ఎరువు.. ఇక బరువే!

ABN , First Publish Date - 2021-03-07T04:45:57+05:30 IST

మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అసలే వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో అన్నదాతపై మరో భారం పడింది.

ఎరువు.. ఇక బరువే!

 పది శాతం ధరలు పెంచిన కేంద్రం

వచ్చే నెల నుంచి అమలులోకి?

రైతులపై అదనపు భారం రూ.20కోట్లు


నెల్లూరు (వ్యవసాయం), మార్చి 6 : మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అసలే వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో అన్నదాతపై మరో భారం పడింది. ఎరువుల ధరలు పది శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కర్షకుడిలో గుబులు మొదలైంది. మార్చి మొదటి వారం నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని భావించినా అందుకు తగ్గట్టుగా ఎరువుల బ్యాగులు ఇంకా రాలేదు. పెరిగిన ధరల కారణంగా జిల్లా రైతాంగంపై దాదాపు రూ.20 కోట్ల అదనపు భారం పడనుంది.

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో లో సుమారు 2.5 లక్షల ఎకరాల్లోను, రబీలో 5లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయానికి పెట్టుబడి బాగా పెరిగింది. విత్తనాలు కొనుగోలు చేసి నాట్లు వేసేందుకు కూలీల ఖర్చు తడిసి మోపెడవుతోంది. అంతేగాక దుక్కిలో, మొక్కలు నాటిన తర్వాత నుంచి కోత కోసే సమయం వరకు పంటను రక్షించుకునేందుకు రకరకాల ఎరువులు, పురుగు మందులకు రూ.వేలల్లో ఖర్చు అవుతోంది. ఈ నేపథ్యంలో ఎరువుల ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది రైతన్నపై అదనపు భారమే. సాధారణంగా ఎకరాకు తక్కువలో తక్కువగా డీఏపీ ఒక అర బస్తా వాడతారు. నత్రజని, భాస్పరం కలిగిన ఈ ఎరువును దుక్కి వేస్తారు. దీని ధర సుమారుగా రూ.1,225 నుంచి రూ.1275 వరకు కంపెనీని బట్టి విక్రయిస్తున్నారు. ఇందులో 10శాతం అంటే సుమారు రూ.120 అనుకుంటే దాదాపు రూ.6కోట్ల అదనపు భారం పడుతోంది. 

అదేవిధంగా కాంప్లెక్స్‌ ఎరువులు తీసుకుంటే దాదాపు రూ.950 నుంచి రూ.975 వరకు కంపెనీలను బట్టి ధరలు ఉన్నాయి. ఎకరాకు ఒక బస్తా వినియోగించినా దాదాపు రూ.90 అదనపు భారం. అంటే అదనంగా జిల్లావ్యాప్తంగా రైతులపై పడేభారం రూ.4.5కోట్లు. ఇంకా ఎంఓపి ఈపొటాష్‌ ఎరువును మొక్కల ఎదుగుదలకు, పురుగులను తట్టుకునేందుకు రైతులు వాడతారు. పంట ప్రారంభంలో ఒక విడత, చివరి దశలో రెండో విడతగా ఈపొటాష్‌ ఎరువును వాడతారు. ఒక బ్యాగు ధర రూ.1000 నుంచి 1250వరకు ఉంటోంది. పెరిగిన ధరతో పోలిస్తే 10శాతం అంటే దాదాపు రూ.120. జిల్లా వ్యాప్తంగా పడే భారం దాదాపు రూ.6 కోట్లు. ఇంకా ఎస్‌ఎ్‌సపి ఎరువులు. ఈభాస్వరం ఎరువులను పచ్చిరొట్ట ఎరువులను కుళ్లిపోయేందుకు బాగా ఉపయోగపడతాయి. ఎకరాకు ఒక బ్యాగు వాడతారు. దీని ధర సుమారు రూ.600. అదనపు భారం రూ.60. జిల్లావ్యాప్తంగా రూ.3 కోట్లు. పెరిగిన ధరలతో పోలిస్తే జిల్లావ్యాప్తంగా రైతులపై పడే అదనపు భారం దాదాపు రూ.20 కోట్లు. 

Updated Date - 2021-03-07T04:45:57+05:30 IST