్లాడుతున్నారు. జ్వరాలతో బాధపడుతున్నారు. కరోనా టెస్టులకు భయపడి ఆర్‌ఎంపీల వద్ద వైద్యం చేయించుకుంటున్నారు. చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వైద్యం అందించిన ఆర్‌ఎంపీలు కూడా అధిక శాతం అనారోగ్యాలతో బాధపడుతున్నారు. గడప గడపకూ వెళ్లి సర్వే చేస్తున్న వారికి గ్రామీణులు సహకరించకపోవడం, ఇంటింటి సర్వే సక్రమంగా జరగకపోవడం వల్ల ఎంతోమంది కరోనా బారిన పడినా బయటపడడం లేదని తెలుస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్‌లు పెరుగుతుండడంతో ప్రభుత్వం ఇంటింటి సర్వే ద్వారా జ్వరపీడితులను గుర్తించే కార్యక్రమం చేపట్టింది. అయితే సర్వే సిబ్బంది గ్రామీణులు వద్దకు వెళ్లినప్పుడు ఎవరికీ జ్వరం లేదని చెబుతున్నారు. జ్వరం ఉందని చెబితే క్వారంటైన్‌కు తరలిస్తారన్న భయంతో దాస్తున్నట్లు తెలుస్తోంది. 


ఆదోని మండలం దిబ్బనకల్లు, సాదాపురం గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో టెస్టులు చేయిస్తే కరోనా పాజిటివ్‌ వస్తుందన్న భయంతో ప్రజలు ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. దిబ్బనకల్లులో ఇద్దరు, సాదాపురంలో ముగ్గురు ఆర్‌ఎంపీలు చికిత్సలు అందిస్తున్నారు. ఆర్‌ఎంపీలు మాత్రం చిన్నచిన్న వ్యాధులకు మాత్రమే చికిత్సలు అందిస్తున్నామని చెబుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నా గ్రామీణులు నిర్లక్ష్యం వహిస్తుండడం ఆందోళనకు గురి చేస్తోంది. హొళగుంద మండలం గజ్జహల్లి, మందవాగిలి గ్రామాల్లో ఈ పరిస్థితి కొట్టొచ్చినట్లు ఉంది. ఆలూరు మండలంలో ఇప్పటి వరకు 230 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మొలగవల్లి, అరికెర గ్రామాల్లో 80 పైగా పాజిటివ్‌లు వచ్చాయి. ఈ గ్రామాల్లో జ్వరం, దగ్గు ఉన్న వారంతా ఆర్‌ఎంపీలతో చికిత్స చేయించుకుంటున్నారు. 


గజ్జహల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఎంతో మంది జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. 15 రోజుల్లో వివిధ కారణాలతో 20 మంది మృత్యువాత పడినట్లు సమాచారం. వారెవరూ కరోనా పరీక్షలు చేయించుకోక పోవడంతో సాధారణ మరణాలుగా నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల్లో కొందరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. 


కౌతాళం మండలం సుళకేరి గ్రామంలో 2,248 మంది జనాభా ఉన్నారు. ఈ గ్రామంలో నెలలో ఏడుగురు వివిధ ఆరోగ్య సమస్యలతో చనిపోయారు. జ్వరంతో బాధపడుతున్న కొంతమంది స్థానికంగా ఆర్‌ఎంపీల వద్ద ప్రాథమిక చికిత్స చేయించుకుంటున్నారు. 


కోసిగి మండలం సజ్జలగుడ్డం గ్రామంలో 2,350 మంది జనాభా ఉన్నారు. ఈ గ్రామంలో కొవిడ్‌ పరీక్షలు జరగటం లేదు. కొందరు కోసిగికి వెళ్ల్లి పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో ముగ్గురికి పాజిటివ్‌ రాగా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం దాదాపు 40మంది జ్వరాలతో బాధ పడుతున్నట్లు సమాచారం. జంపాపురంలో 3,945 మంది ఉన్నారు. ఇప్పటివరకు 7 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంకా 30మంది జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. వీరు స్థానిక ఆర్‌ఎంపీలతో చికిత్స చేయించుకుంటున్నట్లు సమాచారం.


పెద్దకడుబూరు మండలం ముచ్చిగిరి గ్రామంలో వెయ్యి మంది జనాభా ఉన్నారు. ఇక్కడ 40 నుంచి 50 మంది వరకు జ్వరంతో బాదపడుతున్నట్లు సమాచారం. ఇక్కడా కొంతమంది ఆర్‌ఎంపీలతో వైద్యం చేయించుకుంటున్నారు. దొడ్డిమేకల గ్రామంలో 2వేల మంది జనాభా ఉన్నారు. కొవిడ్‌తో ఇద్దరు చనిపోయారు. నెలరోజుల వ్యవధిలో వివిధ అనారోగ్య సమస్యలతో ఏడుగురు చనిపోయారు. 


 గోనెగండ్ల అలువాల గ్రామంలో 2000 జనాభా ఉన్నారు. దాదాపు వంద మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు సమాచారం. వీరు ప్రైవేటు వైద్యుల వద్ద చిక్సిత్స పొందుతున్నారు. 


సర్వే ప్రారంభమైంది

రెండు రోజుల క్రితమే ఇంటింటి సర్వే ప్రారంభించాం. గ్రామాల్లో ఇప్పటికి 3,800 ఫీవర్‌ కేసులు గుర్తించి.. 2 వేల నమూనాలు సేకరించాం. ఇవేగాక జిల్లాలో రోజుకు 5వేల కొవిడ్‌ టెస్టులు చేస్తున్నాం. త్వరలోనే పరిస్థితిని అదుపులోకి తెస్తాం. 

- డా. బి.రామగిడ్డయ్య, డీఎంహెచ్‌వో

Updated Date - 2021-05-18T06:02:07+05:30 IST