ఎరువుల వ్యాపారుల లింకు దందా!

ABN , First Publish Date - 2021-07-26T06:42:25+05:30 IST

జిల్లాలో ఎరువులు, పురుగు మందుల దుకాణాల వ్యాపారులు లింకు దందాకు తెరలేపారు. యూరియా కావాలంటే రైతులు గడ్డి మందు, కలుపు మందులను కచ్చితంగా కొనాల్సిందేనని లింకు పెడుతున్నారు.

ఎరువుల వ్యాపారుల లింకు దందా!

జిల్లాలో యూరియాకు గడ్డి మందు, కలుపు మందుకు ఎరువుల డీలర్ల లింకు

యూరియా కావాలంటే.. ఆ రెండు మందులు కొనాల్సిందే..!

అవసరం లేకున్నా అంటగడుతున్న వైనం

ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు

చోద్యం చూస్తున్న వ్యవసాయ శాఖాధికారులు

బోధన్‌, జూలై 25: జిల్లాలో ఎరువులు, పురుగు మందుల దుకాణాల వ్యాపారులు లింకు దందాకు తెరలేపారు. యూరియా కావాలంటే రైతులు గడ్డి మందు, కలుపు మందులను కచ్చితంగా కొనాల్సిందేనని లింకు పెడుతున్నారు. అవసరంలేని మందులను రైతులకు అంటగ డుతూ వారిని ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. యూరియా తప్పనిసరి కావడంతో ఎరువుల వ్యాపారులకు రైతులు కూడా తలొగ్గాల్సిన పరిస్థితి వస్తోంది. జిల్లాలోని ఎరువుల డీలర్లంతా కుమ్మక్కై ఈ లింకు దందాతో లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. ఎక్కడైనా రైతులు గట్టిగా ప్రశ్నిస్తే తమ వద్ద యూరియా లేదంటూ దబాయిస్తు న్నారు. ఇంకొందరు డీలర్లు ఏకంగా తమకు కంపెనీలే యూరియాను గడ్డి మందు, కలుపు మందుతో లింకుపెట్టి ఇస్తున్నాయని తెగేసి చెబుతున్నారు. కంపెనీలు తమకు పెట్టిన ఆంక్షలనే రైతులపై రుద్దుతున్నామని చెప్పుకొస్తున్నారు. ఇలా ప్రతిఏటా వానాకాలం, యాసంగి సీజన్‌లలో ఈ లింకు దందాతో జిల్లాలో ఎరువులు, పురుగుమందుల దుకాణాల వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. అయితే, ఈ దందా బహిరంగంగానే కొనసాగుతున్నా.. జిల్లాలోనివ్యవ సాయ శాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. 

తక్కువ ధరకు కొని.. ఎక్కువ ధరకు విక్రయం

ఎరువుల వ్యాపారులు గడ్డి, కలుపు మందులను ఆఫర్లలో తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ఎక్కువ ధరకు రైతులకు బలవంతంగా అంటగడుతున్నారన్న విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. తమ స్వార్థంకోసం రైతులకు అక్కరలేని మందులను అంటగట్టి వాటిని వినియోగించేలా చేస్తున్నారు. దీనివల్ల భూమి సారం కూడా కోల్పోతోంది. ఒక్కో రైతుకు ఎకరాకు అదనంగా రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు ఈ లింకు మందులకు వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. నిజామాబాద్‌, కామారెడ్డి, బాన్సువాడ, బోధన్‌, ఆర్మూర్‌ డివిజన్‌ల పరిధిలో ఈ లింకు దందా యథేచ్ఛగా సాగు తోంది. బోధన్‌ డివిజన్‌ పరిధిలోని కోటగిరి, వర్ని, రుద్రూరు, చందూరు, మోస్రా, బోధన్‌, ఎడపల్లి, రెంజల్‌ మండలాల్లో ఎరువుల వ్యాపారులు ఈ దందాతో రైతులను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. 

