పండుగ ఆదాయాన్ని ఎగరేసుకుపోయిన తెలంగాణ ఆర్టీసీ

ABN , First Publish Date - 2022-01-18T06:30:37+05:30 IST

సంక్రాంతి తిరుగు ప్రయాణాలు ఇంకా ఊపందుకోలేదు. సోమవారం పర్వాలేదనే స్థాయిలో ప్రయాణాలు జరిగాయి.

పండుగ ఆదాయాన్ని ఎగరేసుకుపోయిన   తెలంగాణ ఆర్టీసీ
రాజమహేంద్రవరం కాంప్లెక్స్‌లో హైదరాబాద్‌ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు

చార్జీలు తక్కువ కావడంతో ఆ రాష్ట్ర బస్సుల వైపు ప్రయాణికుల మొగ్గు

తిరుగు ప్రయాణాల్లో కనిపించని భారీ రద్దీ

జిల్లా నుంచి హైదరాబాద్‌కు 20 స్పెషల్‌ సర్వీసులు

రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 17: సంక్రాంతి తిరుగు ప్రయాణాలు ఇంకా ఊపందుకోలేదు. సోమవారం పర్వాలేదనే స్థాయిలో ప్రయాణాలు జరిగాయి. విశాఖపట్నం, విజయవాడ రూట్లతో పాటు లోకల్‌ ట్రాఫిక్‌ కొంతవరకు పెరిగినా జిల్లా నుంచి హైదరాబాద్‌ తిరిగి వెళ్లే ప్రయాణాల్లో అనుకున్నంత రద్దీ పెరగలేదు. తెలంగాణలో విద్యా సంస్థలకు 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించడం, మంగళవారం ఎదురుపెట్టుకుని ప్రయాణాల సెంటిమెంట్‌... తిరుగు ప్రయాణాల వాయిదాకు కారణంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు (టీఎస్‌ఆర్‌టీసీ) జిల్లా నుంచి హైదరాబాద్‌ వెళ్లే సాఽఽదారణ ప్రయాణికులను ఎగరేసుకుపోవడంతో ఏపీఎస్‌ ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి కొట్టినట్టయింది. జిల్లా నుంచి ఆది, సోమవారాల్లో టీఎస్‌ ఆర్టీసీ సుమారు 60 స్పెషల్‌ బస్సులు నడపడం గమనార్హం. వీటితో పాటు కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం డిపోల నుంచి 11 సాధారణ షెడ్యూల్‌ బస్సులను హైదరాబాద్‌కు నడుపుతున్నారు. హైదరాబాద్‌వెళ్లేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ స్పెషల్‌ బస్సుల రేట్లతో పోల్చితే తెలంగాణ బస్సులకు చార్జీ 50 శాతం తక్కువ కావడంతో చాలా మంది వాటినే ఆశ్రయిస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచిహైదరాబాద్‌కు ఏపీఎస్‌ ఆర్టీసీ స్పెషల్‌ బస్సుల చార్జీ రూ.900లకు పైగా ఉంటే తెలంగాణ బస్సుల్లో రూ.600 మాత్రమే ఉంది. దీంతో రాజమహేంద్రవరం నుంచి బయల్దేరే టీఎస్‌ ఆర్టీసీ నాలుగు బస్సులు ముందుగా ఫుల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.... శనివారం నుంచి హైదరాబాద్‌కు ఒక్కసారిగా టిక్కెట్స్‌ బుకింగ్స్‌ పడిపోయాయి. ఆదివారం జిల్లాలోని అన్ని డిపోల నుంచి 28 స్పెషల్‌ బస్సులు హైదరాబాద్‌కు నడపగా సోమవారం కేవలం 20 మాత్రమే వెళ్లాయి. నిజానికి ఆది, సోమ, మంగళవారాల్లో తిరుగు ప్రయాణాల రష్‌ భారీగా ఉంటుందనే అంచనాతో ఈ మూడు రోజుల్లో హైదరాబాద్‌కు పెద్దసంఖ్యలోనే బస్సులు తిప్పాలని జిల్లా అధికారులు రంగం సిద్ధం   చేశారు. ముందుగా 50 బస్సులు సిద్ధం చేసి ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ప్రారంభించారు.  ప్రయాణికుల డిమాండ్‌ ఉంటే మరిన్ని బస్సులు నడిపేలా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు పొడిగించడం, అక్కడి కరోనా కేసుల ఉధృతి వంటి కారణాలతో ఎక్కువ మంది తిరుగు ప్రయాణాలు వాయిదా వేసుకున్నట్టు స్పష్టమవుతోంది. నెలాఖరు వరకు విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీలు లేకపోవడంతో ఇంత హడావుడిగా ప్రయాణాలు ఎందుకనే కుటుంబ సభ్యుల మాటలతో తిరుగు  ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నట్టు సమాచారం. సోమవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఒక మోస్తరు రద్దీ ఉంది. బుధవారం నుంచి ప్రయాణాలు పెరుగుతాయని, రద్దీ మరింత పెరుగుతుందని భావిస్తున్నామని ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం ఎన్వీఆర్‌ వరప్రసాద్‌ తెలిపారు. గత రెండు రోజులతో పోల్చితే ట్రాఫిక్‌ ఫర్వాలేదని... తుని,  రాజమహేంద్రవరం-కాకినాడ, రాజమహేంద్రవరం-అమలాపురం ప్రధాన రూట్లలో లోకల్‌ ట్రాఫిక్‌ పెరిగిందని చెప్పారు.

తిరుగు ప్రయాణాలతో రద్దీ

భానుగుడి (కాకినాడ)/ కార్పొరేషన్‌, జనవరి 17: సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం రాత్రి నుంచే ఆర్టీసీ బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్ల వద్ద రద్దీ నెలకొంది. బస్సులు, రైళ్లు జనంతో కిటకిటలాడాయి. కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ప్రచారంతో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సుల్లో సాధారణ చార్జీలు వసూలు చేస్తుండగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ రూ.1,500 నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. బస్సులు దొరకని సమయంలో ప్రత్యేక వాహనాలకు కూడా గిరాకీ పెరిగింది.

జిల్లా మీదుగా మూడు ప్రత్యేక రైళ్లు 

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 17: సంక్రాంతి తిరుగు ప్రయాణికులతో రాజమహేంద్ర  వరం పెద్ద రైల్వే స్టేషన్‌లో రద్దీ నెలకొంది. విశాఖ, గోదావరి, గౌతమి తదితర రెగ్యులర్‌  ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పాటు సోమవారం మూడు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ అధికారులు  చర్యలు తీసుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు జిల్లా మీదుగా వెళ్లేలా చర్యలు  తీసుకున్నారు. కాకినాడ టౌన్‌-లింగంపల్లి, కాకినాడ-సికింద్రాబాద్‌, విశాఖపట్నం-సికింద్రాబాద్‌,   అనకాపల్లి-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే గౌతమి, గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఎప్పటి మాదిరిగానే రద్దీ కనిపించింది. 


Updated Date - 2022-01-18T06:30:37+05:30 IST