ఎరువు.. కరువు..!

ABN , First Publish Date - 2022-08-06T06:15:36+05:30 IST

ఎరువు.. కరువు..!

ఎరువు.. కరువు..!

జిల్లా వ్యాప్తంగా ప్రశ్నార్థకంగా సాగు

రైతు భరోసా కేంద్రాల్లో డీఏపీ ఎరువుల కొరత


రైతుల కోసం ఆర్భాటంగా ప్రారంభించిన ఆర్బీకేలు ఆశించిన లక్ష్యాలకు దూరంగా ఉంటున్నాయి. దీంతో జిల్లాను ఎరువుల కొరత పట్టి పీడిస్తోంది.  ఆర్డర్‌ ఇచ్చిన మర్నాడే ఇస్తామన్న ప్రభుత్వ వాగ్దానాలు నెరవేరకపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారింది. దుక్కి దున్ని నాట్లు వేసే సమయంలోనూ డీఏపీ అందక, ప్రైవేట్‌ ఎరువుల దుకాణాలు అధిక ధరలకు కొనలేక అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. 


మచిలీపట్నం టౌన్‌ : జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉండట్లేదు. దీంతో ప్రైవేట్‌ ఎరువుల షాపుల్లో రైతులు అధిక ధరలకు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్బీకేల్లో డీఏపీతో పాటు 1435, 2020 రకం ఎరువులు ఆశించిన విధంగా అందుబాటులో లేవు. దుక్కి దున్నుతున్న ఈ సమయంలో డీఏపీ తప్పనిసరి. కనీసం నాట్లు పడిన వారంలోనైనా డీఏపీ వేయని పక్షంలో ఆశించిన ప్రయోజనం ఉండదు. బందరు మండలంలోని ఆర్బీకేల్లో డీఏపీ దొరక్క రైతులు ప్రైవేట్‌ షాపులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో యూరియాతో పాటు డీఏపీ కూడా వాడుతున్నారు. కొందరేమో డీఏపీ దొరక్క వెదజల్లే పద్ధతిని అవలంబిస్తున్నారు. 

జిల్లాలోని 390 ఆర్బీకేల్లో ఇదే పరిస్థితి

జిల్లాలోని 390 ఆర్బీకేలు ఉన్నాయి. దాదాపు 50 శాతం వాటిలో రైతులు ఇండెంట్లు ఇచ్చిన వారం వరకూ ఎరువులు అందట్లేదు. ఎరువులు పుష్కలంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నా ఆర్బీకేలకు అనుసంధానంగా దగ్గర్లో గిడ్డంగులు లేకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యలను టీడీపీ నాయకులు అధికారుల వద్దకు తీసుకెళ్లినా ఫలితం శూన్యం.

మూడు దశల్లోనూ..

దుక్కి దున్నే సమయంలో డీఏపీ, యూరియా ఎరువులు వేస్తారు. ఈ ఏడాది సాగునీరు ముందుగా వచ్చినందున దుక్కి దున్నే సమయంలో రైతులకు ఆర్బీకేల్లో ఎరువులు దొరకలేదు. రెండో దశ పిలకలు తొడిగే సమయంలోనైనా అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు చిరుపొట్ట దశకొచ్చినా అతీగతీ లేదు. 

జిల్లాలో నాట్లు పడింది 60 శాతమే..

జిల్లాలో 1,82,861 ఎకరాల్లో ఇప్పటికి 1,10,576 ఎకరాల్లోనే అంటే.. 60 శాతం పంటలే నమోదయ్యాయి. వీటిల్లో వరి 1,71,076 ఎకరాల్లో వేశారు. గత ఏడాదితో పోలిస్తే వరి పంట ఆగస్టు మొదటి వారానికి అధికంగా 63 శాతం నమోదైంది. మొక్కజొన్న 200 ఎకరాలకు 31 ఎకరాల్లో నాటారు. వేరుశెనగ 800 ఎకరాలకు 340 ఎకరాలు, పత్తి 400 ఎకరాల లక్ష్యానికి 130 ఎకరాలు, చెరుకు 7,456 ఎకరాలకు 1,733 ఎకరాల్లో నమోదైంది. పసుపును 2,155 ఎకరాలకు 763 ఎకరాల్లో మాత్రమే నాటారు. ఈ పంటలన్నింటికీ ఎరువులు కావాల్సి ఉంది. మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో కొంత మేరకు ఎరువులు అందించారు. ఆర్బీకేల్లో మాత్రం ఆశించినంతగా లేవు. 

