Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఎరువు.. ‘ధర’వు!

twitter-iconwatsapp-iconfb-icon
ఎరువు.. ధరవు!

ఒక్కో బస్తాపై రూ.140 నుంచి రూ.425 వరకు పెంపు
పెరగనున్న పెట్టుబడి వ్యయం
అన్నదాతలపై అదనపు భారం
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతున్న వేళ.. అన్నదాతపై ఎరువుల రూపంలో అదనపు భారం పడింది. ఇప్పటికే సాగు పెట్టుబడి వ్యయం పెరిగి.. పండించి పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు అప్పుల పాలవుతున్నారు. వారిని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ఎరువుల ధర పెంచి మరింత భారం మోపింది. డీఏపీ, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులకు సంబంధించి ఒక్కో బస్తాపై రూ.140 నుంచి రూ.425 వరకు ధర పెంచింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని రకాల పంటలు కలిపి సుమారు 3.5 లక్షల హెక్టార్లలో సాగు చేస్తుంటారు. వరి, చెరకు పంటలు దాదాపు సగం విస్తీర్ణంలో ఉంటాయి. మిగిలిన వాటిలో చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, తదితర పంటలు సాగు చేస్తున్నారు. ఎకరా వరికి ఒక బస్తా డీఏపీ, రెండు బస్తాల కాంప్లెక్స్‌ ఎరువులు వినియోగిస్తారు. కూలీ రేట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. కానీ, ఆ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ ధరలు పెరగడం లేదు. ప్రధానంగా రసాయన ఎరువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎరువుల ధరలను పెంచేస్తోంది. కొన్ని ఎరువులకు సబ్సిడీ కొనసాగిస్తున్నట్టు చెబుతున్నా.. రెండు, మూడు రెట్లు ధరల భారం తప్పడం లేదు. సుమారు రెండు నెలల కిందట ఎరువులపై సబ్సిడీ పెంచినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గత ఏడాది కన్నా ధరలు తగ్గుతాయని రైతులు భావించారు. కానీ, ప్రస్తుతం మళ్లీ ధరలు పెంచేయడంతో లబోదిబోమంటున్నారు. డీఏపీ(40 కిలోలు) బస్తాపై రూ.150 పెరిగింది. గత ఏడాది బస్తా రూ.1200 ఉండగా.. ప్రస్తుతం రూ.1350 ఉంది. వాస్తవంగా డీఏపీ బస్తా రూ.3850 అని.. దీనిలో రూ.2500 కేంద్రం భరించి, రైతులకు రూ.1,350కే ఇస్తున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ ఇటీవల ప్రకటించారు. మిగిలిన ఎరువుల విషయానికి వస్తే 14-35-14, 28-28-0 ఎరువులు 50 కిలోలపై రూ.425, 20-20-0-13 ఎరువుపై రూ.140, 15-15-15 ఎరువుపై రూ.300 చొప్పున ధరలు పెరిగాయి. దీంతో ఈ ఏడాది డీఏపీపై రూ.150, కాంప్లెక్స్‌ ఎరువులపై రూ.850 వరకు అదనపు భారం పడనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.  సాగు వ్యయం ఎకరాకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు పెరగనుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ధరలు నియంత్రించాలని కోరుతున్నారు.

అందుబాటులో 31వేల టన్నులు
జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 56,000 టన్నుల ఎరువుల అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రైవేటు వ్యాపారులు విక్రయించే ధర కన్నా రైతుభరోసా కేంద్రాల్లో తక్కువ ధరకు ఎరువులు విక్రయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఖరీఫ్‌ వ్యవసాయ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. జిల్లాలో 656 రైతుభరోసా కేంద్రాల్లో ప్రస్తుతం 31,000 టన్నుల ఎరువులు మాత్రమే నిల్వ ఉన్నాయి. పలు కేంద్రాల్లో ఎరువులు లేకపోవడంతో రైతులు ప్రైవేటు దుకాణాల్లో  కొనుగోలు చేస్తున్నారు.  

కొరత లేకుండా చూస్తాం:
జిల్లాలో యాభై శాతం మార్క్‌ఫెడ్‌ వద్ద, యాభై శాతం రైతుభరోసా కేంద్రాల వద్ద ఎరువులను ఉంచుతున్నాం. ప్రస్తుతం జిల్లాలో 31వేల టన్నులు ఎరువులు ఉన్నాయి. యూరియా ధర పెరగలేదు. కానీ డీఏపీ ధర పెరిగింది. రైతు భరోసా కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా  రైౖతులు ఎరువులు పొందవచ్చు. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూస్తున్నాం. వీలైతే రైతులు నానో యూరియాను పంటలకు వినియోగించడం అలవాటు చేసుకోవాలి.
- శ్రీధర్‌, జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు

ధరల భారం ఇలా...

---------------------------------------------
ఎరువు        గతేడాది         ఈ ఏడాది         భారం

---------------------------------------------
డీఏపీ        రూ. 1200        రూ. 1350        రూ. 150
28-28-0        రూ. 1475        రూ. 1900        రూ. 425
20-20-0-13    రూ. 1210        రూ. 1350        రూ. 140
ఎంవోపీ        రూ. 1100        రూ. 1400        రూ. 300
 
 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.