నిల్వలు నిల్‌

ABN , First Publish Date - 2021-10-28T05:36:09+05:30 IST

ఖరీఫ్‌ సాగు చివరి దశకు చేరుకుంటోంది. డిసెంబరు నాటికి రబీ సాగుకు రైతులు సన్నద్ధం కానున్నారు.

నిల్వలు నిల్‌

రబీకి ఎరువులపై ఉదాసీనత 

నామమాత్రంగా బఫర్‌ స్టాక్‌.. అవసరం 2.50 లక్షల టన్నులు.. ఉన్నది 20 వేలు

ముందస్తు సరఫరాకు కంపెనీల  విముఖత

సమస్య తప్పదన్న భావనలో రైతులు


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

ఖరీఫ్‌ సాగు చివరి దశకు చేరుకుంటోంది. డిసెంబరు నాటికి రబీ సాగుకు రైతులు సన్నద్ధం కానున్నారు. రబీకి కాంప్లెక్స్‌ ఎరువులకు డిమాండ్‌ ఉంటుంది. అధికార యంత్రాంగం ఇప్పటి వరకు ఎరువులపై ప్రణాళిక సిద్ధం చేయలేదు. రబీ సీజన్‌లో దాదాపు 2.50 లక్షల టన్నుల ఎరువులు అవసరం కానున్నాయి. జిల్లాలో కేవలం 20 వేల టన్నులు మాత్రమే నిల్వ ఉంది. అందులో 10 వేల టన్నుల యూరియా మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో నిల్వ ఉంది. గోదాములన్నీ ఖాళీగా ఉన్నాయి. రబీ సీజన్‌ వస్తుందంటే ముందుగానే గోదాములు కిటకిటలాడేవి. ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాకు దిగుమతి అయ్యే ఎరువుల్లో 50 శాతం మార్క్‌ఫెడ్‌ ద్వారా సొసైటీలకు, రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. మిగిలిన 50 శాతం వ్యాపారులకు కేటాయిస్తారు. గతంలో రబీ సీజన్‌ వచ్చేసరికే జిల్లాలో దాదాపు లక్ష టన్నుల దాకా ఎరువులు నిల్వ ఉండేవి.  రైతులకు విక్రయించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం కంపెనీలకు రాయితీ ఇస్తోంది. దీంతో కంపెనీలు జిల్లాకు దిగుమతి చేయాలంటే విముఖత చూపుతున్నాయి. డిమాండ్‌ ఉన్న రోజుల్లోనే కంపెనీలు జిల్లాకు ఎరువులు కేటాయిస్తూ వస్తున్నాయి.రబీ సీజన్‌లో 80 శాతం ఎరువులు విని యోగం కానున్నాయి. వరి, మొక్కజొన్నకు అధికంగా రసాయన ఎరువులను వినియోగిస్తుంటారు. గతంలో నిల్వలు ఉండడంతో అటు అధికారులు, ఇటు వ్యాపారులు ధీమాగా ఉండేవారు. రైతులు తమకు అవసరమైనప్పుడు కొనుగోలు చేసుకునేవారు.ప్రస్తుత రబీ సీజన్‌లో ఎరువులకు సమస్య ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఇబ్బందులు పడక తప్పదన్న భావనలో వ్యాపారులు ఉన్నారు. పోర్టుల్లో నిల్వ ఉన్న ఎరువులను దిగుమతి చేసుకుని నిల్వ ఉంచాలన్న ధ్యాస కూడా యంత్రాంగంలో కొరవడింది.


 2,500 టన్నుల యూరియా

నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ తొలిసారిగా జిల్లాకు యూరియా దిగుమతి చేసింది. గతంలో మూతపడిన ఫెర్టిలైజర్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను పునరుద్ధరించి గ్యాస్‌ ఆధారంగా యూరియా ఉత్పత్తి చేసే బాధ్యతను కేంద్రం నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌కు అప్పగించింది. ఈ ఏడాది యూరియా తయారీ ప్రారంభించిన ఆ కంపెనీ తొలిసారిగా 2,500 టన్నుల యూరియాను జిల్లాకు దిగు మతి చేసినట్టు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎరువుల హోల్‌ సేల్‌ డీలర్స్‌ సంఘం అధ్యక్షుడు ఈతకోట తాతాజీ తెలిపారు. 

Updated Date - 2021-10-28T05:36:09+05:30 IST