Abn logo
Jun 21 2021 @ 23:41PM

ఎరువు భారం తగ్గింది

కేంద్రం రాయితీతో రైతులకు ఊరట

పాత ధరలతోనే అమ్మకానికి సిద్ధం

వ్యాపారులకు కొత్త ఎమ్మార్పీలతో సరఫరా

అందుబాటులో కొద్దిపాటి ఎరువులు

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

అన్నదాతకు పెనుభారమే తప్పింది. గుట్టుచప్పుడు కాకుండా పెంచిన ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటి వరకు లభ్యమైన పాతధరలకే ఎరువులు అందుబాటులోకి రానున్నాయి. గత ఏప్రిల్‌లో కంపెనీలు పెంచిన ధరల ప్రకారం డీఏపీ బస్తా రూ.1900లకు చేరింది. ఇతర కాంప్లెక్స్‌ ధరలు అదేతరహాలో పెంచేశారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. రైతులకు అవసరం లేకపోవడంతో కొనుగోలు చేయకపోవడంతో పెంపు ప్రభావం తక్షణం రైతులపై పడలేదు. పెంచిన ధరలతోనే ఖరీఫ్‌లో అమ్మకాలు సాగించాలని కంపెనీలు భావించాయి. దీంతో ఒక్క పశ్చిమలోనే దాదాపు రూ.150 కోట్లు అదనపు భారం పడుతుంది. ధరల పెంపు నేపథ్యంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుం డటంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రాయితీ విఽధా నాన్ని అమలులోకి తెచ్చింది. రూ.18 వేల కోట్లు రాయితీ జమ చేసినట్టు సమాచారం. ఫలితంగా ఏప్రిల్‌లో పెరిగిన ధరలు మళ్లీ దిగొచ్చాయి. తాజాగా తగ్గిన ఎంఆర్పీ ధరలతో కంపెనీలు ముందుకొచ్చాయి. కొత్త ధరల ప్రకారం డీఏపీ రూ.1200కు లభ్యం కానుంది. ఇతర కాంప్లెక్స్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే పొటాష్‌ ఎరువును కంపెనీలు పెంచాయి. గతంలో బస్తా పొటాష్‌ రూ.875 ఉండేది. ఇప్పుడది రూ.వెయ్యికి చేరింది.   


ఖరీఫ్‌కు ఎరువులు సిద్ధమేనా ?

ఖరీఫ్‌కు సంబంధించి ఎరువులు గతంలో పుష్కలంగా అందుబాటులో ఉండేవి. ఈ ఏడాది ధరల పెంపు నిర్ణయంతో కంపెనీలు ముందూ వెనుకా ఆలోచించాయి. వినియోగం తగ్గుతుందని భావించాయి. దీంతో ఇతర దేశాల నుంచి దిగుమతులు చేయలేదు. దేశీయంగానూ ఉత్పత్తి నిలిపి వేశారు. జిల్లాలో డిమాండ్‌వున్న 28–28–0 కాంప్లెక్స్‌ ఎరువుల ఉత్పత్తి ఆగిపోయింది. ఫలితంగా వేసవిలో జిల్లాకు దిగుమ తులు పూర్తిగా మందగించాయి, వ్యాపారులు వెనుకంజ వేశారు. ప్రస్తుతం జిల్లాలో కొద్దిపాటి ఎరువులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాంప్లెక్స్‌, యూరియా, పొటాష్‌ కలిపి 15 వేల టన్నులు ఉంటాయి. వాస్తవానికి ఖరీఫ్‌లో 2.20 లక్షల టన్నుల ఎరువుల వినియోగం ఉంటుంది. డెల్టాలో ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువుల వినియోగం తక్కువ. రబీలో అధికంగా ఉపయోగిస్తారు. మెట్టలో ఖరీఫ్‌లో అధికంగా ఎరువులు వినియోగిస్తారు. ఉద్యాన పంటలతో పాటు, పొగాకు, మొక్కజొన్న, వరి పంటలకు మెట్టలో ఎరువు వాడకం అధికం. ఇప్పటి వరకు ఎరువులు జిల్లాకు దిగుమతి కాలేదు. జూన్‌ నుంచే కేటాయింపులు ప్రారంభం కావాలి. ధరల పెరుగుదలలో 30 శాతం వినియోగం తగ్గుతుందని కంపెనీలు అంచనా వేశాయి. ఫలితంగా ఉత్పత్తులకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో సరఫరా తగ్గింది. లేదంటే వేసవిలోనే ఇబ్బడి ముబ్బడిగా జిల్లాకు డంప్‌ చేసేవి. బఫర్‌ స్టాక్‌గా ఇక్కడ నిల్వ ఉంచుకునేవి. కొన్నేళ్లుగా ఎరువుల సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కంపెనీలు, వ్యాపా రులు, వ్యవసాయ శాఖలన్నీ సర్వసన్నద్ధంగా ఉండేవి. ఈసారి భారీగా ఎరువుల ధరలు పెరగడంతో వ్యాపారులు ముందస్తు బుకింగ్‌లకు సాహసించలేదు. కంపెనీలు ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. కేంద్రం రంగంలోకి దిగి ఎరువుల ధరలు తగ్గించడంతో అంతా ఊపిరి పీల్చు కున్నారు. ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా కేటాయింపులు నిర్వహిస్తేనే రైతులకు సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంటాయి. ఎప్పటి లాగే తక్కువ ధరలకు ఎరువులు లభ్యం కానున్నాయి. 


      ధరలో మార్పులు ఇలా..

     ఏప్రిల్‌–2021లో      జూన్‌–2021 

డీఏపీ   రూ.1,900    రూ.1,200 

10–26–26     రూ.1,775     రూ.1,375   

20–20–0–13   రూ.1,350     రూ.1,050 

15–15–15      రూ.1,500     రూ.1,100 

28–28–0       రూ.1,700     రూ.1,475 

పొటాష్‌    రూ.875     రూ.1,000


రైతులకు మేలు : ఈతకోట తాతాజీ, ఎరువుల హోల్‌సేల్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు

కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎరువుల ధర  బస్తా రూ.2 వేలకు చేరేది. రైతుపై చెప్పలేనంత భారం పడేది. ఏప్రిల్‌లో కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. కేంద్రం స్పందించకపోతే మరింత పెరిగేవి. ఇప్పటికే సకాలంలో రైతుల నుంచి బకాయిలు రాకపో వడంతో ఎరువుల వ్యాపారం ఒడిదుడు కు లను ఎదుర్కొంటోంది. ఇప్పుడు కేంద్ర నిర్ణయం రైతులకు మేలు చేసిందనే చెప్పాలి.