ఆర్‌బీకేల్లో ఎరువులు, విత్తనాలు

ABN , First Publish Date - 2022-05-15T06:21:20+05:30 IST

ఎన్‌టీఆర్‌ జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నట్టు జిల్లా వ్యవసాయాధికారిణి ఎం. విజయభారతి అన్నారు.

ఆర్‌బీకేల్లో ఎరువులు, విత్తనాలు

 జిల్లా వ్యవసాయాధికారిణి విజయభారతి

కంచికచర్ల : ఎన్‌టీఆర్‌ జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నట్టు జిల్లా వ్యవసాయాధికారిణి ఎం. విజయభారతి  అన్నారు. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఖరీఫ్‌ సీజన్‌ ప్రణాళిక - అమలుకు తీసుకుంటున్న చర్యలను ఆంధ్రజ్యోతికి వివరించారు. జిల్లాలో ఈ ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 1.21 లక్షల హెక్టార్లు. ఇందులో వరి 50 వేల హెక్టార్లు, పత్తి 44 వేలు,  మిర్చి 11,600, మొక్కజొన్న 35 వందలు, పెసర, మినుము 36 వందల హెక్టార్లు, కొద్ది విస్తీర్ణంలో పసుపు, చెరుకు, కంది పంటలు సాగవుతాయి. ఖరీఫ్‌ సీజన్‌కు మొత్తం 88వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయి.  కనీసం 24 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ నెల 15 నాటికి ప్రతి ఆర్‌బీకేలో కూడా పది టన్నుల ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఏపీ సీడ్స్‌ ద్వారా ఆర్‌బీకేలకు పచ్చిరొట్ట విత్తనాలను తెప్పిస్తున్నాం. 45 వందల క్వింటాళ్లు జీలుగ, 27 వందల క్వింటాళ్లు పిల్లిపెసర, 113 క్వింటాళ్లు జనుము విత్తనాలను 50 శాతం రాయితీపై  రైతులకు అందజేస్తామన్నారు. కిలో జీలుగ రూ.31.95, పిల్లిపెసర రూ.43.87 , జనుము రూ.43, ఎకరానికి పిల్లిపెసర ఎనిమిది కిలోలు, జీలుగు పది కిలోల చొప్పున ఒక్కొక్క రైతుకు గరిష్టంగా ఐదు ఎకరాలకు అందజేస్తామన్నారు.  పచ్చిరొట్ట విత్తనాలు కావల్సిన  రైతులు ఆర్‌బీకేలకు వెళ్లి బయోమెట్రిక్‌ వేయాలి. ఏపీ సీడ్స్‌ ద్వారా వరి వంగడాలు (విత్తనాలు) 45 వందల క్వింటాళ్లు తెప్పిస్తునట్టు విజయభారతి తెలిపారు. జాతీయ ఆహర భద్రతా మిషన్‌ కింద కిలోకు ఐదు రూపాయలు రాయితీ ఇస్తున్నట్టు తెలిపారు. ఎకరానికి 30 కిలోల వంతున, ఒక్కొ రైతుకు గరిష్టంగా ఐదు ఎకరాల వరకు అందచేస్తాం. వచ్చే నెల మొదటి వారం కల్లా వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయి. 3.10 లక్షల బీటీ-2 పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరమవుతాయని, అందుకోసం ఇండెంట్‌ పెట్టినట్టు తెలిపారు. హెక్టారుకు సగటున ఏడు ఫ్యాకెట్లు కావాలి. ఈ సీజన్‌కు 450 గ్రాముల ఫ్యాకెట్‌కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర 810 రూపాయలు. బీటీ-3 విత్తనాలను ప్రభుత్వం నిషేధించింది. ఒకవేళ ఆ విత్తనాలను విక్రయిస్తే వ్యాపారులు,  డీలర్లపై చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారి తెలిపారు. మిర్చికి సంబంధించి 29 వందల కిలోలు అవసరమన్నారు. రెవెన్యూ అధికారులతో కల్సి ఈ వారం నుంచే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నట్టు తెలిపారు.  ప్రతి మండలానికి ఆరు ట్రాక్టర్లు  చొప్పున జిల్లాలో 106 వాహనాలు అందజేయాలన్నది లక్ష్యమన్నారు. దీనిపై 40 శాతం రాయితీ, పది శాతం లబ్ధిదారుని వాటా, మిగతా 50 శాతం డీసీసీ బ్యాంకు రుణంగా ఇస్తుందని విజయభారతి తెలిపారు. వచ్చే నెలలో రైతులకు సీఎం జగన్‌ ట్రాక్టర్లు అందచేస్తారని జిల్లా వ్యవసాయాధికారిణి  తెలిపారు. 

Updated Date - 2022-05-15T06:21:20+05:30 IST