Sep 26 2021 @ 01:43AM

వస్తున్నారోయ్‌... పండక్కి!

ప్రేక్షకులకు పండగ... కొత్త సినిమా విడుదలైతే! చిత్రసీమకు పండగ... థియేటర్లలో వసూళ్ల వర్షం కురిస్తే! మరి, వసూళ్ల వర్షానికి మంచివేళ... పండక్కి థియేటర్లలోకి చిత్రాలొస్తే! సెలవుల్లో సకుటుంబ సమేతంగా థియేటర్లకు ప్రేక్షకులొస్తారు కనుక! అందుకని, వీళ్లంతా పండక్కి వస్తున్నారు!


కరోనా రెండో దశ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలైన ఓ మాదిరి బడ్జెట్‌ చిత్రాలకు చెప్పుకోదగ్గ రీతిలో ప్రేక్షకులొచ్చారు. వసూళ్లు సైతం ఆశాజనకంగా ఉన్నాయి. అయితే... రెండు రోజుల క్రితం విడుదలైన ‘లవ్‌ స్టోరి’కి ప్రేక్షకులు పోటెత్తారు. జనసందోహంతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపించింది. దాంతో ఉత్సాహం వచ్చి  మరిన్ని చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. వడివడిగా థియేటర్ల వైపు అడుగులు వేస్తున్నాయి. రాబోయే రెండు నెలల్లో గాంధీ జయంతి, విజయదశమి, దీపావళి వంటి పండగలు ఉన్నాయి. పండక్కి అటు ఇటుగా చిత్రాలొస్తున్నాయ్‌! కొన్ని హిందీ, ఇంగ్లిష్‌ చిత్రాలూ పండక్కి వస్తుండటం విశేషం!!


గాంధీ జయంతికి...

అక్టోబర్‌ 2న గాంధీ జయంతి. సుమంత్‌ అశ్విన్‌, తాన్యా హోప్‌ జంటగా... శ్రీకాంత్‌, భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఇదే మా కథ’ను ఆ రోజు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రోడ్‌ జర్నీ నేపథ్యంలో అడ్వెంచరస్‌ మూవీగా తెరకెక్కిన చిత్రమిది. దీనికంటే ఒక్క రోజు ముందే ‘రిపబ్లిక్‌’ థియేటర్లలోకి రానుంది. హీరో సాయితేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో ఉండటంతో అతని మేనమామలు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ చిత్రానికి ప్రచారం చేస్తున్నారు. ‘స్కామ్‌ 1992’ ఫేమ్‌ ప్రతీక్‌ గాంధీ హీరోగా నటించిన హిందీ సినిమా ‘భవాయు’ కూడా అక్టోబర్‌ 1న థియేటర్లలో విడుదల కానుంది. ‘రావణ్‌ లీల’ టైటిల్‌పై ఓ వర్గం ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేయడం, దాంతో టైటిల్‌ను ‘భవాయి’గా మార్చడం వంటి వివాదాలతో సినిమా నలుగురి నోళ్లలో నానుతోంది.


విజయదశమికి...

దేవీ నవరాత్రులు సైతం అక్టోబర్‌లోనే! శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ దర్శకుడు అజయ్‌ భూపతి తెరకెక్కించిన ‘మహా సముద్రం’ ఈ పండగ మీద కర్ఛీఫ్‌ వేసింది. విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 14న విడుదల కానుంది. అయితే, అంతకు ముందే ‘ఉప్పెన’ హీరో పంజా వైష్ణవ్‌తేజ్‌, రకుల్‌ జంటగా క్రిష్‌ తెరకెక్కించిన ‘కొండపొలం’ వస్తోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 8న థియేటర్లలో విడుదల చేయనున్నారు. తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌ నటించిన ‘డాక్టర్‌’ 9న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి రానుంది. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు.


‘గ్యాంగ్‌ లీడర్‌’ భామ ప్రియాంకా అరుల్‌ మోహన్‌ ఇందులో కథానాయిక. అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ రూపొందించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ను అక్టోబర్‌ 8న విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అయితే... లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నిర్మించిన ‘వరుడు కావలెను’ చిత్రాన్ని  అక్టోబర్‌ 15న విడుదల చేయనున్నట్టు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. అదే రోజున తాప్సీ నటించిన హిందీ చిత్రం ‘రష్మీ రాకెట్‌’ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ‘పెళ్లి సందడి’, విశాల్‌ ‘ఎనిమి’ చిత్రాలూ విజయదశమికి రానున్నాయి.


దీపావళికి...

కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చి నుంచి విడుదలకు నోచుకోని హిందీ చిత్రం ‘సూర్యవంశీ’. అక్టోబర్‌ 22 నుంచి థియేటర్లు ఓపెన్‌ చేసుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో దీపావళికి సందడి చేయడానికి సిద్ధమైంది. దర్శకుడు రోహిత్‌శెట్టి ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే, విడుదల తేదీ ఎప్పుడనేది వెల్లడించలేదు. ఇంగ్లిష్‌ సహా భారతీయ భాషలు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో విడుదలవుతున్న మార్వెల్స్‌ హాలీవుడ్‌ చిత్రం ‘ఎటర్నల్స్‌’ నుంచి ‘సూర్యవంశీ’కి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి నటించిన ‘రొమాంటిక్‌’ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్‌ 4న విడుదల కానుంది. కన్నడ నటులు ఉపేంద్ర హీరోగా, సుదీప్‌ కీలక పాత్రలో నటించిన పాన్‌ ఇండియా సినిమా ‘కబ్జా’ను దీపావళి బరిలో విడుదల చేయాలనుకుంటున్నారు. మరికొన్ని చిన్న చిత్రాలు పండక్కి థియేటర్లలో సందడి చేయడానికి సిద్థమవుతున్నాయి.