కొబ్బరికి పండుగ శోభ

ABN , First Publish Date - 2020-10-01T08:16:16+05:30 IST

గత కొన్ని నెలల నుంచి సంక్షోభంలో కొట్టుమిట్టాడిన కొబ్బరి మార్కెట్‌ ధరల పెరుగుదల

కొబ్బరికి పండుగ శోభ

 అనూహ్యంగా పెరిగిన పచ్చికొబ్బరికాయ ధర

  వెయ్యి కాయ రూ.12వేలు పైమాటే

 కరోనా తరువాత ఊపందుకున్న కొబ్బరి ఎగుమతులు

  ఆనందాన్ని వ్యక్తంచేస్తున్న రైతులు


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

గత కొన్ని నెలల నుంచి సంక్షోభంలో కొట్టుమిట్టాడిన కొబ్బరి మార్కెట్‌ ధరల పెరుగుదల రైతులకు ఊరట కలిగించింది. గత ఆరు నెలల నుంచి కరోనా కోరల్లో చిక్కుకున్న రైతులు కష్టాలు, నష్టాలను అధిగమిస్తున్నారు. ప్రస్తుతం ఇతర రాష్ర్టాలకు కొబ్బరి ఎగుమతులు ఊపందుకున్నాయి. మరోవైపు దసరా, దీపావళి, కార్తీకమాసం వంటి పర్వదినాలు రానుండడంతో కొబ్బరికాయల వినియోగం పెరగనున్న దృష్ట్యా ధరల పెరుగులలో మార్పు కనిపిస్తుంది. దీనికితోడు ప్రస్తుత సీజన్‌లో కొబ్బరి దిగుబడులు తగ్గడం, కొందరి రైతులు కొబ్బరిని నిల్వలు చేయడం వంటి కారణాల వల్ల వినియోగదారుల డిమాండు పెరగడం వల్లే ప్రస్తుతం ధరల పెరుగుదలకు కారణం అయింది.


పచ్చికొబ్బరికాయ (ముక్కుడుకాయ) ధర ప్రస్తుతం రూ.11,500 నుంచి రూ.12 వేల వరకు ధర పలుకుతోంది. గతంలో దీని ధర రూ.9,500 మాత్రమే ఉండేది. ప్రస్తుతం దిగుబడులు తగ్గడంతో ముక్కుడు కాయ ధరకు మంచి గిరాకీ ఏర్పడింది. ఉత్తరాది రాష్ర్టాలైన హర్యానా, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి అనేక రాష్ర్టాలకు కోనసీమ కేంద్రంగా ఎగుమతులు ఊపందుకున్నాయి.


గత ఆరు నెలల నుంచి కరోనా విజృంభణ కారణంగా ఇతర రాష్ర్టాలకు ఎగుమతులు పూర్తిగా నిలిచి పోయాయి. ఇప్పుడు క్రమంగా మార్కెట్లు తెరుచుకుండడంతో కొబ్బరికాయలు, సరుకు ఎగుమతులు అనూహ్యంగా పెరగడం వల్ల రైతులకు ఆనందాన్ని కలిగించింది. గతంలో ఉభయగోదావరి జిల్లాల నుంచి 150 లారీలు ఎగుమతులు కాగా ప్రస్తుతం 400 లారీలకు పైగా ఉభయగోదావరి జిల్లాల నుంచి ఎగుమ తులు అవుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది ఇదే సీజన్‌లో రూ.8,500 ఉన్న ధర ఇప్పుడు రూ.12వేల వరకు పెరగడంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. మరోవైపు కార్మికుల కొరత, ఇతర కారణాలతో కొత్తకొబ్బరి సరుకు తయారీ పూర్తిగా నిలిచిపోయింది.


పచ్చికొబ్బరి ధర తయారీ కొబ్బరి ధర కన్నా అధికంగా పెరగడంతో వ్యాపారులు సరుకు తయారీనికి పూర్తిగా నిలిపివేశారు. బాల్‌ కొబ్బరి ధర రూ.10,200 నుంచి రూ.11 వేల వరకు ఉంది. రెండో రకం రూ.10వేల పైనే పలుకుతోంది. ఈ క్రమంలో ప చ్చికొబ్బరి ధర రూ.12వేలు వరకు పలుకు తుండడంతోపాటు సరుకు తయారీకి కార్మికులు కొరత కూడా కారణమైంది. మొత్తం మీద ప్రస్తుతం రానున్న దసరా, దీపావళి, కార్తీకమాసం నేపథ్యంలో కొన్నినెలలపాటు కొబ్బరి ధరలు ఇదే రీతిన కొనసాగే అవకాశం ఉందని కొబ్బరి మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా అంబాజీపేటలో ప్రస్తుతం కొబ్బరి మార్కెట్‌ ధరలు. ఆయా గ్రేడ్‌లను బట్టి ఇలా ఉన్నాయి.


కొత్తకొబ్బరి (క్వింటాల్‌) ఒక్కింటికి రూ.10,500, కురిడీ కొబ్బరి(పాతవి) గండేరా(వెయ్యింటికి) రూ.14,000, గటగట(వెయ్యి) రూ.10,000, కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా(వెయ్యి) రూ.13,000, గటగట(వెయ్యి) రూ.9000, నీటికాయ పాత(ముక్కుడు)(వెయ్యి) రూ.11,500 కొత్త(పచ్చి) (వెయ్యింటికి) రూ.11,500 నుంచి రూ.12,000 ధర పలుకుతోంది. 


Updated Date - 2020-10-01T08:16:16+05:30 IST