మహిళా జేఏసీ నేతలపై దాష్టీకం

ABN , First Publish Date - 2020-02-24T08:54:33+05:30 IST

రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న మహిళా జేఏసీ నేతలపై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌ అనుచరులు ఆదివారం దాడి చేశారు. ఏకంగా ఆయనే మహిళలను నోటికొచ్చినట్లు అసభ్యపదజాలంతో దూషించారు.

మహిళా జేఏసీ నేతలపై దాష్టీకం

  • వైసీపీ ఎంపీ అనుచరుల దౌర్జన్యం
  • మహిళలను దుర్భాషలాడిన నందిగం సురేశ్‌ 
  • కారుకు అడ్డుగా ఉన్నవారిని పక్కకు తోసేసిన అనుచరులు
  • ఆనక మహిళా జేఏసీ బస్సుపై దాడి
  • లోపల ఉన్నవారిపై కారం చల్లి..
  • మహిళలనే తనిఖీచేయాలని ఒత్తిడి
  • బస్సును అమరావతికి తరలిస్తుండగా రెండు ఆటోల్లో వెంబడించిన వైనం
  • అటకాయించిన లింగాపురం రైతులు
  • దాడికి దిగిన ఎంపీ అనుయాయులు
  • ఎంపీ గల్లా, టీడీపీ నేతల రాక
  • సురేశ్‌, అనుచరులపై కేసుపెట్టాలని డిమాండ్‌

గుంటూరు, ఫిబ్రవరి 23: రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న మహిళా జేఏసీ నేతలపై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌ అనుచరులు ఆదివారం దాడి చేశారు. ఏకంగా ఆయనే మహిళలను నోటికొచ్చినట్లు అసభ్యపదజాలంతో దూషించారు. అమరావతికి మద్దతుగా రాజధాని గ్రామాల్లో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ మహిళా జేఏసీ నేతలు బస్సు యాత్ర చేపట్టారు.   రాజధాని గ్రామాల్లో రైతుల దీక్షలకు మద్దతు తెలిపి అమరేశ్వరుడిని  మొక్కుకునేందుకు తాడికొండ అడ్డరోడ్డు నుంచి అమరావతి వైపు బయల్దేరారు. ఇదే సమయంలో బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ అమరావతిలో జరిగిన మహాశివరాత్రి రథోత్సవంలో పాల్గొని గుంటూరు వైపు వెళ్తున్నారు. లేమల్లె గ్రామంలో కారు ఆపి తన అనుచరులతో మాట్లాడుతుండగా మహిళా జేఏసీ నేతలు నలుగురు బస్సు దిగి ‘జై అమరావతి’ అంటూ సురేశ్‌ వద్దకు వెళ్లారు. ఆయన వారిని అసభ్యపదజాలంతో దూషించారు. నానా దుర్భాషలాడారు. సురేశ్‌ అనుచరులు మహిళలను పక్కకు తోసి వేసి ఎంపీ కారును పంపించారు. అనంతరం బస్సుకు అడ్డుగా నిలబడి జేఏసీ నేతలను దుర్భాషలాడుతూ దాడి చేశారు. బస్సును కదలనివ్వకుండా ముందు కూర్చున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎంపీ అనుచరులను విచారించగా.. మహిళలు తమపై కారంతో దాడి చేశారని చెప్పారు. 


బస్సులో మహిళల వద్ద కారం ఉందని.. తనిఖీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ బూతులు తిట్టి వెళ్లగా అనుచరులు తమపై కారం చల్లి చేయిచేసుకున్నారని.. తమకు గాయాలయ్యాయని మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మహిళలు ఉన్న బస్సును అమరావతి స్టేషన్‌కు తరలించాలని నిర్ణయించారు. ఎంపీ అనుచరుల్లో ఒకరిని పోలీసు వ్యాన్‌లో ఎక్కించుకుని బస్సుతో పాటు అమరావతి వైపు వస్తుండగా.. అప్పటికే స్టేషన్‌ వద్ద రాజధాని, స్థానిక రైతులు భారీగా చేరుకున్నారు. గొడవ పెరుగుతుందన్న ఉద్దేశంతో పోలీసులు బస్సును పెదకూరపాడు స్టేషన్‌కు మళ్లిస్తుండగా.. లింగాపురం గ్రామ రైతులకు సమాచారం అందింది. దాంతో వారు బస్సును అడ్డుకుని మహిళలను స్టేషన్‌కు తీసుకెళ్లడానికి వీల్లేదని పట్టుబట్టారు. అదే సమయంలో ఎంపీ అనుచరులు లేమల్లె నుంచి రెండు ఆటోల్లో బస్సును వెంటాడుతూ వచ్చారు. మహిళా జేఏసీ  నేతలు వారిని గుర్తించి తమపై దాడి చేసింది వారేనని లింగాపురం రైతులకు చెప్పారు. అన్నదాతలు వారిని నిలదీసి ఎందుకు వెంటపడుతున్నారని ప్రశ్నించడంతో వారు దాడికి దిగారు. 


రైతులు కూడా ఎదురు దాడికి దిగారు. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు బస్సును రాత్రి సమయానికి అమరావతి స్టేషన్‌కు మరలించారు. బస్సు చేరుకోగానే.. అక్కడే ఉన్న రాజధాని జేఏసీ నాయకులు, రైతులు.. మహిళలపై దాడి చేసిన ఎంపీ అనుచరులను అరెస్టు చేయాలని, దుర్భాషలాడిన ఎంపీపై కేసు నమోదు చేయాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సమాచారం తెలుసుకున్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్లరామయ్య, గుంటూరు-2 టీడీపీ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర , గుంటూరు-1 ఇన్‌చార్జి నజీర్‌ అహ్మద్‌, సీపీఐ రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్‌కుమార్‌, జేఏసీ నాయకులు శ్రీనివాసరావు, గద్దె తిరుపతిరావు, తెలుగు యువత నాయకులు మన్నెం మల్లి, కొమ్మాలపాటి సాయిసుధాకర్‌ తదితరులు స్టేషన్‌ వద్దకు వచ్చారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐలతో మాట్లాడారు. ఎంపీ అనుచరులపై కేసు నమోదు చేయాలని కోరారు. బాధిత మహిళలు జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో రాష్ట్ర జేఏసీ కన్వీనర్‌ సుంకర పద్మశ్రీ, వేగుంట రాణి తదితరులు ఉన్నారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు.

Updated Date - 2020-02-24T08:54:33+05:30 IST