ఎరువు దోపిడీ

ABN , First Publish Date - 2022-01-13T06:03:57+05:30 IST

రైతు ప్రయోజనాలను సర్కారు పూర్తిగా గాలికొదిలేసింది. కీలకమైన ఎరువుల విషయంలోనూ చేతులెత్తేసింది.

ఎరువు దోపిడీ

రైతులకు భారంగా  కాంప్లెక్స్‌, డీఏపీ ధరలు 

బస్తాకు రూ.300 వరకు అదనపు వసూళ్లు

మండిపోతున్న 28-28 రేటు

అలంకారప్రాయంగా ఆర్బీకేలు

చోద్యంచూస్తున్న  వ్యవసాయశాఖ అధికారులు 

రైతు ప్రయోజనాలను సర్కారు పూర్తిగా గాలికొదిలేసింది. కీలకమైన ఎరువుల విషయంలోనూ చేతులెత్తేసింది. రాయితీలు ఇవ్వడం అటుంచి కనీసం ధరలకు అందుబాటులో ఉండేలా చూడటంలోనూ విఫలమైంది. దీంతో ఎరువుల బ్లాక్‌ మార్కెటింగ్‌ విచ్చలవిడిగా సాగుతోంది. ఆర్బీకేల్లో అమ్మకాలు పడకేయడంతో ఎరువుల వ్యాపారులు ఇష్టారీతిగా ధరలు పెంచేసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అన్నిరకాల ఎరువులపై డిమాండ్‌, రైతుల అవసరాన్ని బట్టి రూ.100 నుంచి రూ.300 వరకు అదనంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కొన్ని రకాల కాంప్లెక్స్‌ ఎరువులకైతే కంపెనీవాళ్లే భారీగా ధరలు పెంచారని చెబుతూ ఎమ్మార్పీ కన్నా ఆరేడు వందలు అధికంగా పిండుకుంటున్నారు. దీంతో ఆ రకాల ఎరువులను వాడలేక రైతులు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిగిలిన కాంప్లెక్స్‌ ఎరువులకు కూడా గిరాకీ పెరుగుతుండటంతో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. కట్టడి చేయాల్సిన వ్యవసాయశాఖ అధికారులు చోద్యం చూడటం విమర్శలకు తావిస్తోంది. 

కందుకూరు, జనవరి 12: ఎరువుల ధరలు రైతులకు చుక్కలు చూపెడుతున్నాయి. పంటలకు కీలక సమయం కావడంతో వ్యాపారులు చెప్పిందే రేటుగా మారింది. కాంప్లెక్స్‌, డీఏపీ రకం ఎరువులను ఎమ్మార్పీ కన్నా అధికంగా అమ్ముతున్నా వ్యవసాయశాఖ చోద్యం చూస్తోంది. అదేమంటే కంపెనీలే ధరలు పెంచాయని ఒకసారి, కాదు సరఫరాను తగ్గించడంతో డిమాండ్‌ పెరిగిందని మరోసారి చెబుతుండటం గమనార్హం. ఆర్బీకేలు అలంకారప్రాయంగా మారాయి. కేవలం కందుకూరు ప్రాంతంలోనేగాక జిల్లావ్యాప్తంగా ఇవే పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా కందుకూరు ప్రాంతంలో ప్రస్తుతం శనగ, పొగాకు, పత్తి సాగు ముమ్మరంగా సాగుతోంది. బ్లాక్‌మార్కెట్‌లో మండిపోతున్న ఎరువుల ధర దెబ్బకు రైతులు కుదేలవుతున్నారు. కందుకూరు పట్టణంలోనే భారీగా బ్లాక్‌మార్కెట్‌ నడుస్తుండగా ఇక మండలకేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న దుకాణాల్లో అయితే మరింత నిలువుదోపిడీ జరుగుతోందని రైతులు వాపోతున్నారు. అసలే భారీవర్షాల దెబ్బకు పంటలు దెబ్బతిని ఓ వైపు, అన్నిరకాల పంటల సాగుకి అదును పోయి మరోవైపు అల్లాడుతున్న రైతులు మండిపోతున్న ఎరువుల ధరలతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. 


