రైతులు కోరిన ఎరువులు సరఫరా

ABN , First Publish Date - 2022-08-18T06:31:13+05:30 IST

రైతులు కోరిన కంపెనీ ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకోవాలని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అద్దంకి శ్రీధర్‌బాబు బోర్డు అధికారులను ఆదేశించారు.

రైతులు కోరిన ఎరువులు సరఫరా
అధికారులు, రైతు కమిటీ ప్రతినిధులతో మాట్లాడుతున్న ఈడీ శ్రీధర్‌బాబు

అధికారులకు పొగాకు బోర్డు ఈడీ శ్రీధర్‌బాబు ఆదేశం

ఒంగోలు, ఆగస్టు 17  (ఆంధ్రజ్యోతి): రైతులు కోరిన కంపెనీ ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకోవాలని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అద్దంకి శ్రీధర్‌బాబు బోర్డు అధికారులను ఆదేశించారు. దక్షిణాదిలోని కందుకూరు, వెల్లంపల్లి వేలంకేంద్రాల్లో పలు కార్యక్రమాల్లో బుధవారం పాల్గొన్న ఆయన ఒంగోలులోని బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు, రైతుప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు-1, ఒంగోలు-2 కేంద్రాల రైతు కమిటీ ప్రతినిధులు ఆళ్ల సుబ్బారావు, వడ్డెళ్ల ప్రసాద్‌లు రైతులు కోరిన ఎరువులు, విత్తనాలనే సరఫరా చేయాలని కోరారు. ప్రధానంగా కోరమండల్‌ కంపెనీకి చెందిన డీఏపీ, ఐపీఎల్‌ కంపెనీకి చెందిన పొటాష్‌ ఇవ్వాలన్నారు. అలాగే గతేడాది దిగుబడి బాగా ఉన్న ఎఫ్‌సీఆర్‌-15 రకం విత్తనాలు ఈ ఏడాది అందుబాటులో లేవని వాటిని ఇవ్వాలని కోరారు. వెంటనే స్పందించిన ఈడీ రైతులు కోరిన విధంగా ఎరువులను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని బోర్డు అధికారులను ఆదేశించారు. ఎఫ్‌సీఆర్‌-15 రకం విత్తనాలు పరిమితంగానే ఉన్నాయన్న ఆయన వచ్చేఏడాదికి కోరిన మేర విత్తన సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో బోర్డు ఇన్‌చార్జి సెక్రటరీ దివి వేణుగోపాల్‌, బోర్డు డైరెక్టర్లు పొద వరప్రసాద్‌, మారెడ్డి సుబ్బారెడ్డి, ఆర్‌ఎంలు దామోదరం, ఎం.లక్ష్మణరావు, వై.ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-08-18T06:31:13+05:30 IST