షాపింగ్‌ సందడి

ABN , First Publish Date - 2022-10-01T03:19:43+05:30 IST

సద్దుల బతుకమ్మ, దసరా పండుగలు సమీపిస్తుండడంతో మార్కెట్‌లో సందడి నెలకొంది. ఇంట్లో అందరూ నూతన దుస్తులు కొనేందుకు షాపింగ్‌ కాంప్లెక్స్‌కు వస్తున్నారు. జిల్లా కేంద్రానికే కొనుగోలుదారులు వస్తుండడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. రెడిమేడ్‌, వస్త్ర దుకాణాలతోపాటు కిడ్స్‌ షాపింగ్‌ మాల్స్‌ బిజీగా మారాయి. కొనుగోలుదారులతో షాపులు కిటకిటలాడుతున్నాయి.

షాపింగ్‌ సందడి
దుస్తులు కొనేందుకు బారులుతీరిన మహిళలు

కొనుగోళ్లతో షాపింగ్‌ మాల్స్‌ బిజీ 

కిటకిటలాడుతున్న రెడిమేడ్‌, వస్త్ర దుకాణాలు  

ఆఫర్లతో ఆకట్టుకుంటున్న వ్యాపారులు

దసరా నేపథ్యంలో మేకలకు ఫుల్‌ డిమాండ్‌  

మంచిర్యాల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సద్దుల బతుకమ్మ, దసరా పండుగలు సమీపిస్తుండడంతో మార్కెట్‌లో సందడి నెలకొంది. ఇంట్లో అందరూ నూతన దుస్తులు కొనేందుకు షాపింగ్‌ కాంప్లెక్స్‌కు వస్తున్నారు.   జిల్లా కేంద్రానికే కొనుగోలుదారులు వస్తుండడంతో  విపరీతమైన రద్దీ నెలకొంది. రెడిమేడ్‌, వస్త్ర దుకాణాలతోపాటు కిడ్స్‌ షాపింగ్‌ మాల్స్‌ బిజీగా మారాయి. కొనుగోలుదారులతో షాపులు కిటకిటలాడుతున్నాయి. వ్యాపారులు నయా మాల్‌తో కస్టమర్లను ఆకట్టు కుంటున్నారు. పండగ కోసం ప్రత్యేకంగా వస్త్ర సముదాయాలు ఏర్పాటు కావడం గమనార్హం. ఒక్కో షాపునకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో రెండు మూడు బ్రాంచిలు ఓపెన్‌ చేస్తూ  ప్రజలను ఆకట్టుకుంటున్నారు. అలాగే బతుకమ్మ పండుగకు రెండు రోజుల వ్యవధి ఉండడంతో కంగన్‌హాల్‌, టైలరింగ్‌, మ్యాచింగ్‌ సెంటర్లలోనూ రద్దీ నెలకొంది. 

ఆఫర్లతో ఆకర్షణ....

దసరా పండుగకు వీలైనంత ఎక్కువ గిరాకీ చేయాలనే ఉద్దేశంతో  రెడిమేడ్‌, వస్త్ర వ్యాపారులు ఆఫర్లు పెడుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ రకాల హోం నీడ్స్‌ షాపుల్లోనూ భారీ డిస్కౌంట్‌లతో ఆఫర్లు ప్రకటిస్తున్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ల ముందు బంపర్‌ ఆఫర్లతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒకటి కొంటే మరొ కటి ఫ్రీ, 30 నుంచి  40 శాతం డిస్కౌంట్‌ సేల్‌ అని బోర్డులు ఏర్పాటు చేశారు. ఆఫర్లు ప్రకటించడంతో ఉదయం  11 గంటల నుంచే షాపులన్ని జనంతో కిటకిటలాడుతున్నాయి. రాత్రి 10 గంటల దాకా కొనుగోళ్లు చేస్తున్నారు. 

లాభాల వాటాతో మరింత ఎఫెక్ట్‌...

దసరా పండుగను పురస్కరించుకొని సింగరేణి యాజమాన్యం కార్మికు లకు లాభాల వాటాను ప్రకటించడంతో కార్మిక కుటుంబాలు పెద్ద ఎత్తున షాపింగ్‌ చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి.  సంస్థ లాభాల్లో 30 శాతం కార్మిక వాటాను చెల్లిస్తుండగా అక్టోబర్‌ 1న వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుంది. కనీసం రూ.60 వేలు మొదలుకొని లక్ష దాకా ఒక్కో కార్మికునికి వస్తుండడంతో పెద్ద మొత్తంలో దుస్తులు, గృహోప కరణలు కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. వ్యాపార సంస్థలు కూడా భారీ ఆఫర్లతో కార్మిక కుటుంబాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు మొదలుకొని కార్లు, ఫ్రిడ్జ్‌లు, టీవీలు, తదితర గృహోపకరణలకు విపరీతమైన డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది.  

మేకలకు విపరీతమైన డిమాండ్‌...

దసరా నేపథ్యంలో మేకలకు విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్డుతోపాటు హాజీపూర్‌ మండలం వేంపల్లిలో మేకల మండీలు అందుబాటులో ఉండడంతో ప్రజలు, సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున మేకలను కొనుగోలు చేస్తున్నారు. ముందస్తుగా కొనుగోలు చేసి ఇంటి వద్ద వాటిని మేపుకుంటున్నారు. దీంతో మేకల మార్కెట్లలో  డిమాండ్‌ నెలకొంది. రూ. 5 వేలు మొదలుకొని రూ.  15 వేల మధ్యలో మేకల ధరలు పలుకుతున్నాయి. దసరాను పురస్కరించుకొని ఎక్కడ పడితే అక్కడ కొత్తగా మేకల  విక్రయ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. తాండూర్‌ ఐబీ, పెద్దపల్లి జిల్లా రాజారాంపల్లి వంటి దూర ప్రాంతాలకు వెళ్లి సైతం మేకలను కొనుగోలు చేస్తున్నారు. 

మద్యం దుకాణాలు కిటకిట....

నెలలో చివరి దినం కావడంతో నిర్ణీత లక్ష్యాలను చేరుకునేందుకు వైన్‌ షాపుల యజమానులపై ఆబ్కారీ శాఖ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. మద్యం అమ్మకాలు పెంచేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. దీంతో పాటు దసరా నేపథ్యంలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉందనే ప్రచారంతో ఇప్పటి నుంచే మందుబాబులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. దసరా సందర్భంగా మద్యం ధరలు 10 నుంచి  30 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నట్లు సోషల్‌ మీడియాలో  వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో ధరలు అందుబాటులో ఉన్నప్పుడే కొనుగోలు చేయాలని వైన్‌ షాపుల వెంట బారులు తీరుతున్నారు.  మందుబాబుల రద్దీకి అనుగు ణంగా ఆబ్కారీ అధికారులు సైతం వైన్‌షాపుల్లో సరిపడా స్టాకును అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తగా  73  వైన్‌ షాపుల్లో అమ్మకాలు జోరందుకున్నాయి. దసరాకు మరో నాలుగు రోజుల వ్యవధి ఉన్నప్పటికి ఇప్పటి నుంచే మద్యం కొనుగోళ్లకు ఎగబడుతుం డడంతో  వైన్‌ షాపుల వద్ద రద్దీ నెలకొంటుంది. మొత్తంగా దసరా సీజన్‌ వ్యాపారులకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. జిల్లా కేంద్రంతో పాటు ముఖ్య పట్టణాలైన బెల్లంపల్లి, లక్షెట్టిపేట, శ్రీరాంపూర్‌ ఏరియాలలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి.  

Updated Date - 2022-10-01T03:19:43+05:30 IST