టోక్యోలో స్ర్తీశక్తి

ABN , First Publish Date - 2021-08-03T06:29:16+05:30 IST

టోక్యోఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను రజతం సాధించడంతో మొదలైన సంబరాలు... తెలుగుతేజం పూసర్ల వెంకట సింధు బ్యాడ్మింటన్‌లో...

టోక్యోలో స్ర్తీశక్తి

టోక్యోఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను రజతం సాధించడంతో మొదలైన సంబరాలు... తెలుగుతేజం పూసర్ల వెంకట సింధు బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించడంతో అంబరాన్నంటాయి. అసోం అమ్మాయి లవ్లీనా బోర్గోహైన్‌ బాక్సింగ్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లి మరో పతకాన్ని ఖాయం చేసింది. లవ్లీనా సెమీస్‌ బౌట్‌ గురువారం జరగాల్సి ఉంది. అందులో గెలిస్తే, విశ్వక్రీడల్లో ఫైనల్‌ చేరిన తొలి భారత బాక్సర్‌గా లవ్లీనా రికార్డు సృష్టిస్తుంది. ఓడినా కాంస్య పతకం అందుకుంటుంది. మహిళల హాకీ జట్టు తొలిసారిగా విశ్వవేదికపై సెమీఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది. ఇలా ఈసారి పతకవేటలో ముందంజలో నిలిచిన అమ్మాయిలు కోట్లాది భారతీయుల్లో ఆనందోత్సాహాలు నింపారు. 


గత రియో ఒలింపిక్స్‌లో రజతంతో సంచలనం సృష్టించిన సింధు...కచ్చితంగా స్వర్ణం గెలుస్తుందన్న అంచనాల మధ్య టోక్యోలో పోటీపడింది. సెమీఫైనల్‌ దాకా చేరింది కానీ, ప్రపంచ నెంబర్‌వన్‌ క్రీడాకారిణి తై జు యింగ్‌తో మ్యాచ్‌లో తడబాటుకు గురై ఓడింది. స్వర్ణపతక పోరులో నిలవలేకపోయినా, రిక్తహస్తాలతో ఇంటికెళ్లరాదన్న పంతంతో కాంస్యం కోసం పోరాడింది. యావద్భారతం ఉత్కంఠతో వీక్షించిన ఆ మ్యాచ్‌లో సింధు విశ్వరూపం ప్రదర్శించింది. చైనా క్రీడాకారిణి హె బిన్‌గ్జియావోను వరుసగేముల్లో చిత్తుచేసి పతకాన్ని ముద్దాడింది. ఒలింపిక్స్‌లో ఒక్క పతకం సాధించడమే గొప్ప అనుకుంటే, సింధు రెండింటిని గెలుచుకుని, రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ తర్వాత వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు అందుకున్న భారత ప్లేయర్‌గా తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. 


ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో సింధు రజత పతకంతో భారతీయులను మురిపించింది. అనంతర సన్మానాలు, భారీ నజరానాలు, వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు ఆమెను చుట్టుముట్టాయి. అయినా ఆమె ఆటకు అలుపివ్వలేదు. అవార్డులు, రివార్డులు దరిచేరినా రాకెట్‌పై మరింత మక్కువ పెంచుకుంది. కొన్ని టోర్నమెంట్లలో విఫలమైనా కుంగిపోలేదు. ఓ దశలో రెగ్యులర్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు దూరమై, కొరియాకు చెందిన పార్క్‌ను కొత్త కోచ్‌గా నియమించుకోవడంపై విమర్శలు వచ్చినా మానసిక స్థైర్యాన్ని కోల్పోలేదు. పార్క్‌ శిక్షణలోనే మూడేళ్లక్రితం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా అనేక టోర్నీలు రద్దయినా, లాక్‌డౌన్‌ను అవకాశంగా మార్చుకొని, మరింత సన్నద్ధమై వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ నిలిచింది. 


టోక్యోలో సింధుతో పాటు మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహైన్‌, మహిళల హాకీ జట్టు ప్రదర్శనల గురించి చెప్పుకోవాలి. ఈ విశ్వక్రీడల్లో దేశానికి తొలి పతకాన్ని అందించిన మణిపూర్‌ రాష్ట్ర లిఫ్టర్‌ మీరాబాయి, రియో క్రీడల్లో పోరాడిన తీరు ప్రశంసనీయం. కొన్నేళ్ల క్రితం చాలామంది అథ్లెట్లు డోపీలుగా తేలడంతో మన దేశంలో లిఫ్టింగ్‌ అంటే డోపింగ్‌ అన్న అపవాదు ఉండేది. ఆ పరిస్థితుల నుంచి బయటపడేస్తూ మీరాబాయి ఇప్పుడు విశ్వవేదికపై వెండి వెలుగులు విరజిమ్మింది. కరణం మల్లీశ్వరి తర్వాత 21 ఏళ్లకు ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత లిఫ్టర్‌గా మీరా నిలిచింది. ఆమె చిన్నప్పుడు అమ్మతో కలిసి వంటచెరుకు కోసం సమీపంలోని పర్వత ప్రాంతాల్లో గుట్టలు ఎక్కుతూ, బరువులు అవలీలగా మోయడాన్ని అలవాటు చేసుకుంది. నాడు కట్టెలు మోసిన చేతులతోనే ఇప్పుడు అత్యున్నత వేదికపై పతకాన్ని అందుకొని అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. బాక్సింగ్‌లో ఎన్నో అంచనాలున్న మేరీకోమ్‌లాంటి స్టార్‌ క్రీడాకారిణి విఫలమైన చోట అసోంకు చెందిన యువ బాక్సర్‌ లవ్లీనా అద్భుత ప్రదర్శనతో సెమీస్‌దాకా చేరడం అద్భుతం. దిగ్గజ బాక్సర్‌ మహ్మదాలీ స్ఫూర్తితో బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న లవ్లీనా, తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడి ఏకంగా పతకాన్ని ఖరారు చేసుకోవడం ఆమె అమోఘమైన ప్రతిభకు నిదర్శనం. ఒలింపిక్స్‌లో భారత హాకీ అంటే పురుషుల జట్టు మాత్రమే అన్న అభిప్రాయానికి చరమగీతం పలుకుతూ ఇప్పుడు మహిళల బృందం పతకం దిశగా సాగుతుండడం అద్భుత పరిణామం. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అమ్మాయిలు మూడుసార్లు ఒలింపిక్‌ విజేత అయిన ఆస్ట్రేలియా జట్టును క్వార్టర్‌ఫైనల్లో కంగుతినిపించి భారత మహిళల హాకీ చరిత్రలోనే మొదటిసారిగా ఒలింపిక్స్‌ సెమీస్‌ చేరిన ఘనత సాధించారు. కెప్టెన్‌ రాణీ రాంపాల్‌ సారథ్యంలోని భారత మహిళల జట్టు ఇంకొక్క విజయం అందుకుంటే పతకం ఖాయం. టోక్యోలో పురుషులకు మించిన ప్రదర్శనతో ఒలింపిక్‌ శక్తిగా ఎదుగుతున్న మన అమ్మాయిలకు అభినందనలు.

Updated Date - 2021-08-03T06:29:16+05:30 IST