 డిమాండ్‌తో యూరియా కొరత..

ఈ ఏడాది వానాకాలం సీజన్‌ ప్రారంభం నుంచి జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో వరి నాట్లు జోరుగా కొనసాగాయి. ఇప్పటికే చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోగా నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులతో పాటు చిన్నచిన్న జలాశయాలు కూడా నిండడంతో రైతులు వరినాట్లు ముమ్మరం చేశారు. చెరువులు, బోరు బావులు, ప్రాజెక్టుల కింద వరి నాట్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎరువులకు డిమాండ్‌ పెరిగింది. వరి పంటలో తొలి విడత కలుపు తీయడం కొనసాగుతుండడంతో రైతులు కాంప్లెక్స్‌ ఎరువులతో పాటు యూరియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో యూరియా కొరత ఏర్పడింది. డిమాండ్‌ కారణంగా కొరత ఏర్పడి సహకార సొసైటీలు, డీలర్ల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో సహకార సొసైటీలలో యూరియా నిల్వలను పెంచాల్సిన అవసరం ఉంది. వరిసాగు పెరిగిన నేపథ్యంలో యూరియా నిల్వలను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా నిల్వలను తగ్గించడంతో పాటు యూరియా విక్రయాలపై పర్యవేక్షణ, తనిఖీలు పెంచితే రైతులకు యూరియా కొరత తీరి అదనపు భారం తగ్గే అవకాశం ఉంది.  

చోద్యం చూస్తున్న వ్యవసాయ శాఖ..

ఎరువుల డీలర్లు లింకు దందాతో రైతులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నా.. వ్యవసాయ శాఖ చోద్యం చూస్తోంది. విత్తనాలు మొదలుకుని ఎరువులు, పురుగు మందుల విక్రయాల వరకు వ్యవసాయ శాఖ కఠినంగా వ్యవహరిం చడంతో పాటు నిత్యం తనిఖీలు చేయాల్సి ఉన్నా.. ఏడాదికి రెండు పర్యాయాలు తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. ప్రతీరోజు ఫోన్‌లలో ఎరువుల వ్యాపారుల నుంచి స్టాక్‌ వివరాలు తీసుకొని ఉన్నతాధికారులకు చేరవేయడమే వ్యవసాయశాఖ పనిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖలో సిబ్బంది సంఖ్యను పెంచి విస్తీర్ణ అధికారుల ను పెంచినా వారి తీరు మారడం లేదు. ఎరువులు, పురుగుల మందుల వ్యాపారుల నుంచి సీజన్ల వారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యవసాయశాఖ అధికారులు.. డీలర్లు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా చోద్యం చూస్తున్నారు. డీలర్లనే సమర్థించేలా వ్యవహరిస్తున్నారు. ఈ లింకు దందాలో డీలర్ల తప్పులేదని, కంపెనీలు ఇస్తేనే డీలర్లు విక్రయిస్తున్నారని కొందరు వ్యవసాయశాఖ అధికారులు వంతపాడుతుండడం కోసమెరుపు. అధికారులు జేబులు నింపు కొని రైతుల జేబులకు మాత్రం చిల్లులుపడేలా ఈ లింకు వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వ్యవ సాయ శాఖపై గుప్పుమంటున్నాయి. 

 ఫిర్యాదులు వస్తే దుకాణాలు సీజ్‌

- సంతోష్‌, వ్యవసాయ శాఖాధికారి, బోధన్‌

యూరియా కొనుగోలుకు వచ్చే రైతులకు ఎరువుల వ్యాపారులు గడ్డి, కలుపు మందులు కూడా కొనుగోలు చేయాలని ఆంక్షలు పెడితే కఠిన చర్యలు ఉంటాయి. రైతులు నేరుగా ఫిర్యాదు చేస్తే దుకాణాలు సీజ్‌ చేస్తాం. 

Updated Date - 2021-07-26T06:42:25+05:30 IST