‘సహకారం’లో స్వాహాపర్వం

ABN , First Publish Date - 2020-10-24T10:41:00+05:30 IST

నేలకొండపల్లి మండల పరిధిలోని రాజారాంపేట సహకార సంఘంలో భారీ ఎరువుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.18 లక్షల ఎరువులకు లెక్క తేలటం లేదు.

‘సహకారం’లో స్వాహాపర్వం

రాజారాంపేట సొసైటీలో ఎరువుల కుంభకోణం

లెక్కల్లో చూపకుండా రూ.18 లక్షలు మాయం 

అధికార, అనధికార  రికార్డుల నిర్వహణ


నేలకొండపల్లి, అక్టోబరు 23: నేలకొండపల్లి మండల పరిధిలోని రాజారాంపేట సహకార సంఘంలో భారీ ఎరువుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.18 లక్షల ఎరువులకు లెక్క తేలటం లేదు. ఎరువులకు సంబంధించి రెండు రికార్డులను నిర్వహిస్తున్నట్లు సమాచారం. నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం అనంతరం రికార్డులు అప్పచెప్పే క్రమంలో వెలుగులోకి వచ్చింది. సొసైటీలో  అధికారుల పర్యవేక్షణ లేమి,  సరైన ఆడిట్‌ జరక్కపోవటంతో  2018-19లోనే రూ.1.50 లక్షలు తేడా వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం 2900 యూరియా బస్తాలు, 547 డీఏపీ బస్తాలు, 400 20-20 బస్తాలు, 83 పొటాష్‌ బస్తాలు తక్కువగా ఉన్నట్లు సమాచారం. రాజారాంపేట సహకార సంఘంలో ఎరువులకు సంబంధించి అధికారికంగా ఒకటి, అనధికారికంగా మరొక రికార్డులను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.  దీంతో దృష్టి పెట్టి చూస్తే తప్ప ఖచ్చితమైన లెక్కలు తెలియని పరిస్థితి నెలకొంది.

 

రిజిస్టర్‌లో నమోదు నామమాత్రమే..

ఎరువులను డీవోల ప్రకారం రిజిస్టర్‌లో ఎంటర్‌ చేసి పీవోసీ మిషన్‌ ద్వారానే అమ్మి, ఏరోజు లెక్క ఆరోజు పంపాలనే నిబంధన ఉంది. కానీ రాజారాంపేట సహకార సంఘంలో అలా జరిగినట్లు లేదు. ఎరువుల డీవోలను కొన్నింటిని స్టాక్‌ రిజిస్టర్‌లో నమోదు చేయడంలేదు. ఆగస్టు వరకు రూ.12 వేలు లెక్కల్లో తేడా రాగా బాధ్యుడైన సేల్స్‌మేన్‌ నుంచి రికవరీ చేసి అతణ్ని బయటకు పంపారు. కాగా కుంభకోణం జరిగినట్లు భావిస్తున్న సమయంలో పనిచేసిన సేల్స్‌మేన్‌ను ప్రశ్నించగా ఎరువులు అమ్మిన డబ్బులు ఎప్పటికప్పుడు సీఈవోకి అప్పచెప్పేవాడినన్నాడు. నమ్మకంతో డబ్బు అప్పగిస్తే తనను  దోషిని చేస్తున్నారన్నాడు.  అయితే సదరు సేల్స్‌మేన్‌ తనకు ఎప్పుడూ డబ్బులు ఇవ్వలేదని సీఈవో శ్రీనివాసరావు స్పష్టంచేశారు. వచ్చిన డబ్బును బ్యాంకులో జమచేసేవాడని, సొంతానికి డబ్బులు వాడుకొని తనపై తప్పు నెట్టే ప్రయత్నం చేస్తున్నాడని వాపోయారు.


సీఈవో రికార్డులు అప్పచెప్పలేదు 

ఫిబ్రవరి 16న తాను అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నానని అధ్యక్షుడు పగిడిపత్తి శ్రీను చెప్పారు. తనకు అప్పటి నుంచీ లెక్కలు అప్పచెప్పలేదన్నారు. ఎరువుల స్టాక్‌ చూడమంటే కట్టలెక్కువగా ఉన్నాయని, ఆడిట్‌ సమయంలో చూద్దామని కాలయాపన చేశారని చెప్పారు. గట్టిగా అడిగితే విషయం బయటకు వచ్చిందని, సీఈవో, సేల్సమేన్‌లను ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. 

Updated Date - 2020-10-24T10:41:00+05:30 IST