అన్నదాతపై.. అధనపు భారం

ABN , First Publish Date - 2022-08-03T05:46:41+05:30 IST

అన్నదాతల నెత్తిన మరో పిడుగు పడింది. పురుగుల మందుల రేట్లు సగటున 10 శాతం పెరగడంతో సాగు పెట్టుబడి ఖర్చులు పెరగనున్నాయి.

అన్నదాతపై.. అధనపు భారం

రైతులపై పురుగుమందుల పిడుగు

ధరల్లో సగటున 10 శాతం పెరుగుదల

ఉమ్మడి జిల్లా రైతులపై రూ.60 కోట్ల భారం

పెరగనున్న పెట్టుబడి వ్యయంపై రైతుల ఆందోళన

ఎరువుల ధరలతో ఇప్పటికే అల్లాడుతున్న అన్నదాతలు

ఇప్పుడు పురుగుమందుల వంతు కావడంతో తీవ్రఆవేదన


 రైతు అంటే భరించేవాడు.. సహించేవాడు. వ్యవసాయం అంటే వ్యయసాయంలా మారింది. పెరిగిన సాగు ఖర్చులు.. తగ్గిన దిగుబడులతో రెక్కల కష్టం మినహా మరేమీ మిగలడంలేదు. అయినా వ్యవసాయంపై ఆపేక్షతో వదల్లేక ప్రకృతిని ఎదిరించి.. వ్యాపారుల మోసాలను భరించి.. దళారుల దగాను సహించి.. అధికారుల ఆదరణ లేకపోయినా సాగు చేస్తూ వస్తున్నారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కూడా తమకు ఎందుకులే అన్న ధోరణిలో ఉందన్న విమర్శలు వస్తున్నా ఎవరికీ పట్టడంలేదు. ఈ పరిస్థితుల్లో ధరల భారం రైతులపై పడుతూనే ఉంది. ఇప్పటికే పెరిగిన పెట్రో, ఎరువుల ధరలతో అల్లాడుతుండగా తాజాగా పురుగు మందుల ధరలు పిడుగులా పడ్డాయి. సరిగ్గా ఆరునెలల క్రితం ఎరువుల  ధరలు  దాదాపు 40 శాతం పెరగ్గా ప్రస్తుతం పురుగు మందుల ధరలు సగటున 10 శాతం వరకు పెరగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని రైతులపై పురుగు మందుల అదనపు భారం రూ.60 కోట్లకుపైగా ఉంది. 


 బాపట్ల, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి):  అన్నదాతల నెత్తిన మరో పిడుగు పడింది. పురుగుల మందుల రేట్లు సగటున 10 శాతం పెరగడంతో  సాగు పెట్టుబడి ఖర్చులు పెరగనున్నాయి. పెరిగిన పురుగు మందుల ధరలు ప్రస్తుత ఖరీఫ్‌ నుంచి అమలు కానున్నాయి. దీంతో అన్నదాతలపై పెనుబారం పడుతోంది. పెట్రోలు, డీజిల్‌ వంటి వాటితో పాటు వ్యవపాయ ఉపకరణాల ధరలు సైతం పైపైకి ఎగబాకాయి. ఇప్పుడు ఆ వరుసలో పురుగుమందులు చేరాయి. దీంతో అన్నదాత బోరుమంటున్నాడు. అకాల వర్షాలు, అంతుచిక్కని తెగుళ్ల ధాటికి  అధికంగా పురుగుమందులను పిచికారి చేయాల్సి వస్తోంది. గతేడాది  గులాబీ పురుగు దెబ్బకి పత్తి దిగుబడులు సైతం తగ్గిపోయాయి.  వరికి పలు దఫాలుగా పురుగు మందుల్ని పిచికారి చేయాల్సి ఉంటుంది. వరికి సైతం క్రమం తప్పకుండా మందులను పిచికారి చేస్తేనే మంచి దిగుబడులు వస్తాయని రైతులు చెబుతున్నారు. చీడపీడల నుంచి పంటను కాపాడుకోవాలంటే పురుగుమందుల వాడకం తప్పనిసరి కావడంతో గతంతో పోలిస్తే వాటి వాడకం గణనీయంగా పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ఏటా పురుగుమందులపై రైతులు రూ.600 కోట్ల వరకు వ్యయం చేస్తారు. ఈ ప్రకారం పెరిగిన ధరల వల్ల అదనంగా మరో రూ.60 కోట్ల వరకు రైతులకు భారం కానుంది. గతంతో పోలిస్తే ప్రతి పురుగుమందుపై వంద నుంచి రూ.200 వరకు పెరిగాయి. పెరిగిన ధరలు మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా మారాయి. వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి పంటలకు చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. రైతులు పంటను కాపాడుకోవడానికి వారానికి రెండు సార్లు పురుగు మందులను పిచికారి చేస్తూనే ఉంటారు. పత్తికి మార్కెట్‌లో మంచి ధర ఉన్నప్పటికీ గతేడాది గులాబీ పురుగు వల్ల దిగుబడులు భారీగా తగ్గిపోయాయి. ఒకవైపు నకిలీ పురుగుమందులు, మరోవైపు ధరల బాదుడు ఇలా అన్ని వైపుల నుంచి అన్నదాతలకు ప్రతికూల పరిస్థితులే ఎదురవడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నాడు


ముడిపదార్థాల ధరలు పెరగడమే కారణం..

పురుగుమందుల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు జపాన్‌, చైనా తదితర దేశాల నుంచి అధిక శాతం దిగుమతి అవుతుంటాయి. అందువల్లనే దేశీయంగా పురుగుమందుల ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. దానికి తోడు పెరిగిన ఇందన ధరల వల్ల రవాణా ఖర్చులు పెరిగి ఆ ప్రభావం కూడా పరుగుమందుల ధరలపై పడుతోంది.  


ప్రేక్షకపాత్రలో ప్రభుత్వం..

గతంలో ఎరువుల ధరలు పెరిగినప్పటికీ కొన్నింటిపై కేంద్రం ఇచ్చే రాయితీని కూడా పెంచి పెరిగిన ధరల భారం కనపడకుండా కొంతమేర రైతులకు ఊరట కల్పించింది. కానీ రసాయన మందుల విషయంలో అలాంటి రాయితీలు ఏవీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొరవడడంతో రైతులకు పెట్టుబడి ఖర్చుల్లో భారీ తేడా రానుంది. ఎకరానికి దాదాపు రూ.2,500 వరకు పెట్టుబడి ఖర్చులు పెరగనున్నవి. అదే మిర్చికి అయితే రూ.3,500 వరకు అదనంగా వ్యయం కానుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-08-03T05:46:41+05:30 IST