అదే.. నిర్లక్ష్యం!

ABN , First Publish Date - 2022-01-18T05:39:42+05:30 IST

కరోనా మహమ్మారి కమ్మేస్తున్నా.. ప్రజల్లో నిర్లక్ష్యం వీడటం లేదు. పండుగ వేళ జన సందడి మధ్య.. కరోనా వైరస్‌ అలజడి రేపుతోంది. ఇప్పటికే కరోనా వైరస్‌ రెండు దశల్లో విజృంభించి.. అన్ని రంగాలనూ అతలాకుతలం చేసింది. తాజాగా ఒమైక్రాన్‌ రూపంలో మూడో దశలో అలజడి సృష్టిస్తోంది. జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి.

అదే.. నిర్లక్ష్యం!
జనంతో కిక్కిరిసిన శ్రీకాకుళం మార్కెట్‌...

- పండగ సందడి.. కరోనా అలజడి

- జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న కొవిడ్‌ బాధితులు

- హోంఐసోలేషన్‌లో 1,659 మందికి చికిత్సలు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కరోనా మహమ్మారి కమ్మేస్తున్నా.. ప్రజల్లో నిర్లక్ష్యం వీడటం లేదు. పండుగ వేళ జన సందడి మధ్య.. కరోనా వైరస్‌ అలజడి రేపుతోంది. ఇప్పటికే కరోనా వైరస్‌ రెండు దశల్లో విజృంభించి.. అన్ని రంగాలనూ అతలాకుతలం చేసింది. తాజాగా ఒమైక్రాన్‌ రూపంలో మూడో దశలో అలజడి సృష్టిస్తోంది. జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. వారం రోజులుగా ప్రతిరోజు పాజిటివ్‌ కేసుల సంఖ్య వంద దాటుతోంది. తాజాగా సోమవారం 114 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు 20,28,973 నమూనాలు సేకరించగా.. కరోనా బాధితుల సంఖ్య 1,25,476కు చేరింది. వీరిలో చాలామంది కోలుకున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 1,659 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 51 మంది చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆరుగురు  డిశ్చార్జ్‌ అయ్యారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు నిబంధనలు పాటించకపోవడం వల్లే వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పండుగ పేరుతో కొంతమంది విచ్చలవిడిగా తిరిగేస్తున్నారని చెబుతున్నారు. నిర్లక్ష్యం వద్దని, తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. హోం ఐసోలేషన్‌ బాధితులకు వైద్యకిట్లు అందజేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 


ఒమైక్రాన్‌ : 63 

జిల్లాలో ఒమైక్రాన్‌ కేసులు 63కు చేరుకున్నాయి. విదేశాల నుంచి జిల్లాకు 2,330 మంది దఫదఫాలుగా వచ్చారు. ఇందులో ఏడుగురిలో మాత్రమే ఒమైక్రాన్‌ కేసులు గుర్తించారు. వీరికి చికిత్స ప్రారంభించారు. ఇటీవల జిల్లాలో కొందరి నమూనాలు సేకరించి.. హైదరాబాద్‌ జీనోమ్‌ సీక్వెన్సీకి పంపారు. ఇందులో ఏకంగా మరో 56 మందికి ఒమైక్రాన్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లాలో ఒమైక్రాన్‌ సాధారణ వ్యాప్తి తీవ్రమైనట్లు స్పష్టమైంది. ప్రతిఒక్కరు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించకపోతే.. కొద్దిరోజుల్లోనే పెనుముప్పును ఎదురయ్యే పరిస్థితి ఉంది. 


 కానరాని కంటైన్మెంట్‌ జోన్‌లు...

జిల్లాలో కంటైన్మెంట్‌ జోన్‌లు ఎక్కడా కానరావడం లేదు. గతంలో ఎక్కడైనా పాజిటివ్‌ కేసు నమోదైతే.. కంటైన్మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేసేవారు. పారిశుధ్య పనులు చేపట్టి.. అటు దిశగా రాకపోకలను నిషేధించేవారు. ప్రస్తుతం ఇవేవీ అమలుకావడం లేదు. పాఠశాలలు, థియేటర్లు, బస్సులు, ఆటోల్లో ఎక్కడా కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. చాలామంది మాస్క్‌లు లేకుండా తిరిగేస్తున్నారు.  శ్రీకాకుళం, రాజాం, పాలకొండ, టెక్కలి, పలాస, కాశీబుగ్గ, ఇచ్ఛాపురం వంటి నగరాల్లో వ్యాపార కూడళ్ల వద్ద నిత్యం జన సంచారం ఎక్కువగా ఉంటోంది. దీంతో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒమైక్రాన్‌ కేసులు విదేశీయుల నుంచే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని వైద్యులే చెబుతున్నారు.  గతంలో పైడిభీమవరం వద్ద ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి విదేశీయుల రాకపోకలపై నిఘా కొనసాగించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. విదేశీయలు స్వగ్రామాలకు వస్తే, వలంటీర్లు సమాచారం అందజేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని వలంటీర్లు, వైద్య ఉద్యోగులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలా అందరి నిర్లక్ష్యంతో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని.. వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.  

 .

  కిట్లు పంపిణీ చేస్తున్నాం:

జిల్లాలో హోం ఐసోలేషన్‌లో ఉన్న ప్రతి బాధితుడికి వైద్య కిట్లు పంపిణీ పూర్తి చేశాం. సాధారణ జ్వరంతో బాధపడుతున్న వారికి కూడా కిట్లు పంపిణీ చేస్తున్నాం. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటేనే ఆసుపత్రుల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారు. ఇంటి వద్ద కూడా స్థానిక వైద్య సిబ్బంది పర్యవేక్షించేలా అన్ని పీహెచ్‌సీల వైద్యులకు ఆదేశాలు జారీ చేశాం.

- శ్రీనివాసులు, జేసీ, శ్రీకాకుళం

Updated Date - 2022-01-18T05:39:42+05:30 IST