అన్నిరకాల ఎరువులపై అదనపు వసూళ్లు

డీఏపీ మొదలు అన్నిరకాల ఎరువుల బస్తాలపై వ్యాపారులు అదనపు బాదుడు బాదుతున్నారు. రూ.1,200కు విక్రయించాల్సిన డీఏపీని రూ.1,350 నుంచి రూ.1,400 వరకు అమ్ముతున్నారు. పంటల సాగులో యూరియా తర్వాత అత్యధికంగా వినియోగించేది డీఏపీనే. కాంప్లెక్స్‌ ఎరువులు ఏమి వాడినా దుక్కిలో తప్పకుండా డీఏపీ వేయాల్సిందే. మిరప, పత్తి, వరిలాంటి పైర్లకైతే తర్వాత కూడా డీఏపీని విరివిగా ఉపయోగిస్తారు. అదేవిధంగా 20-20-0-13, 14-35-14 లాంటి కాంప్లెక్స్‌ ఎరువులకు కూడా బ్లాక్‌మార్కెట్‌ నడుస్తోంది. వీటిపై కూడా భారీగా బ్లాక్‌లో వసూలు చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ఈ రకాలపై ఎమ్మార్పీ కన్నా బస్తాకు రూ.300 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ రకం ఎరువులను రూ.800కు విక్రయించాల్సి ఉండగా రూ.1,100 నుంచి కొన్ని ప్రాంతాల్లో రూ.1,200 వరకు వసూలు చేస్తున్నారు. ఇక 28-28రకం కాంప్లెక్స్‌ ఎరువునైతే బస్తాకు రూ.600వరకు బ్లాక్‌మార్కెట్‌లో అదనంగా విక్రయిస్తుండటంతో ఆ రకం ఎరువుని వాడటం మానేసి దానికి ప్రత్యామ్నాయంగా మిగిలిన కాంప్లెక్స్‌ ఎరువులను వినియోగిస్తున్నారు. దీంతో వాటికి డిమాండ్‌ పెరుగుతుండటం కూడా వ్యాపారులకు అవకాశంగా మారింది. మరోపక్క అమ్మోనియం సల్ఫేట్‌ కూడా బ్లాక్‌ మార్కెట్‌ నడుస్తోంది. బస్తా రూ.720కి విక్రయించాల్సిన అమ్మోనియం సల్ఫేట్‌ని రూ.960 నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్ముకుంటున్నారు. 


చోద్యం చూస్తున్న వ్యవసాయశాఖ అధికారులు 

ఎరువుల వ్యాపారులు రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నా వ్యవసాయ శాఖ అధికారులు కనీస తనిఖీలు చేస్తున్న పాపానపోకపోతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారికి అంతా తెలిసే నిద్ర నటిస్తున్నారని అందుకు కారణాలు ఏమిటన్నది అర్థం కావటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎరువులకు కొరతే లేదు, జిల్లాలో సమృద్ధిగా నిల్వలున్నాయి, మన గ్రోమోర్‌ సెంటర్లలో అన్నిరకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పే అధికారులు బ్లాక్‌ మార్కెట్‌ నిరోధానికి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.


 ఆర్బీకేలు  అలంకారప్రాయం 

రైతుల ముంగిటకే సేవలు, వారి ఇళ్ల వద్దకే ఎరువులు అన్న నినాదంతో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) అలంకారప్రాయంగా మారాయి. ఆర్బీకేల్లో ముందు డబ్బు చెల్లించినా సకాలంలో ఎరువులు సరఫరా చేయలేకపోతుండటంతోపాటు గడ్డలు కట్టి నాణ్యత లేని ఎరువులు వస్తుండటంతో రైతులు వాటిపై ఆశలు వదులుకున్నారు. గడ్డలు కట్టిన ఎరువులు ట్రాక్టర్‌ అడ్డలలో వెదబెట్టుకోడానికి వీలుకాదని, దుక్కిలో చల్లితే ప్రభావవంతంగా పనిచేయదని గ్రహించిన రైతులు ఎరువుల వ్యాపారుల వద్దకే పరుగులు తీస్తున్నారు. దీంతో రైతు అవసరాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉత్సాహవంతమైన వీఏఏలు ఉన్న అతికొద్ది ఆర్బీకేల్లో తప్ప అనేకచోట్ల ఈ ఏడాది రైతులకు ఎరువులు తెప్పించిన దాఖలాలే లేవు. దీంతో వ్యాపారుల పంట పండుతోంది. 



Updated Date - 2022-01-13T06:03:57+05:30 IST