జిల్లా సమీక్షా సమావేశాల్లోనూ నిలదీత

జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖను సమీక్షిస్తున్నప్పుడు ప్రతిపక్షాల కంటే అధికార పార్టీలో ఉన్న శాసనసభ్యులు కేపీ సారథి, పేర్ని నానీలు ఆర్బీకేల్లో ఎరువుల కొరతపై వ్యవసాయ శాఖాధికారులను నిలదీశారు. ఎరువులు పుష్కలంగా ఉన్నప్పటికీ సరఫరా చేయలేకపోతున్నారని మండిపడ్డారు.

ప్రైవేట్‌ షాపుల్లో కట్టకు రూ.100పైనే అధికం

ఆర్బీకేల్లో డీఏపీ రూ.1,350కే లభించాల్సి ఉండగా, ప్రైవేట్‌ మార్కెట్‌లో రూ.1,500కు అమ్ముతున్నారు. డీఏపీ 3,997 టన్నులు, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ (ఎంవోపీ) 2,162 టన్నులు, ఎస్‌ఎస్‌పీ 2,545 టన్నులు అందుబాటులో ఉన్నట్టు జిల్లా వ్యవసాయ శాఖాధికారి టి.మోహనరావు చెబుతున్నప్పటికీ ఆర్బీకేల్లో ఇండెంట్‌ ఇచ్చిన వెంటనే రైతులకు అందుబాటులో ఉండట్లేదు. 


ఆలస్యంగా ఎరువుల సరఫరా 

ఆర్బీకేల్లో రైతులు ఇండెంట్‌ ఇచ్చిన వారానికి కూడా ఎరువులు అందట్లేదు. బందరు మండలంలో డీఏపీ సరఫరా లేదు. దీంతో రైతులు ప్రైవేట్‌ మార్కెట్‌లో అధిక ధరలకు కొంటున్నారు. ఆర్బీకేల ద్వారా కాంప్లెక్స్‌ ఎరువులు సకాలంలో పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు నెరవేరలేదు. ఈ ఖరీఫ్‌లో మార్క్‌ఫెడ్‌ డీఏపీ, కాంప్లెక్స్‌, ఎంవోపీ, ఎస్‌ఎస్‌పీ ఎరువుల అమ్మకాలపై ఆశించిన విధంగా దృష్టి పెట్టలేదు. కేవలం యూరియా అమ్మకాలనే చూసుకుంది. దీంతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులు ఆశించినంతగా ఉండట్లేదు. వరినాట్లు వేసిన రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలి.

- గోపు సత్యనారాయణ, టీడీపీ తెలుగు రైతు అధ్యక్షుడు


ఎరువులు పుష్కలంగానే ఉన్నాయి 

ఎరువులు పుష్కలంగానే ఉన్నాయి. అయితే, ఆర్బీకేలకు అనుబంధంగా గిడ్డంగులు లేకపోవడం వల్ల రైతులు ఇండెంట్‌ పెట్టిన వెంటనే సరఫరా కావడం లేదు. యూరియా 18,689 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంది. డీఏపీ 4,116 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 9,947 మెట్రిక్‌ టన్నులు ఉన్నాయి. జిల్లాలో 39,064 టన్నులు రైతులకు అవసరమై ఉండగా, అంతకుమించి అందుబాటులో ఉంచాం. హోల్‌సేల్‌ డీలర్లకు యూరియా 4,552 టన్నులు, రిటైల్‌ డీలర్లకు 5,632 టన్నులు, ఆర్బీకేలకు 604 టన్నులు, మార్క్‌ఫెడ్‌కు 604 టన్నులు కేటాయించాం. అలాగే, డీఏపీని ఆర్బీకేలకు 127 టన్నులు, హోల్‌సేల్‌ డీలర్లకు 1,752 టన్నులు, రిటైల్‌ డీలర్లకు 4,658 టన్నులు కేటాయించాం. ఇలా జిల్లాలో 6,535 టన్నుల డీఏపీ అందుబాటులో ఉంచుతున్నాం. కాంప్లెక్స్‌ ఎరువులు హోల్‌సేల్‌ డీలర్ల వద్ద 3,443, రిటైల్‌ డీలర్ల వద్ద 10,433, ఆర్బీకేల వద్ద 1,607 టన్నులు సిద్ధం చేశాం. 

- మనోహరరావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి 

Updated Date - 2022-08-06T06:15:36+05:30 IST